District Congress Party
-
పోరుబాట
- ‘ప్రాణహిత- చేవెళ్ల’ పనులను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు - శంకర్పల్లి నుంచి పనుల ప్రాంతానికి పాదయాత్ర - భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, ప్రజా సంఘాలు - జవహర్‌నగర్‌లో నేడు పీసీసీ నేతల పర్యటన సాక్షి, రంగారెడ్డి జిల్లా/ శంకర్పల్లి: ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చొద్దంటూ జిల్లా కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన పోరుబాట విజయవంతంగా ముగిసింది. పార్టీలో విబేధాలు పక్కనపెట్టిన నేతలు ఐక్యంగా కలిసివచ్చారు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో శంకర్‌పల్లిలోని అతిథి గృహానికి మాజీ హోంమంత్రి సబితారెడ్డి, మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు భిక్షపతి యాదవ్, కూన శ్రీశైలం గౌడ్, సుధీర్‌రెడ్డి, కోదండరాంరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్, మాజీ డీసీసీ అధ్యక్షుడు వెంకటస్వామి, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ కార్తీక్‌రెడ్డి తదితరులు చేరుకున్నారు. అక్కడ ప్రాజెక్టు పనులపై చర్చించిన తర్వాత.. అక్కడినుంచి పాదయాత్రగా ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతానికి బయలుదేరారు. చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన అనంతరం.. పక్కనే ఉన్న ఇంద్రారెడ్డి విగ్రహానికి నివాళులర్పించి పోరుబాటను ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతోపాటు ఎన్ఎస్యూఐ కార్యకర్తలు పాల్గొన్నారు. మరోవైపు ప్రజాసంఘాలు సైతం మద్దతు పలుకుతూ స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్నాయి. ఉత్సాహంగా పార్టీ శ్రేణులు ఇటీవల జరిగిన ఎన్నికల్లో పరాభవం పొందిన కాంగ్రెస్ పార్టీ.. మెల్లగా ప్రజల్లోకి వచ్చి ప్రజావ్యతిరేఖ విధానాలను ఎండగట్టేందుకు కార్యాచరణ మొదలుపెట్టింది. పార్టీ శ్రేణుల్ని ఏకతాటిపైకి తీసుకురావడంతోపాటు ప్రజల్లో తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను గుర్తుచేసే దిశగా అగుడులు వేస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం చేపట్టిన ప్రాణహిత -చేవెళ్ల పోరుబాట పార్టీ వర్గాల్లో నూతనోత్తేజాన్ని నింపాయి. కార్యక్రమంలో చేవెళ్లతోపాటు ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, వికారాబాద్, పరిగి, రాజేంద్రనగర్ మండలాల నుంచి నాయకులు పెద్దఎత్తున తరలివచ్చారు. నాయకులంతా కలిసిమెలసి ప్రభుత్వంపై పోరాటం ప్రారంభించడంతో కార్యకర్తల్లో ఉత్సహం కనిపించింది. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ జంగారెడ్డి, శంకర్పల్లి ఎంపీపీ నర్సింలు, జెడ్పీటీసీ సభ్యుడు కళావతి, శంకర్పల్లి, శంషాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోవర్దన్‌రెడ్డి, వేణుగౌడ్, శంషాబాద్ సర్పంచ్ రాచమల్ల సిద్దేశ్వర్, నాయకులు నారాయణ, మాణిక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పంటలెండిపోతున్నాయి.. ప్రాణాలు పోతున్నాయి: టి.రామ్మెహన్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, దీంతో కొందరు ఆత్మహత్యలు సైతం చేసుకుంటున్నారని పరిగి శాసనసభ్యులు టి.రామ్మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రెండ్రోజుల క్రితం పరిగిలో ఒక వ్యవసాయ కుటుంబం బలవన్మరనానికి పాల్పడిందని, ఇలాంటి పరిస్థితులు అధిగమించేందుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి పనులు చేపట్టారన్నారు. కానీ కొత్తరాష్ట్రంలో అధికారం చేపట్టిన కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీకి మంచిపేరు రావొద్దనే ఉద్దేశంతో ప్రాజెక్టులో జిల్లాకు అవకాశం లేకుండా చేశారన్నారు. వెంటనే నిర్ణయాన్ని మార్చుకోకుంటే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రజలంతా పెద్దఎత్తున ఉద్యమాన్ని చేపడతారని మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి హెచ్చరిం చారు. కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు వెంకటస్వామి, యువనేత పి.కార్తీక్‌రెడ్డి, నాయకులు ఎన్.శ్రీధర్, లక్ష్మారెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సదాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పీసీసీ ఉద్యమబాట ప్రభుత్వ భూముల్లో అక్రమాలపై ఉక్కపాదం మోపిన సర్కారు దూకుడును అడ్డుకునేందుకు పీసీసీ ఉద్యమబాట పట్టింది. ఇటీవల ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లి సమీపంలోని కొమురంభీంనగర్లో గుడిసెలు తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో వేలాది మంది నిర్వాసితులయ్యారు. తాజాగా శామీర్‌పేట మండలం జవహర్‌నగర్‌లో ఆక్రమణలను తొలగించేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో సర్కారు ప్రయత్నాన్ని నిలువరించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ చర్యలు చేపడుతోంది. శనివారం జవహర్‌నగర్‌లోని పేదలు ఏర్పాటు చేసుకున్న నివాసప్రాంతాల్లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు పలువురు సీనియర్ నాయకులు పర్యటించనున్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు భయపడొద్దని, అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందన్న సందేశాన్ని వారికి చేరవేసి వారిలో ధైర్యాన్ని నింపనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. -
భిక్షమయ్యగౌడ్‌కు డీసీసీ పగ్గాలు
ఇన్చార్జ్అధ్యక్షుడిగా కొనసాగింపు నియామక ఉత్తర్వు అందించిన పొన్నాల సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాకాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు ఆలేరు మాజీఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌కు అప్పగించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగిసేవరకూ ఇన్చార్జ్ అధ్యక్షుడి హోదాలో పనిచేస్తారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు డీసీసీ అధ్యక్ష నియామక ఉత్తర్వులను టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య చేతుల మీదుగా భిక్షమయ్యగౌడ్ అందుకున్నారు. గతంలో డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన తూడి దేవేందర్‌రెడ్డి సార్వత్రిక ఎన్నికల అనంతరం పార్టీ కార్యక్రమాలకు దూ రంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల ఏఐసీసీ పరిశీలకుడి సమక్షంలో హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో తనను బాధ్యతల నుంచి తప్పించాలని చెప్పడంతో పాటు, పీసీసీ అధ్యక్షుడు పొన్నాలకు కూడా లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే కొత్త డీసీసీ అధ్యక్షుడిని నియమించారు. భిక్షమయ్యగౌడ్ ఇన్చార్జ్ అధ్యక్షుడే అని ప్రకటించినా, ఆయనే పూర్తిస్థాయి అధ్యక్షుడిగా కొనసాగుతారని పార్టీ వర్గాలంటున్నాయి. సింగిల్‌విండో డెరైక్టర్ నుంచి.... బూడిద భిక్షమయ్యగౌడ్ చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. ఆలేరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం దాదాపు మూడు దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. తొలుత యూత్‌కాంగ్రెస్‌లో పనిచేసిన ఆయన, ఆ తర్వాత గుండాల మండలం సుద్దాల గ్రామ సింగిల్‌విండో డెరైక్టర్‌గా పనిచేశారు. అప్పటి నుంచి పార్టీలోనే ఉన్న గౌడ్ 2009 ఎన్నికలలో అనూహ్యంగా ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ తెచ్చుకుని ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 2014 ఎన్నికలలో ఆయన అదే నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో భిక్షమయ్య చురుగ్గా వ్యవహరించారు. జిల్లాలోని అందరు నాయకులతో ఉన్న సఖ్యతే ఆయన నియామకానికి సహకరించిందని పార్టీవర్గాలంటున్నాయి. అందరితో కలిసి ముందుకెళతా: డీసీసీ అధ్యక్షుడు భిక్షమయ్యగౌడ్ పార్టీ శ్రేణులందరినీ కలుపుకుపోయి పనిచేస్తానని నూతన డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ చెప్పారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. పార్టీ తనపై నమ్మకంతో ఉంచిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానని, అందరు నేతలను సమన్వయం చేసుకుంటూ పనిచేస్తానని చెప్పారు. జిల్లాలో పార్టీ అభివృద్ధితో పాటు సమస్యల పరిష్కారం కోసం ప్రజల తరఫున పనిచేసే గొంతుకనవుతానని తెలిపారు. -
డీసీసీకి దిక్కెవరు?
ఖమ్మం : జిల్లా కాంగ్రెస్‌కు పట్టిన గ్రహణం వీడటం లేదు. గత నాలుగు నెలలుగా డీసీసీకి అధ్యక్షుడు లేకపోవడంతో ఆ పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావలా మారింది. జిల్లా నాయకుల మధ్య ఆధిపత్య పోరుతో ఒక వర్గానికి చెందిన వారిని నియమిస్తే మరో వర్గంతో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందేమోననే భయంతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకం విషయంలో టీపీసీసీ కూడా నిర్ణయం తీసుకోవడం లేదు. అయితే జిల్లా నాయకులు మాత్రం తమ అనుచరులకే పగ్గాలు అప్పగించేలా పట్టువిడుపు లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల డీసీసీ అధ్యక్షులను ఎంపిక చేసిన టీపీసీసీ ఖమ్మం జిల్లాను మాత్రం కదిలించిన పాపాన పోలేదు. దీంతో పార్టీకి సారధి నియామకం ఇప్పట్లో జరిగేనా అని కార్యకర్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 24, 25 తేదీ లలో జరిగే ప్లీనరీ సమావేశాల్లోనైనా ఈ వ్యవహారం ఒక కొలిక్కి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఆధిపత్య పోరుతో అడుగున పడిన ఎంపిక.. జిల్లా కాంగ్రెస్‌లో నాయకుల మధ్య ఉన్న ఆధిపత్య పోరుతో పార్టీ ప్రాభవం కోల్పోతోంది. చివరకు డీసీసీ అధ్యక్ష పదవిని కూడా తమ అనుచరులకే ఇప్పించాలని నాయకులు పట్టుపట్టడంతో నియామకమే నిలిచిపోయింది. గతంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడిగా పనిచేసిన వనమా వెంకటేశ్వరరావు సార్వత్రిక ఎన్నికలకు ముందు వేరే పార్టీలోకి వెళ్లారు. దీంతో ఖాళీ అయిన ఈ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నికల ముందే టీపీసీసీ ప్రయత్నం చేసింది. అయితే వర్గపోరుతో భగ్గుమంటున్న ఆ పార్టీలో డీసీసీ అధ్యక్ష ఎన్నిక మరింత ఆజ్యం పోసినట్లు అవుతుందని భావించిన అధిష్టానం వాయిదా వేసింది. అనంతరం కార్యాలయాన్ని నడిపించే బాధ్యతను మాజీ మంత్రి రాంరెడ్డి వర్గానికి చెందిన శీలంశెట్టి వీరభద్రం, మాజీ ఉపసభాపతి మల్లు భట్టి విక్రమార్క వర్గానికి చెందిన అయితం సత్యం, ఎమ్మెల్యే పొంగులేటి సుధాకర్‌రెడ్డి వర్గానికి చెందిన శ్రీనివాసరెడ్డికి అప్పగిస్తూ ఆ పార్టీ జిల్లా ఇన్చార్జి వట్టి కుసుమకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో తన వర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం, అప్పటి వరకు కార్యాలయ వ్యవహారాలు చూస్తున్న తమ అనుచరుడు పులిపాటి వెంకయ్యను తొలగించడంపై కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరి ఆగ్రహించినట్లు తెలిసింది. దీంతో ఆమె వర్గానికి చెందిన వి.వి.అప్పారావు, పరుచూరి మురళిని కూడా డీసీసీ కార్యాలయ ఇన్చార్జిల జాబితాలో చేర్చారు. అయితే ఒకే కుర్చీని ఐదుగురు నాయకులు పట్టుకుని ఉండటం ఏంటని కాంగ్రెస్ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అనుచరుల కోసం ఆరాటం.. కీలకమైన జిల్లా కాంగ్రెస్ పార్టీ పగ్గాలను తమ అనుచరులకు అప్పగించేందుకు పలువురు నాయకులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. కాగా, అధ్యక్ష ఎంపికపై జిల్లా నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్లే వాయిదా వేసినట్లు టీపీసీసీ వర్గాలు చెపుతున్నాయి. తమ వర్గానికి చెందిన పరుచూరి మురళీకృష్ణ, వి.వి. అప్పారావు, ఇల్లందు మాజీమార్కెట్ కమిటీ చైర్మన్ కావూరి వెంకట్రామయ్యల్లో ఎవరైనా ఒకరికి ఇవ్వాలని రేణుకా చౌదరి అధిష్టానం ఎదుట పట్టుపట్టినట్లు తెలిసింది. పార్టీ పటిష్టతకు డీసీసీ కీలకమని, ఈ సారి డీసీసీ అధ్యక్షుడిగా తానే ఉంటానని, లేదా బీసీ వర్గానికి చెందిన తన అనుచరుడు శీలంశెట్టి వీరభద్రానికి అయినా పగ్గాలు అప్పగించాలని మాజీమంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి తేల్చిచెప్పినట్లు సమాచారం. అదేవిధంగా అయితం సత్యం పేరును భట్టి విక్రమార్క చెప్పగా, సీపీఐతో పొత్తులో భాగంగా పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు అన్యాయం జరిగిందని, సార్వత్రిక ఎన్నికల ముందే డీసీసీ అధ్యక్ష పదవి ఇస్తామని ఆయనకు హామీ ఇచ్చామని, ఆ పదవిని ఆయనకు ఇవ్వడమే న్యాయమని కేంద్ర మాజీమంత్రి బలరాంనాయక్ చెపుతున్నట్లు తెలిసింది. ఇటువంటి పరిస్థితుల్లో అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలోనని టీపీసీసీ సందిగ్ధంలో పడింది. అయితే పార్టీని బలోపేతం చేసేందుకు ఈనెల 24, 25 తేదీల్లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నిర్వహించే ప్లీనరీ సమావేశంలోనైనా జిల్లా అధ్యక్షుడి ఎంపిక వ్యవహారాన్ని తేల్చాలని, లేకపోతే పార్టీ నష్టపోయే ప్రమాదం ఉందని స్థానిక నాయకులు అధిష్టానాన్ని కోరుతున్నారు.