separate districts
-
నల్లగొండ జిల్లాలో సీఎస్ రాజీవ్‌శర్మ పర్యటన
భువనగిరి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శనివారం నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న యాదాద్రి జిల్లాకు సంబంధించిన కలక్టరేట్, ఎస్పీ కార్యాలయాల కోసం భువనగిరిలో భవనాలను పరిశీలించారు. హైదరాబాద్ రోడ్డు సమీపంలోని పగిడిపల్లి వద్ద ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్‌ను కలక్టరేట్ భవనంగా, జగదేవ్‌పూర్ రోడ్డులో ఉన్న పాత బీఈడీ కళాశాలను ఎస్పీ కార్యాలయంగా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పాటు కాబోయే జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల విషయంలో ఎలాంటి రాజకీయాలకు తావులేదని.. ప్రజల అభిప్రాయం మేరకే ఏర్పాటు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అనంతరం సీఎస్ సూర్యాపేటకు బయల్దేరారు. అక్కడ కూడా నూతన జిల్లా కార్యాలయాలను సీఎస్ పరిశీలించనున్నారు. -
ట్రాఫిక్ లో చిక్కుకున్న మాజీ డిప్యూటీ సీఎం
యాదగిరిగుట్ట : నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని చిన్న కందుకూరు గ్రామాన్ని నూతనంగా ఏర్పాటు చేయబోయే మోటకొండూరు మండలంలో కలపొద్దని కోరుతూ.. గ్రామస్థులు శనివారం ఆందోళనకు దిగారు. వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలుపుతుండటంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. గ్రామానికి చెందిన విద్యార్థులు, రైతులు, యువకులు, ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డుపై కూర్చొని ఆందోళన నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్థులను అక్కడి నుంచి తప్పుకోవాలని ఎంత చెప్పినా వినకపోవడంతో తమ లాఠీలకు పనిచెప్పారు. భారీ ట్రాఫిక్ జాం వల్ల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మాజీ ఉప ముఖ్యమంత్రి, వరంగల్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వాహనం కూడా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయింది. పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసుందుకు ప్రయత్నిస్తున్నారు. -
విఘ్నాధిపతికి వినతుల హోరు
జిల్లా, డివిజన్, మండలాల కోసం.. భూలోకంలో వినాయకుడికి వింత అనుభవం.. నేరడిగొండ : ఇన్ని రోజులు దేవ లోకంలో విహరించిన విఘ్నాధిపతి నవరాత్రులను పురస్కరించుకుని భూలోకం బాటపట్టాడు. వినాయకుడు తన వాహనం ఎలుకపై ఆదిలాబాద్ జిల్లాలో దిగాడు. ఎంత సంబరంగా వచ్చాడో.. అంతే ఆశ్చర్యానికి లోనయ్యూడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేస్తుండడంతో జిల్లా అంతా సందడి నెలకొంది. నవరాత్రులు ముందే వచ్చాయూ అన్న సందేహం వ్యక్తం చేస్తూ.. ఏమయ్యూ మూషికమా ఆదిలాబాద్ జిల్లాలో ఈ హడావుడి ఏమిటో కనుక్కో.. అంటూ పురమాయించాడు. జిల్లాలో పునర్విభజన సాగుతోంది ప్రభూ.. బోథ్ నియోజకవర్గంలోని నేరడిగొండ, బోథ్ మండలాల ప్రజలు నిర్మల్ జిల్లాలో కలపాలని, ఇచ్చోడ, నేరడిగొండ మండలాలను ఆదిలాబాద్ డివిజన్లో కాకుండా ఉట్నూర్ డివిజన్లో కలపడంతో ఆయా మండలాల ప్రజలు రోడ్లపై రాస్తారోకోలు, ధర్నాలు చేస్తున్నారు స్వామి. నిర్మల్ కావాలి.. వద్దు.. నిర్మల్ జిల్లా కావాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు ప్రభు. ఆ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు కూడా. ఆదిలాబాద్ జిల్లాతోనే కలిపి ఉంచాలని, విడదిస్తే మరింత వెనుకబడుతుందని ఇక్కడి ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్వామి. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాల కోసం ప్రభుత్వానికి వేల సంఖ్యలో విన్నపాలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లోనూ అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి ప్రభు. నవరాత్రుల్లో మరిన్ని విన్నపాలు మీ వద్దకూ వచ్చేలా ఉన్నాయి స్వామి. గణేషుడు స్పందిస్తూ.. ఏదో ఒక భక్తుడి కోర్కెను తీర్చడం కాదు.. వేలాది మంది భక్తుల మదిలో నెలకొన్న సంశయాలు, కోర్కెలను ఈ తొమ్మిది రోజుల్లో తీర్చగలనా..? నవరాత్రులు ముగిసేసరికి సాధ్యమైనన్ని తీర్చేస్తా.. ఆ పైవన్నీ వాయిదాలకు వదిలేస్తా.. అనుకుంటూ ముందుకు కదిలారు. పాపం రైతులు.. రంగురంగుల ఆహార్యంతో ఠీవీ ఉట్టిపడే మీకు మట్టి విగ్రహాలు పెడుతున్నారు. ఇదంతా నీ ఆరోగ్యానికే సుమా అంటూ మూషికం చెబుతున్న మాటలతో గణేషుడు ఆలోచనలో పడ్డారు. రైతు కుటుంబాలు సంతోషంగా లేవు. లోకానికి తిండిపెట్టే రైతన్నకే అన్ని కష్టాలైతే ఎలా..? పండించే రైతుకు పెట్టుబడి రావడం లేదు. తిండి గింజలు పండించడానికి అవసరమైన మందులకు ధరలు పెరిగాయి. ఇంటిల్లిపాది కష్టపడినా అప్పులే మిగులుతున్నాయి. కూలీల సమస్యే కాదు.. పంటకయ్యే పెట్టుబడికి తగిన ధరను ప్రభుత్వం అందించేలా పాలకుల మనస్సు మారుస్తాను మూషికమా. ధరలు మండిపోతున్నాయి.. మహారాజా.. ఏ ఇంటికి వెళ్లినా తిండి గింజలు పెద్దగా లేవు. పంచదార ధర పెరిగింది. నీకిష్టమైన లడ్డూలు పెద్దవి లేవు. నీకేం పెడతారు.. డబ్బు లేదు.. కొనుగోలు చేద్దామంటే ఉన్న డబ్బు సరిపోదు. పత్రి, కాయ, ఉండ్రాళ్లు పెట్టాలన్నా ధరలు మండిపోతున్నాయి. చక్కెర, నెయ్యి, పప్పులకు వారానికో, నెలకోసారి ధరలు పెంచుతున్నారు. ప్రజలకు కష్టమై కొనడం లేదు. ఈసారి నీకు బొజ్జనిండదేమో స్వామీ..! -
నేటి నుంచి డీకే అరుణ నిరాహార దీక్ష
-
రేపటి నుంచి డీకే అరుణ నిరాహార దీక్ష
హైదారాబాద్: తెలంగాణలో ప్రత్యేక జిల్లాల ఆందోళనలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. తాజాగా గద్వాల జిల్లా కోరుతూ మాజీ మంత్రి డీకే అరుణ రెండు రోజుల నిరాహార దీక్ష చేయనున్నారు. శనివారం, ఆదివారం ఇందిరాపార్క్ వద్ద దీక్షకు దిగనున్నట్టు ప్రకటించారు. కాగా కొత్త జిల్లాల ముసాయిదా అశాస్ర్తియంగా ఉందని మాజీ మంత్రి డీకే అరుణ విమర్శించారు. ఇష్టానుసారంగా జిల్లాల విభజన చేస్తున్నారని మండిపడ్డారు. గద్వాల, జనగామలను జిల్లాలుగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
జిల్లాల ఏర్పాటుపై కొనసాగుతున్నఆందోళనలు
హైదరాబాద్: తమ తమ మండలాలను ప్రత్యేక జిల్లాలుగా ఏర్పాటు చేయాలంటూ పలు చోట్ల నిరసనలు, ధర్నాలు జరుగుతున్నాయి. శుక్రవారం గద్వాల జిల్లాను ఏర్పాటు చేయాలంటూ పట్టణంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సిరిసిల్ల జిల్లా ఏర్పాటులో మంత్రి కేటీఆర్ వైఖరికి నిరసనగా ఏడుగురు కౌన్సిలర్లు రాజీనామా చేశారు. జనగామ జిల్లా కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన విషయం తెల్సిందే. జనగామ జిల్లా కోసం భవిష్యత్ కార్యాచరణపై జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం జరిగింది. ఇంకా పలుచోట్ల ఒక జిల్లాలో కలిపిన మండలాలను మరో జిల్లాలో కలపాలని, రాష్ట్రంలో చాలా చోట్ల తమ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని ఆందోళనలు సాగుతున్నాయి. -
‘వికారాబాద్ జిల్లా కావడం సంతోషం’
వికారాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేస్తున్న 17 కొత్త జిల్లాల్లో వికారాబాద్‌కు కూడా స్థానం దక్కడం ఎంతో సంతోషంగా ఉందని స్థానిక ఎమ్మెల్యే సంజీవరావు అన్నారు. వికారాబాద్‌ను జిల్లా కేంద్రంగా ప్రకటించిన శుభ సందర్భంగా.. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు ఈ రోజు సంబరాలు జరుపుకున్నారు. పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచుకుంటూ ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. -
హుస్నాబాద్‌లో పోలీసుల లాఠీచార్జి
హుస్నాబాద్: కరీంనగర్ జిల్లా హుస్నాబాద్, కోహెడ మండలాలను సిద్ధిపేటలో కలపవద్దంటూ ప్రజలు ఆందోళనకు దిగారు. సిద్ధిపేటలో కలపడాన్ని నిరసిస్తూ పట్టణంలో ప్రజలు ర్యాలీ తీశారు. పలుచోట్ల పోలీసులకు ప్రజలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
దశాబ్దాల కల.. మంచిర్యాల
ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు మంచిర్యాలలో జిల్లా ఏర్పాటు సంబురాలు హాజరైన ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, కోనప్ప మంచిర్యాల టౌన్ : జిల్లా కేంద్రానికి 200ల కిలోమీటర్లకు పైగా దూరం ఉండి, సరైన రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడ్డ తూర్పు జిల్లా ప్రజల మంచిర్యాల జిల్లా కల నెరవేరుతోందని ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు అన్నారు. తెలంగాణలో నూతన జిల్లాల ఏర్పాటు కోసం ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేయడంపై మంచిర్యాలలో సంబురాలు అంబరాన్నంటాయి. సోమవారం ఉదయం 10 గంటల నుంచే మంచిర్యాల ఐబీ చౌరస్తాలో సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్బంగా నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు, సంఘాలు, ప్రజానాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక మంచిర్యాల పట్టణంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అన్ని వర్గాల ప్రజలు, సంస్థలు, పలు సంఘాలు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా ర్యాలీ నిర్వహించారో, అదే రీతిలో కొత్తగా ఏర్పడనున్న కొమురంభీం(మంచిర్యాల) జిల్లా ఏర్పాటు ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ సంబరాల శిబిరానికి ర్యాలీగా తరలివచ్చారు. నూతన జిల్లాకు మంచి జరగాలని పండితులు, ముస్లిం మత పెద్దలతో పూజలను నిర్వహించారు. సిర్పూర్(టి) ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ, ఇక ఇక్కడి ప్రజలకు దూర భారం తగ్గిందని, ఇదే పెద్ద ఆనందమని అన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ, ఇక్కడి ప్రజల ఎన్నో ఏళ్ల ఆకాంక్ష నెరవేరినట్లేనని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో సీఎం కేసీఆర్‌కు ఎవరూ సాటిరారన్నారు. అనంతరం అక్కడే ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ మామిడిశెట్టి వసుంధర రమేశ్, జెడ్పీటీసీ రాచకొండ ఆశాలత, మమత సూపర్ బజార్ సొసైటీ చైర్మన్ యై తిరుపతి, కౌన్సిలర్లు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. ఆటలు.. ర్యాలీలు.. టపాసులు పట్టణ ఐకేపీ ఆధ్వర్యంలో కొత్త జిల్లా ఏర్పాటుతో మహిళా సంఘాల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. అలాగే ట్రాక్టర్స్ యజమానుల సేవా సమితి ఆధ్వర్యంలో పట్టణంలో ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి, బాణసంచా కాల్చి సంబరాలను జరుపుకున్నారు. ట్రాక్టర్ యజమానుల సేవా సమితి ముఖ్య సలహాదారు పల్లపు తిరుపతి, బగ్గని రవి, అధ్యక్షులు గొడిశెల దశరథం, గౌరవ అధ్యక్షులు బోరిగం వెంకటేశం, ఉపాధ్యక్షులు ఈ.హన్మంతు, ప్రధాన కార్యదర్శి ఎండీ.తాజొద్దీన్, జాయింట్ కార్యదర్శి పల్లపు రవి పాల్గొన్నారు. -
‘నిర్మల్ జిల్లా’ సంబరాలు
నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల ప్రజలు, నాయకుల్లో ఆనందం నిర్మల్‌లో అల్లోలకు ఘన స్వాగతం పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్మల్ టౌన్/నిర్మల్ రూరల్ : నిర్మల్ జిల్లా ముసాయిదా ప్రకటన అనంతరం ఇక్కడికి తొలిసారిగా వచ్చిన రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి టీఆర్ఎస్, వివిధ సంఘాల నాయకులు సోమవారం ఘన స్వా గతం పలికారు. మండలంలోని సోన్ వద్దకు చేరుకోగానే పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా సన్మానించారు. అనంతరం సోన్ నుంచి టీఆర్ఎస్ నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యా లీ మంచిర్యాల చౌరస్తా మీదుగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి నివాసానికి చేరుకుంది. అనంతరం మంత్రి నివాసంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభి షేకం చేశారు. పట్టణంలో నాయకులు ర్యాలీ నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. మంత్రితో పాటు ఆయన కుమారుడు గౌతమ్‌రెడ్డి నృత్యం చేసి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్, మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేశ్‌చక్రవర్తి, ఎంపీపీ సుమతిగోవర్ధన్రెడ్డి, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, అల్లోల మురళీధర్‌రెడ్డి, కౌన్సిలర్లు అయ్యన్నగారి రాజేందర్, భూపతిరెడ్డి, అంగ నరేశ్, నేల్ల అరుణ్, నాయకులు పాకాల రాంచందర్, రాము, ముడుసు సత్యనారాయణ, ప్రదీప్, ఎస్పీ రాజు, తోట నర్సయ్య పాల్గొన్నారు. కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు నిర్మల్ రూరల్ : ప్రజల కష్టాలను తెలుసుకుని, తానే స్వయంగా పరిశీలించి కొత్త జిల్లాగా నిర్మల్‌ను ఏర్పాటు చేస్తున్న సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్‌లోని తన స్వగృహంలో సోమవారం ఆయన మాట్లాడుతూ, ఆందోళనలు చేసినంత మాత్రాన కొత్త జిల్లా ఏర్పాటు ఆగిపోదని స్పష్టం చేశారు. ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధూను నిర్మల్‌కు ఆహ్వానించి సన్మానిస్తామని అన్నారు. నిర్మల్‌లోనే జన్మించిన ఆమె తండ్రి రమణతో తాను ఈ విషయం మాట్లాడానని చెప్పారు. సాధించాం.. విఠల్ నిర్మల్ రూరల్ : ‘సాధించాం.. విఠల్. ప్రజల ఆకాంక్ష మేరకు నిర్మల్ జిల్లా కల నె రవేరింది. ఇక అభివృద్ధిపై దృష్టిపెడదాం..’ అంటూ ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డిని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. సోమవారం నిర్మల్‌కు చేరుకున్న మంత్రిని ఆయన స్వగృహంలో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి కలిశారు. జిల్లా ఏర్పాటుకు కృషిచేసిన మంత్రి, ఎమ్మెల్యేను టీఆర్ఎస్ నాయకులు గజమాలతో సన్మానించారు. -
ఉత్కంఠకు తెర
మూడుగా చీలుతున్న ఆదిలాబాద్ జిల్లా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం కొత్తగా కొమురంభీమ్, నిర్మల్ జిల్లాలు రెవెన్యూ డివిజన్లుగా భైంసా, బెల్లంపల్లి నెల రోజుల పాటు అభ్యంతరాల స్వీకరణ జిల్లావ్యాప్తంగా అంబరాన్నంటిన సంబరాలు సాక్షి, మంచిర్యాల: ఏళ్ల ఉత్కంఠకు తెరపడింది. కొత్త జిల్లాలు.. రెవెన్యూ డివిజన్లు.. మండలాల ఏర్పాటుపై స్పష్టత వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా.. ఎట్టకేలకు మూడుగా చీలనుంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి టి-సర్కార్ సోమవారం ముసాయిదాను జారీ చేసింది. పాలన సౌలభ్యం... అన్ని రంగాల అభివృద్ధి కోసం కొత్త జిల్లాలు ఏర్పాటుకు సంబంధించి.. అధికారులు, ప్రజాప్రతినిధులతో సుదీర్ఘంగా నిర్వహించిన సమీక్షలు.. సమావేశాలు.. చర్చలతో పాటు క్షేత్రస్థాయిలో అధికారులిచ్చిన ప్రతిపాదనలు.. ప్రజల డిమాండ్లను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం కొత్తగా.. కొమురంభీమ్, నిర్మల్ జిల్లాలను ఖరారు చేసింది. దీంతో ముచ్చటగా మూడు జిల్లాలు ఏర్పడనున్నారుు. పెద్ద జిల్లాగా కొమురంభీమ్ కొమురంభీమ్ (మంచిర్యాల) జిల్లా.. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల క ంటే ఎక్కువ రెవెన్యూ డివిజన్లు.. మండలాలు కలిగిన జిల్లాగా అవతరించనుంది. మొత్తం 25 మండలాలతో కొత్త జిల్లాగా ఏర్పడనుంది. ప్రస్తుతమున్న మంచిర్యాల, ఆసిఫాబాద్ డివిజన్లతో పాటు కొత్తగా ఏర్పడిన బెల్లంపల్లి కూడా కొమురంభీమ్ పరిధిలోనిదే. ఇప్పటి వరకు మొత్తం 52 మండలాలతో ఉన్న ఆదిలాబాద్ జిల్లా 16 మండలాలకే పరిమితమైంది. ప్రస్తుతం మొత్తం ఐదు రెవెన్యూ డివిజన్లతో కూడిన ఈ జిల్లా కేవలం ఆదిలాబాద్, ఉట్నూరు రెవెన్యూ డివిజన్లతోనే సరిపెట్టుకోనుంది. ఇక.. అనూహ్యంగా తెరపైకొచ్చి కొత్తగా ఏర్పడిన నిర్మల్ జిల్లా.. కేవలం 13 మండలాలు కలిగిన చిన్న జిల్లాగా అవతరించనుంది. ప్రస్తుతమున్న నిర్మల్ రెవెన్యూ డివిజన్‌తో పాటు కొత్తగా ఏర్పడిన భైంసా రెవెన్యూ డివిజన్ కూడా ఈ జిల్లా పరిధిలో ఉంది. కొత్త మండలాలు రెండే.. జిల్లాల పునర్విభజనలో భాగంగా.. కొత్త మండలాల ఏర్పాటుపై ఉన్న ఉత్కంఠకూ తెరపడింది. పశ్చిమ ప్రాంత పరిధిలోని ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న మావల మేజర్ గ్రామ పంచాయతీని కొత్త మండలంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ‘తూర్పు’లో ఉన్న మంచిర్యాల మండల పరిధిలోని నస్పూర్ మేజర్ గ్రామ పంచాయతీని కొత్త మండలంగా చేస్తూ ముసాయిదా విడుదల చేసింది. ఆదిలాబాద్ మండల పరిధిలో ఉన్న 45 గ్రామాల్లో.. మావల (9633), బట్టిసావర్గావ్ (7172), వాగాపూర్ (1407), దస్నాపూర్(22,216) నాలుగు గ్రామాలను వేరు చేసి మొత్తం 40,428 జనాభాతో ‘మావల’ మండలం ఏర్పాటు చేయనుంది. అలాగే.. 28 పంచాయతీలున్న మంచిర్యాల మండలం నుంచి 31,244 జనాభా ఉన్న నస్పూర్ , సింగాపూర్ (20,061), తీగల్‌పహాడ్ (12,656) తాళ్లపల్లి (9,656), సీతారాంపల్లి (3,024) గ్రామాలతో కొత్తగా నస్పూర్ మండలం ఏర్పాటు కానుంది. ఈ ఐదు గ్రామాల జనాభా 76,641. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు బెజ్జూర్ మండల పరిధిలో ఉన్న పెంచికల్‌పేట, నిర్మల్ మండల పరిధిలోని సోన్, మంచిర్యాల మండల పరిధిలోని హాజీపూర్ గ్రామ పంచాయతీలనూ మండలాలుగా చేయాలన్న డిమాండ్.. అధికారుల ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరిన విషయం తెలిసిందే. కానీ జిల్లాలో కేవలం రెండు మండలాలు మాత్రమే ఏర్పాటు కానుండడంతో మిగిలిన మండలాల ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. కాగా.. నిర్మల్ మండల పరిధిలోని సోన్నూ కొత్త మండలంగా చేయాలని సీఎం కేసీఆర్‌కు నిర్మల్ ఎమ్మెల్యే, దేవాదాయ శాఖ మంత్రి ఐకే రెడ్డి చేసిన విన్నపం నెరవేరలేదు. అన్నీ పరిగణలోకి తీసుకుని.. ముందు ఇచ్చిన హామి మేరకు.. మంచిర్యాలను కొమురంభీమ్ పేరుతో జిల్లాగా ఏర్పాటు చేసి.. తర్వాత తెరపైకొచ్చిన నిర్మల్ జిల్లా డిమాండ్‌నూ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. నిర్మల్‌నూ జిల్లాగా మారుస్తూ.. కొన్నాళ్లుగా నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరదించింది. ఆదిలాబాద్ జిల్లాను 16 మండలాలతో పరిమితం చేయగా.. 25 మండలాలతో కొమురంభీమ్.. 13 మండలాలతో నిర్మల్ జిల్లాను ప్రకటించింది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల పరిధిల్లో రెండు చొప్పున రెవెన్యూ డివిజన్లు రాగా.. కొమురం భీం జిల్లా కింద మూడు డివిజన్లు రానున్నాయి. జిల్లాలతో పాటు కొత్తగా బెల్లంపల్లి, భైంసానూ రెవిన్యూ డివిజన్లుగా చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో పాటు తూర్పు ప్రాంత పరిధిలోని నస్పూర్, పశ్చిమ ప్రాంతంలోని మావల గ్రామ పంచాయతీలను మండలాలుగా ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే.. మండలాల విలీనం విషయంలోనూ ప్రభుత్వం స్థానికుల డిమాండ్.. ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంది. జన్నారం మండలాన్ని కొత్తగా ఏర్పాటు చేసే నిర్మల్‌లో కాకుండా కొమురంభీమ్ జిల్లాలో కలపాలని... కెరమెరి మండలాన్ని ఆదిలాబాద్‌లో కాకుండా కొమురంభీమ్ జిల్లాలో కలపాలన్న ప్రజల డిమాండ్‌కు తలొగ్గిన ప్రభుత్వం ఆ రెండు మండలాలను కొమురంభీమ్ జిల్లాలో కలిపింది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కాపీని వెబ్‌పోర్టల్‌లో అందుబాటులో ఉంచిన ప్రభుత్వం.. కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం నెల రోజుల గడువిచ్చింది. ఏవైనా అభ్యంతరాలుంటే.. ఆయా జిల్లాల కలెక్టరేట్లు.. సీసీఎల్ఏలో తమ సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని అందులో పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలో సంబరాలు అంబరాన్నంటాయి. రెండు రెవె‘న్యూ’ డివిజన్లు కొత్త జిల్లాలతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్ల నిరీక్షణ ఫలించింది. కొత్తగా బెల్లంపల్లి, భైంసా రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ముసాయిదా విడుదల చేసింది. పశ్చిమ ప్రాంత పరిధిలోని.. భైంసా, కుభీర్, కుంటాల, ముథోల్, లోకేశ్వరం, తానూరు మండలాలతో భైంసా కొత్త రెవెన్యూ డివిజన్‌గా అవతరించనుంది. తూర్పు ప్రాంత పరిధిలోని బెల్లంపల్లి, కాసిపేట, వేమనపల్లి, నెన్నెల, తిర్యాణి, తాండూరు, భీమిని, దహెగాం మొత్తం ఎనిమిది మండలాలతో బెల్లంపల్లి కొత్త రెవెన్యూ డివిజన్‌గా రూపుదిద్దుకోనుంది. మూడుగా చీలిన ఖానాపూర్ నియోజకవర్గం జిల్లాల పునర్విభజన పుణ్యమా.. అని ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం మూడు జిల్లాలకు విభజించారు. నియోజకవర్గ పరిధిలో ఉట్నూరు, ఖానాపూర్, ఇంద్రవెల్లి, కడెం, జన్నారం మండలాలున్నాయి. అయితే పాలనా సౌలభ్యం కోసం జరిగిన జిల్లాల పునర్విభజనలో ఉట్నూరు, ఇంద్రవెల్లి మండలాలు ఆదిలాబాద్ జిల్లాలో కలిశాయి. ఖానాపూర్, కడెం మండలాలు నిర్మల్‌కు జతకట్టాయి. జన్నారం మండలం కొమురంభీమ్ జిల్లాలో కలిసింది. జిల్లాల పునర్విభజనపై అభ్యంతరాల స్వీకరణ 30 రోజుల వరకు గడువు ఆదిలాబాద్ : తెలంగాణ జిల్లాల పునర్విభజనపై అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ ఎం.జగన్మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. పునర్విభజన ప్రతిపాదనలపై ఎవరికైనా అభ్యంతరాలు ఉన్న పక్షంలో కలెక్టర్ కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. సోమవారం నుంచి 30 రోజుల పాటు కార్యాలయం పనివేళల్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరిపాలన అధికారి (ఏఓ)కు అందజేయవచ్చని తెలిపారు. ఫోన్లోనూ.. అభ్యంతరాలను కలెక్టర్ కార్యాలయం సెల్ నంబర్‌కు కూడా తెలియజేయవచ్చు. సెల్ నం. 94910 53564 ఆదిలాబాద్ జిల్లా రెవెన్యూ డివిజన్లు(2) మండలాలు(16) 1. ఆదిలాబాద్ ఆదిలాబాద్, మావల(న్యూ), బజార్హత్నూర్, బేల, బోథ్, జైనథ్, తాంసి, తలమడుగు, గుడిహత్నూర్ 2. ఉట్నూర్ ఉట్నూరు, ఇంద్రవెల్లి, జైనూర్, నార్నూర్, సిర్పూర్(యు), ఇచ్చోడ, నేరడిగొండ కొమురంభీమ్ జిల్లా రెవెన్యూ డివిజన్లు(3) మండలాలు(25) 1. కొమురంభీమ్ మంచిర్యాల, చెన్నూర్, జైపూర్, కోటపల్లి, లక్సెట్టిపేట, దండేపల్లి, నస్పూర్(న్యూ), మందమర్రి, జన్నారం 2. బెల్లంపల్లి(న్యూ) కాసిపేట, బెల్లంపల్లి, వేమనపల్లి, నెన్నెల, తిర్యాణి, తాండూర్, భీమిని, దహెగాం 3. ఆసిఫాబాద్ ఆసిఫాబాద్, బెజ్జూరు, కాగజ్‌నగర్, కౌటాల, రెబ్బెన, సిర్పూర్ (టి), కెరమెరి, వాంకిడి నిర్మల్ జిల్లా రెవెన్యూ డివిజన్లు(2) మండలాలు(13) 1.నిర్మల్ నిర్మల్, దిలావర్పూర్, కడెం, ఖానాపూర్, మామడ, లక్ష్మణచాంద, సారంగాపూర్ 2. భైంసా(న్యూ) కుభీర్, కుంటాల, భైంసా, ముథోల్, లోకేశ్వరం, తానూరు -
తొలగని సందిగ్ధత
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా మంచిర్యాల(కొమరం భీమ్) జిల్లా ఏర్పాటు ఖాయంగా కనిపిస్తుండగా.. నిర్మల్ జిల్లా ఏర్పాటు అంశంపై ఇంకా ఉత్కంఠ వీడడం లేదు. 26 మండలాలతో మంచిర్యాల, 16 మండలాలతో ఆదిలాబాద్, 15 మండలాలతో నిర్మల్ జిల్లా ఏర్పాటుకు తాజా ప్రతిపాదనలు పంపినట్లు అధికార యంత్రాంగం పేర్కొంటున్నప్పటికీ., ఉద్యోగుల విభజన, కార్యాలయాల భవనాలు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై కసరత్తు మాత్రం రెండు(ఆదిలాబాద్, కొమరం భీమ్) జిల్లాలకే పరిమితం చేస్తోంది. తాజాగా పోలీసు శాఖ కూడా ఆదిలాబాద్, మంచిర్యాల.. రెండు జిల్లాలను దృష్టి పెట్టుకునే విభజన ప్రక్రియను కొనసాగిస్తుండడం గమనార్హం. ఉద్యమాలు.. ఉహాగానాలు.. నిర్మల్ జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్‌లో చాలా రోజులుగా ఉద్యమం కొనసాగుతుండగా, తాజాగా నిర్మల్ జిల్లా ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆదిలాబాద్ పట్టణంలోనూ ఉద్యమం ఉధృతమవుతోంది. నిర్మల్ జిల్లా ఏర్పడితే ఆదిలాబాద్ పట్టణం మరింత వెనుకబడి పోతుందనే భావన స్థానికుల్లో వ్యక్తమవుతోంది. ఈ మేరకు నిర్మల్ జిల్లాను వ్యతిరేకిస్తూ శనివారం ఆదిలాబాద్ బంద్ నిర్వహించిన ఆదిలాబాద్ పరిరక్షణ సమితి, ఆదివారం కలెక్టర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ఇలా రెండు ప్రాంతాల్లో నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు పోటాపోటీగా సాగుతున్నాయి. ఈ ఉత్కంఠ పరిస్థితులు ఇలా కొనసాగుతుండగానే, సందెట్లో సడేమియా అన్న చందంగా నిర్మల్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. మూడు వెంచర్లు.. ఆరు ప్లాట్లు అన్న రీతిలో తమ రియల్ వ్యాపారాన్ని కొనసాగిస్తూ రూ.కోట్లు దండుకుంటున్నారు. నిర్మల్ జిల్లా ఏర్పడిన తర్వాత ప్లాట్ల ధరలు రెట్టింపు అవుతాయని నమ్మబలుకుతూ భారీగా భూ దందాకు తెరలేపారు. నిర్మల్ ప్రాంతంలో వెలసిన అనుమతిలేని అక్రమ వెంచర్లలోని ప్లాట్లన్నింటిని అమాయక ప్రజలకు అంటగడుతున్నారు. ఇటీవల కాలంలోనే నిర్మల్ పట్టణంలో భూముల క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. అమాత్యుల అభిప్రాయ భేదాలకు ఆజ్యం.. నిర్మల్‌ను జిల్లా చేయాలని ఒకరు.. జిల్లా చేస్తే ఆదిలాబాద్ అభివృద్ధికి విఘాతం కలుగుతుందని మరొకరు.. ఇలా ఇద్దరు జిల్లా మంత్రులు జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిల మధ్య యాధృచ్ఛికంగా అభిప్రాయభేదాలకు దారితీసింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో ఈ ఇద్దరు మంత్రులు వారివారి స్థానిక డిమాండ్ మేరకు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ముథోల్ నియోజకవర్గ దూరభారాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్మల్‌ను జిల్లా చేయాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మంత్రివర్గ ఉప సంఘానికి విజ్ఞప్తి చేయగా, నిర్మల్ జిల్లా చేసిన పక్షంలో ఆదిలాబాద్ అభివృద్ధిలో వెనుకబడుతుందని మంత్రి జోగు రామన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. విభజన కోసం ఏర్పాటు చేసిన సబ్‌కమిటీ ఇప్పటికే అన్ని జిల్లాల ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించింది. ఈ నెల 16న అన్ని రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావాలని భావిస్తోంది. ఈ సమావేశంలో నిర్మల్ జిల్లాపై కొంత మేరకు స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని జిల్లాకు చెందిన ఓ కీలక ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. -
దద్దరిల్లిన జనగామ
జనగామ: వరంగల్ జిల్లా జనగామ సోమవారం విద్యార్థుల నినాదాలతో మారుమోగిపోయింది. కొత్తగా ప్రతిపాదించిన జిల్లాల జాబితాలో జనగామను కూడా చేర్చాలంటూ జాతీయరహదారిపై ఐకాస ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారం చేపట్టారు. రెండుగంటల పాటు జాతీయరహదారిపై రాస్తారోకో చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, జనగామను జిల్లాగా చేయాలని నినాదాలు చేశారు.దీంతో పెద్ద ఎత్తున వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన కారులను విరమింపజేశారు.