రోదిస్తున్న మృతుని కుటుంబ సభ్యులు, మృతుడు నరేష్(ఫైల్)
సాక్షి, సారంగపూర్(నిర్మల్): నిర్మల్ 21వవార్డు మాజీ కౌన్సిలర్ అంగ నరేష్(32) ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లా కేంద్రంలోని కురన్నపేట్‌కు చెందిన నరేష్ ఈనెల 6న సారంగాపూర్ మండలం ధని గ్రామ శివారులో పేకాట ఆడుతుండగా పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు. ఈదాడిలో ముగ్గురు వ్యక్తులు పట్టుబడగా మరో నలుగురు పరారయ్యారు. పరారైన వారిలో నరేష్ కూడా ఉన్నాడు.
ఆదివారం ధని గ్రామానికి చెందిన భువనగిరి దేవన్న పంటపొలం పక్కనే ఉన్న స్వర్ణ ప్రాజెక్టు మధ్యకాలువలో(జౌళినాళ)లో మృతదేహం ఉండటాన్ని గమనించాడు. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులకు చిక్కకుండా పారిపోయే క్రమంలో పంట రక్షణకోసం ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె తగిలి చనిపోయి ఉంటాడని కుటుంబసభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. సంఘటనా స్థలాన్ని నిర్మల్ డీఎస్పీ ఉపేంద్రరెడ్డి పరిశీలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై యూనుస్ అహ్మద్ అలీ తెలిపారు. మృతునికి భార్య సుచిత్రతో పాటు కుమారుడు విశ్వయిత్, మరో నాలుగు నెలల పాప ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment