
సాక్షి, బెల్లంపల్లి : అమ్మమ్మ ఇంటికి బయళ్దేరిన చిన్నారిని కారు మృత్యువు రూపంలో వచ్చి అనంతలోకాలకు తీసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మనీషా (4) అక్కడికక్కడే మృతి చెందిది. మండలంలోని రాంపూర్ క్రాస్ రోడ్డు సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చిన్నగుడిపేట గ్రామానికి చెందిన ఇస్లావత్ దేవేందర్, అతని భార్య మంజుల, కూతురు మనీషా, కొడుకు కృష్ణమనోజ్ కలిసి పెర్కపల్లిలోని అమ్మమ్మ ఇంటికి గురువారం సాయంత్రం బయలుదేరి వెళ్తుండగా జన్కాపూర్ నుంచి ఎదురుగా వస్తున్న జెస్ట్ కారు బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో మనీషా అక్కడికక్కడే మృతి చెందింది. దేవేందర్, అతని భార్య మంజులకు తీవ్ర గాయాలయ్యాయి. కుమారుడు కృష్ణమనోజ్‌కు స్వల్పగాయాలు అయ్యాయి.
చిన్నగుడిపేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి వ్యక్తి కారును అక్కడే వదిలేసి పరారయ్యాడు. సంఘటనా స్థలానికి ఎస్సై కొమురయ్య చేరుకొని క్షతగాత్రులను ఆటోలో ఆస్పత్రికి తరలించారు. చిన్నారి మనీషాను ప్రైవేట్ అంబులెన్స్‌లో బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కొమురయ్య పేర్కొన్నారు.