తొలగని సందిగ్ధత
తొలగని సందిగ్ధత
Published Mon, Aug 15 2016 11:49 AM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా మంచిర్యాల(కొమరం భీమ్) జిల్లా ఏర్పాటు ఖాయంగా కనిపిస్తుండగా.. నిర్మల్ జిల్లా ఏర్పాటు అంశంపై ఇంకా ఉత్కంఠ వీడడం లేదు. 26 మండలాలతో మంచిర్యాల, 16 మండలాలతో ఆదిలాబాద్, 15 మండలాలతో నిర్మల్ జిల్లా ఏర్పాటుకు తాజా ప్రతిపాదనలు పంపినట్లు అధికార యంత్రాంగం పేర్కొంటున్నప్పటికీ., ఉద్యోగుల విభజన, కార్యాలయాల భవనాలు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై కసరత్తు మాత్రం రెండు(ఆదిలాబాద్, కొమరం భీమ్) జిల్లాలకే పరిమితం చేస్తోంది. తాజాగా పోలీసు శాఖ కూడా ఆదిలాబాద్, మంచిర్యాల.. రెండు జిల్లాలను దృష్టి పెట్టుకునే విభజన ప్రక్రియను కొనసాగిస్తుండడం గమనార్హం.
ఉద్యమాలు.. ఉహాగానాలు..
నిర్మల్ జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్‌లో చాలా రోజులుగా ఉద్యమం కొనసాగుతుండగా, తాజాగా నిర్మల్ జిల్లా ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆదిలాబాద్ పట్టణంలోనూ ఉద్యమం ఉధృతమవుతోంది. నిర్మల్ జిల్లా ఏర్పడితే ఆదిలాబాద్ పట్టణం మరింత వెనుకబడి పోతుందనే భావన స్థానికుల్లో వ్యక్తమవుతోంది. ఈ మేరకు నిర్మల్ జిల్లాను వ్యతిరేకిస్తూ శనివారం ఆదిలాబాద్ బంద్ నిర్వహించిన ఆదిలాబాద్ పరిరక్షణ సమితి, ఆదివారం కలెక్టర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ఇలా రెండు ప్రాంతాల్లో నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు పోటాపోటీగా సాగుతున్నాయి. ఈ ఉత్కంఠ పరిస్థితులు ఇలా కొనసాగుతుండగానే, సందెట్లో సడేమియా అన్న చందంగా నిర్మల్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. మూడు వెంచర్లు.. ఆరు ప్లాట్లు అన్న రీతిలో తమ రియల్ వ్యాపారాన్ని కొనసాగిస్తూ రూ.కోట్లు దండుకుంటున్నారు. నిర్మల్ జిల్లా ఏర్పడిన తర్వాత ప్లాట్ల ధరలు రెట్టింపు అవుతాయని నమ్మబలుకుతూ భారీగా భూ దందాకు తెరలేపారు. నిర్మల్ ప్రాంతంలో వెలసిన అనుమతిలేని అక్రమ వెంచర్లలోని ప్లాట్లన్నింటిని అమాయక ప్రజలకు అంటగడుతున్నారు. ఇటీవల కాలంలోనే నిర్మల్ పట్టణంలో భూముల క్రయవిక్రయాలు జోరందుకున్నాయి.
అమాత్యుల అభిప్రాయ భేదాలకు ఆజ్యం..
నిర్మల్‌ను జిల్లా చేయాలని ఒకరు.. జిల్లా చేస్తే ఆదిలాబాద్ అభివృద్ధికి విఘాతం కలుగుతుందని మరొకరు.. ఇలా ఇద్దరు జిల్లా మంత్రులు జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిల మధ్య యాధృచ్ఛికంగా అభిప్రాయభేదాలకు దారితీసింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో ఈ ఇద్దరు మంత్రులు వారివారి స్థానిక డిమాండ్ మేరకు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ముథోల్ నియోజకవర్గ దూరభారాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్మల్‌ను జిల్లా చేయాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మంత్రివర్గ ఉప సంఘానికి విజ్ఞప్తి చేయగా, నిర్మల్ జిల్లా చేసిన పక్షంలో ఆదిలాబాద్ అభివృద్ధిలో వెనుకబడుతుందని మంత్రి జోగు రామన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. విభజన కోసం ఏర్పాటు చేసిన సబ్‌కమిటీ ఇప్పటికే అన్ని జిల్లాల ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించింది. ఈ నెల 16న అన్ని రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావాలని భావిస్తోంది. ఈ సమావేశంలో నిర్మల్ జిల్లాపై కొంత మేరకు స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని జిల్లాకు చెందిన ఓ కీలక ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు.
Advertisement
Advertisement