విఘ్నాధిపతికి వినతుల హోరు
Published Tue, Sep 6 2016 2:28 PM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM
జిల్లా, డివిజన్, మండలాల కోసం..
భూలోకంలో వినాయకుడికి వింత అనుభవం..
నేరడిగొండ : ఇన్ని రోజులు దేవ లోకంలో విహరించిన విఘ్నాధిపతి నవరాత్రులను పురస్కరించుకుని భూలోకం బాటపట్టాడు. వినాయకుడు తన వాహనం ఎలుకపై ఆదిలాబాద్ జిల్లాలో దిగాడు. ఎంత సంబరంగా వచ్చాడో.. అంతే ఆశ్చర్యానికి లోనయ్యూడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేస్తుండడంతో జిల్లా అంతా సందడి నెలకొంది. నవరాత్రులు ముందే వచ్చాయూ అన్న సందేహం వ్యక్తం చేస్తూ.. ఏమయ్యూ మూషికమా ఆదిలాబాద్ జిల్లాలో ఈ హడావుడి ఏమిటో కనుక్కో.. అంటూ పురమాయించాడు. జిల్లాలో పునర్విభజన సాగుతోంది ప్రభూ.. బోథ్ నియోజకవర్గంలోని నేరడిగొండ, బోథ్ మండలాల ప్రజలు నిర్మల్ జిల్లాలో కలపాలని, ఇచ్చోడ, నేరడిగొండ మండలాలను ఆదిలాబాద్ డివిజన్‌లో కాకుండా ఉట్నూర్ డివిజన్‌లో కలపడంతో ఆయా మండలాల ప్రజలు రోడ్లపై రాస్తారోకోలు, ధర్నాలు చేస్తున్నారు స్వామి.
నిర్మల్ కావాలి.. వద్దు..
నిర్మల్ జిల్లా కావాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు ప్రభు. ఆ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు కూడా. ఆదిలాబాద్ జిల్లాతోనే కలిపి ఉంచాలని, విడదిస్తే మరింత వెనుకబడుతుందని ఇక్కడి ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్వామి. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాల కోసం ప్రభుత్వానికి వేల సంఖ్యలో విన్నపాలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లోనూ అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి ప్రభు. నవరాత్రుల్లో మరిన్ని విన్నపాలు మీ వద్దకూ వచ్చేలా ఉన్నాయి స్వామి. గణేషుడు స్పందిస్తూ.. ఏదో ఒక భక్తుడి కోర్కెను తీర్చడం కాదు.. వేలాది మంది భక్తుల మదిలో నెలకొన్న సంశయాలు, కోర్కెలను ఈ తొమ్మిది రోజుల్లో తీర్చగలనా..? నవరాత్రులు ముగిసేసరికి సాధ్యమైనన్ని తీర్చేస్తా.. ఆ పైవన్నీ వాయిదాలకు వదిలేస్తా.. అనుకుంటూ ముందుకు కదిలారు.
పాపం రైతులు..
రంగురంగుల ఆహార్యంతో ఠీవీ ఉట్టిపడే మీకు మట్టి విగ్రహాలు పెడుతున్నారు. ఇదంతా నీ ఆరోగ్యానికే సుమా అంటూ మూషికం చెబుతున్న మాటలతో గణేషుడు ఆలోచనలో పడ్డారు. రైతు కుటుంబాలు సంతోషంగా లేవు. లోకానికి తిండిపెట్టే రైతన్నకే అన్ని కష్టాలైతే ఎలా..? పండించే రైతుకు పెట్టుబడి రావడం లేదు. తిండి గింజలు పండించడానికి అవసరమైన మందులకు ధరలు పెరిగాయి. ఇంటిల్లిపాది కష్టపడినా అప్పులే మిగులుతున్నాయి. కూలీల సమస్యే కాదు.. పంటకయ్యే పెట్టుబడికి తగిన ధరను ప్రభుత్వం అందించేలా పాలకుల మనస్సు మారుస్తాను మూషికమా.
ధరలు మండిపోతున్నాయి..
మహారాజా.. ఏ ఇంటికి వెళ్లినా తిండి గింజలు పెద్దగా లేవు. పంచదార ధర పెరిగింది. నీకిష్టమైన లడ్డూలు పెద్దవి లేవు. నీకేం పెడతారు.. డబ్బు లేదు.. కొనుగోలు చేద్దామంటే ఉన్న డబ్బు సరిపోదు. పత్రి, కాయ, ఉండ్రాళ్లు పెట్టాలన్నా ధరలు మండిపోతున్నాయి. చక్కెర, నెయ్యి, పప్పులకు వారానికో, నెలకోసారి ధరలు పెంచుతున్నారు. ప్రజలకు కష్టమై కొనడం లేదు. ఈసారి నీకు బొజ్జనిండదేమో స్వామీ..!
Advertisement
Advertisement