ఉత్కంఠకు తెర
ఉత్కంఠకు తెర
Published Tue, Aug 23 2016 11:27 AM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM
మూడుగా చీలుతున్న ఆదిలాబాద్ జిల్లా
డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం
కొత్తగా కొమురంభీమ్, నిర్మల్ జిల్లాలు
రెవెన్యూ డివిజన్లుగా భైంసా, బెల్లంపల్లి
నెల రోజుల పాటు అభ్యంతరాల స్వీకరణ
జిల్లావ్యాప్తంగా అంబరాన్నంటిన సంబరాలు
సాక్షి, మంచిర్యాల: ఏళ్ల ఉత్కంఠకు తెరపడింది. కొత్త జిల్లాలు.. రెవెన్యూ డివిజన్లు.. మండలాల ఏర్పాటుపై స్పష్టత వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా.. ఎట్టకేలకు మూడుగా చీలనుంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి టి-సర్కార్ సోమవారం ముసాయిదాను జారీ చేసింది. పాలన సౌలభ్యం... అన్ని రంగాల అభివృద్ధి కోసం కొత్త జిల్లాలు ఏర్పాటుకు సంబంధించి.. అధికారులు, ప్రజాప్రతినిధులతో సుదీర్ఘంగా నిర్వహించిన సమీక్షలు.. సమావేశాలు.. చర్చలతో పాటు క్షేత్రస్థాయిలో అధికారులిచ్చిన ప్రతిపాదనలు.. ప్రజల డిమాండ్లను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం కొత్తగా.. కొమురంభీమ్, నిర్మల్ జిల్లాలను ఖరారు చేసింది. దీంతో ముచ్చటగా మూడు జిల్లాలు ఏర్పడనున్నారుు.
పెద్ద జిల్లాగా కొమురంభీమ్
కొమురంభీమ్ (మంచిర్యాల) జిల్లా.. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల క ంటే ఎక్కువ రెవెన్యూ డివిజన్లు.. మండలాలు కలిగిన జిల్లాగా అవతరించనుంది. మొత్తం 25 మండలాలతో కొత్త జిల్లాగా ఏర్పడనుంది. ప్రస్తుతమున్న మంచిర్యాల, ఆసిఫాబాద్ డివిజన్లతో పాటు కొత్తగా ఏర్పడిన బెల్లంపల్లి కూడా కొమురంభీమ్ పరిధిలోనిదే. ఇప్పటి వరకు మొత్తం 52 మండలాలతో ఉన్న ఆదిలాబాద్ జిల్లా 16 మండలాలకే పరిమితమైంది. ప్రస్తుతం మొత్తం ఐదు రెవెన్యూ డివిజన్లతో కూడిన ఈ జిల్లా కేవలం ఆదిలాబాద్, ఉట్నూరు రెవెన్యూ డివిజన్లతోనే సరిపెట్టుకోనుంది. ఇక.. అనూహ్యంగా తెరపైకొచ్చి కొత్తగా ఏర్పడిన నిర్మల్ జిల్లా.. కేవలం 13 మండలాలు కలిగిన చిన్న జిల్లాగా అవతరించనుంది. ప్రస్తుతమున్న నిర్మల్ రెవెన్యూ డివిజన్‌తో పాటు కొత్తగా ఏర్పడిన భైంసా రెవెన్యూ డివిజన్ కూడా ఈ జిల్లా పరిధిలో ఉంది.
కొత్త మండలాలు రెండే..
జిల్లాల పునర్విభజనలో భాగంగా.. కొత్త మండలాల ఏర్పాటుపై ఉన్న ఉత్కంఠకూ తెరపడింది. పశ్చిమ ప్రాంత పరిధిలోని ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న మావల మేజర్ గ్రామ పంచాయతీని కొత్త మండలంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ‘తూర్పు’లో ఉన్న మంచిర్యాల మండల పరిధిలోని నస్పూర్ మేజర్ గ్రామ పంచాయతీని కొత్త మండలంగా చేస్తూ ముసాయిదా విడుదల చేసింది. ఆదిలాబాద్ మండల పరిధిలో ఉన్న 45 గ్రామాల్లో.. మావల (9633), బట్టిసావర్‌గావ్ (7172), వాగాపూర్ (1407), దస్నాపూర్(22,216) నాలుగు గ్రామాలను వేరు చేసి మొత్తం 40,428 జనాభాతో ‘మావల’ మండలం ఏర్పాటు చేయనుంది. అలాగే.. 28 పంచాయతీలున్న మంచిర్యాల మండలం నుంచి 31,244 జనాభా ఉన్న నస్పూర్ , సింగాపూర్ (20,061), తీగల్‌పహాడ్ (12,656) తాళ్లపల్లి (9,656), సీతారాంపల్లి (3,024) గ్రామాలతో కొత్తగా నస్పూర్ మండలం ఏర్పాటు కానుంది.
ఈ ఐదు గ్రామాల జనాభా 76,641. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు బెజ్జూర్ మండల పరిధిలో ఉన్న పెంచికల్‌పేట, నిర్మల్ మండల పరిధిలోని సోన్, మంచిర్యాల మండల పరిధిలోని హాజీపూర్ గ్రామ పంచాయతీలనూ మండలాలుగా చేయాలన్న డిమాండ్.. అధికారుల ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరిన విషయం తెలిసిందే. కానీ జిల్లాలో కేవలం రెండు మండలాలు మాత్రమే ఏర్పాటు కానుండడంతో మిగిలిన మండలాల ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. కాగా.. నిర్మల్ మండల పరిధిలోని సోన్‌నూ కొత్త మండలంగా చేయాలని సీఎం కేసీఆర్‌కు నిర్మల్ ఎమ్మెల్యే, దేవాదాయ శాఖ మంత్రి ఐకే రెడ్డి చేసిన విన్నపం నెరవేరలేదు.
అన్నీ పరిగణలోకి తీసుకుని..
ముందు ఇచ్చిన హామి మేరకు.. మంచిర్యాలను కొమురంభీమ్ పేరుతో జిల్లాగా ఏర్పాటు చేసి.. తర్వాత తెరపైకొచ్చిన నిర్మల్ జిల్లా డిమాండ్‌నూ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. నిర్మల్‌నూ జిల్లాగా మారుస్తూ.. కొన్నాళ్లుగా నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరదించింది. ఆదిలాబాద్ జిల్లాను 16 మండలాలతో పరిమితం చేయగా.. 25 మండలాలతో కొమురంభీమ్.. 13 మండలాలతో నిర్మల్ జిల్లాను ప్రకటించింది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల పరిధిల్లో రెండు చొప్పున రెవెన్యూ డివిజన్లు రాగా.. కొమురం భీం జిల్లా కింద మూడు డివిజన్లు రానున్నాయి. జిల్లాలతో పాటు కొత్తగా బెల్లంపల్లి, భైంసానూ రెవిన్యూ డివిజన్లుగా చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో పాటు తూర్పు ప్రాంత పరిధిలోని నస్పూర్, పశ్చిమ ప్రాంతంలోని మావల గ్రామ పంచాయతీలను మండలాలుగా ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
అలాగే.. మండలాల విలీనం విషయంలోనూ ప్రభుత్వం స్థానికుల డిమాండ్.. ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంది. జన్నారం మండలాన్ని కొత్తగా ఏర్పాటు చేసే నిర్మల్‌లో కాకుండా కొమురంభీమ్ జిల్లాలో కలపాలని... కెరమెరి మండలాన్ని ఆదిలాబాద్‌లో కాకుండా కొమురంభీమ్ జిల్లాలో కలపాలన్న ప్రజల డిమాండ్‌కు తలొగ్గిన ప్రభుత్వం ఆ రెండు మండలాలను కొమురంభీమ్ జిల్లాలో కలిపింది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కాపీని వెబ్‌పోర్టల్‌లో అందుబాటులో ఉంచిన ప్రభుత్వం.. కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం నెల రోజుల గడువిచ్చింది. ఏవైనా అభ్యంతరాలుంటే.. ఆయా జిల్లాల కలెక్టరేట్లు.. సీసీఎల్‌ఏలో తమ సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని అందులో పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలో సంబరాలు అంబరాన్నంటాయి.
రెండు రెవె‘న్యూ’ డివిజన్లు
కొత్త జిల్లాలతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్ల నిరీక్షణ ఫలించింది. కొత్తగా బెల్లంపల్లి, భైంసా రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ముసాయిదా విడుదల చేసింది. పశ్చిమ ప్రాంత పరిధిలోని.. భైంసా, కుభీర్, కుంటాల, ముథోల్, లోకేశ్వరం, తానూరు మండలాలతో భైంసా కొత్త రెవెన్యూ డివిజన్‌గా అవతరించనుంది. తూర్పు ప్రాంత పరిధిలోని బెల్లంపల్లి, కాసిపేట, వేమనపల్లి, నెన్నెల, తిర్యాణి, తాండూరు, భీమిని, దహెగాం మొత్తం ఎనిమిది మండలాలతో బెల్లంపల్లి కొత్త రెవెన్యూ డివిజన్‌గా రూపుదిద్దుకోనుంది.
మూడుగా చీలిన ఖానాపూర్ నియోజకవర్గం
జిల్లాల పునర్విభజన పుణ్యమా.. అని ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం మూడు జిల్లాలకు విభజించారు. నియోజకవర్గ పరిధిలో ఉట్నూరు, ఖానాపూర్, ఇంద్రవెల్లి, కడెం, జన్నారం మండలాలున్నాయి. అయితే పాలనా సౌలభ్యం కోసం జరిగిన జిల్లాల పునర్విభజనలో ఉట్నూరు, ఇంద్రవెల్లి మండలాలు ఆదిలాబాద్ జిల్లాలో కలిశాయి. ఖానాపూర్, కడెం మండలాలు నిర్మల్‌కు జతకట్టాయి. జన్నారం మండలం కొమురంభీమ్ జిల్లాలో కలిసింది.
జిల్లాల పునర్విభజనపై అభ్యంతరాల స్వీకరణ
30 రోజుల వరకు గడువు
ఆదిలాబాద్ : తెలంగాణ జిల్లాల పునర్విభజనపై అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ ఎం.జగన్మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. పునర్విభజన ప్రతిపాదనలపై ఎవరికైనా అభ్యంతరాలు ఉన్న పక్షంలో కలెక్టర్ కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. సోమవారం నుంచి 30 రోజుల పాటు కార్యాలయం పనివేళల్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరిపాలన అధికారి (ఏఓ)కు అందజేయవచ్చని తెలిపారు.
ఫోన్‌లోనూ..
అభ్యంతరాలను కలెక్టర్ కార్యాలయం సెల్ నంబర్‌కు కూడా తెలియజేయవచ్చు.
సెల్ నం. 94910 53564
ఆదిలాబాద్ జిల్లా
రెవెన్యూ డివిజన్లు(2) మండలాలు(16)
1. ఆదిలాబాద్ ఆదిలాబాద్, మావల(న్యూ), బజార్‌హత్నూర్, బేల, బోథ్, జైనథ్, తాంసి, తలమడుగు, గుడిహత్నూర్
2. ఉట్నూర్ ఉట్నూరు, ఇంద్రవెల్లి, జైనూర్, నార్నూర్, సిర్పూర్(యు), ఇచ్చోడ, నేరడిగొండ
కొమురంభీమ్ జిల్లా
రెవెన్యూ డివిజన్లు(3) మండలాలు(25)
1. కొమురంభీమ్ మంచిర్యాల, చెన్నూర్, జైపూర్, కోటపల్లి, లక్సెట్టిపేట, దండేపల్లి, నస్పూర్(న్యూ), మందమర్రి, జన్నారం
2. బెల్లంపల్లి(న్యూ) కాసిపేట, బెల్లంపల్లి, వేమనపల్లి, నెన్నెల, తిర్యాణి, తాండూర్, భీమిని, దహెగాం
3. ఆసిఫాబాద్ ఆసిఫాబాద్, బెజ్జూరు, కాగజ్‌నగర్, కౌటాల, రెబ్బెన, సిర్పూర్ (టి), కెరమెరి, వాంకిడి
నిర్మల్ జిల్లా
రెవెన్యూ డివిజన్లు(2) మండలాలు(13)
1.నిర్మల్ నిర్మల్, దిలావర్‌పూర్, కడెం, ఖానాపూర్, మామడ, లక్ష్మణచాంద, సారంగాపూర్
2. భైంసా(న్యూ) కుభీర్, కుంటాల, భైంసా, ముథోల్, లోకేశ్వరం, తానూరు
Advertisement
Advertisement