పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
మంత్రి శిద్దా రాఘవరావు
నెల్లూరు (రవాణా) : రాష్ట్రప్రభుత్వ పథకాలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర రవాణా, రోడ్లు భవనాల శాఖ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. స్థానిక టీడీపీ జిల్లా కార్యాలయంలో శనివారం పార్టీ జిల్లా కమిటీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల పరిశీలకులు, జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమితులైన శిద్దా రాఘవరావు, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు హాజరయ్యారు. తొలుత పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళలర్పించారు. ఈ సందర్భంగా శిద్దా మాట్లాడుతూ ప్రస్తుతం వృద్ధులకు రూ.1000 పింఛన్ ఇస్తున్నా ప్రచారం రావడం లేదని తెలిపారు.
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నీరు-చెట్టు కార్యక్రమాన్ని కార్యకర్తలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడానికి కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని అధిగమించి, వచ్చే ఎన్నికల్లో 10 సీట్లు గెలిచేందుకు కృషిచేయాలన్నారు. నెల్లూరు నియోజకవర్గంలో ఏర్పాటుకానున్న టోల్గేట్ విషయాన్ని సోమిరెడ్డి తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. టోల్గేట్ వ్యవహారాన్ని కేంద్రమంత్రులు గడ్కారి, వెంకయ్యనాయుడు దృష్టికి తీసుకెళ్లి ఏర్పాటుకాకుండా తనవంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
జిల్లాలో రోడ్ల అభివృద్ధికి అవసరమైన నిధులును సేకరించి అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్నా ఇచ్చిన హామీలను చంద్రబాబు నేరవేర్చారన్నారు. జిల్లాలో ఎయిర్‌పోర్టును వీలైనంత త్వరగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జపాన్ కేవలం 13 కోట్లు జనభా మాత్రమే కలిగిఉందని, అక్కడ 1154 పోర్టులు ఉన్నట్లు చెప్పారు. రాష్ర్టంలో మరో 24 పోర్టులు ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిపారు.
ప్రభుత్వ విప్, ఎన్నికల పరిశీలకుడు మేడా మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని సూచించారు. మరో పరిశీలకుడు, ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రా, రాయలసీమ తెలుగు తమ్ముళ్లును ఎందుకు పోగట్టుకున్నామా అని తెలంగాణ ప్రజలు బాధపడే రోజు త్వరలో వస్తుందన్నారు. కార్యకర్తలకు అందుబాటులో బీద రవిచంద్ర ఉండాలని సూచించారు.
ఫోన్ చేసినా తీయడం లేదంటూ చురకలు అంటించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర అధ్యక్షత వహించగా మాజీ మంత్రులు ఆదాల ప్రభాకరరెడ్డి, రమేష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, బొల్లినేని రామారావు, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, నగర మేయర్ అబ్దుల్ అజీజ్, మాజీ ఎమ్మెల్యేలు బల్లి దుర్గాప్రసాద్, పరసావెంకటరత్నం, ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, గూడూరు ఇన్చార్జి జ్యోత్స్నలత, వెంకటగిరి ఇన్చార్జి కన్నబాబు, డీసీసీబీ చైర్మన్ ధనుంజయరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీద మస్తానరావు, నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కార్పొరేటర్ జెడ్.శివప్రసాద్, విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనూరాధ తదితరులు పాల్గొన్నారు.