దశాబ్దాల కల.. మంచిర్యాల
దశాబ్దాల కల.. మంచిర్యాల
Published Tue, Aug 23 2016 11:35 AM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM
ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు
మంచిర్యాలలో జిల్లా ఏర్పాటు సంబురాలు
హాజరైన ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, కోనప్ప
మంచిర్యాల టౌన్ : జిల్లా కేంద్రానికి 200ల కిలోమీటర్లకు పైగా దూరం ఉండి, సరైన రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడ్డ తూర్పు జిల్లా ప్రజల మంచిర్యాల జిల్లా కల నెరవేరుతోందని ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు అన్నారు. తెలంగాణలో నూతన జిల్లాల ఏర్పాటు కోసం ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేయడంపై మంచిర్యాలలో సంబురాలు అంబరాన్నంటాయి. సోమవారం ఉదయం 10 గంటల నుంచే మంచిర్యాల ఐబీ చౌరస్తాలో సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్బంగా నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు, సంఘాలు, ప్రజానాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక మంచిర్యాల పట్టణంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అన్ని వర్గాల ప్రజలు, సంస్థలు, పలు సంఘాలు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా ర్యాలీ నిర్వహించారో, అదే రీతిలో కొత్తగా ఏర్పడనున్న కొమురంభీం(మంచిర్యాల) జిల్లా ఏర్పాటు ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ సంబరాల శిబిరానికి ర్యాలీగా తరలివచ్చారు. నూతన జిల్లాకు మంచి జరగాలని పండితులు, ముస్లిం మత పెద్దలతో పూజలను నిర్వహించారు. సిర్పూర్(టి) ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ, ఇక ఇక్కడి ప్రజలకు దూర భారం తగ్గిందని, ఇదే పెద్ద ఆనందమని అన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ, ఇక్కడి ప్రజల ఎన్నో ఏళ్ల ఆకాంక్ష నెరవేరినట్లేనని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో సీఎం కేసీఆర్‌కు ఎవరూ సాటిరారన్నారు. అనంతరం అక్కడే ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ మామిడిశెట్టి వసుంధర రమేశ్, జెడ్పీటీసీ రాచకొండ ఆశాలత, మమత సూపర్ బజార్ సొసైటీ చైర్మన్ యై తిరుపతి, కౌన్సిలర్లు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు.
ఆటలు.. ర్యాలీలు.. టపాసులు
పట్టణ ఐకేపీ ఆధ్వర్యంలో కొత్త జిల్లా ఏర్పాటుతో మహిళా సంఘాల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. అలాగే ట్రాక్టర్స్ యజమానుల సేవా సమితి ఆధ్వర్యంలో పట్టణంలో ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి, బాణసంచా కాల్చి సంబరాలను జరుపుకున్నారు. ట్రాక్టర్ యజమానుల సేవా సమితి ముఖ్య సలహాదారు పల్లపు తిరుపతి, బగ్గని రవి, అధ్యక్షులు గొడిశెల దశరథం, గౌరవ అధ్యక్షులు బోరిగం వెంకటేశం, ఉపాధ్యక్షులు ఈ.హన్మంతు, ప్రధాన కార్యదర్శి ఎండీ.తాజొద్దీన్, జాయింట్ కార్యదర్శి పల్లపు రవి పాల్గొన్నారు.
Advertisement
Advertisement