డీసీసీకి దిక్కెవరు? | since 4 months no district commission council to congress | Sakshi
Sakshi News home page

డీసీసీకి దిక్కెవరు?

Published Sat, Aug 23 2014 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 12:17 PM

since 4 months no district commission council to congress

ఖమ్మం : జిల్లా కాంగ్రెస్‌కు పట్టిన గ్రహణం వీడటం లేదు. గత నాలుగు నెలలుగా డీసీసీకి అధ్యక్షుడు లేకపోవడంతో ఆ పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావలా మారింది. జిల్లా నాయకుల మధ్య ఆధిపత్య పోరుతో ఒక వర్గానికి చెందిన వారిని నియమిస్తే మరో వర్గంతో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందేమోననే భయంతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకం విషయంలో టీపీసీసీ కూడా నిర్ణయం తీసుకోవడం లేదు.

అయితే జిల్లా నాయకులు మాత్రం తమ అనుచరులకే పగ్గాలు అప్పగించేలా పట్టువిడుపు లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల డీసీసీ అధ్యక్షులను ఎంపిక చేసిన టీపీసీసీ ఖమ్మం జిల్లాను మాత్రం కదిలించిన పాపాన పోలేదు. దీంతో పార్టీకి సారధి నియామకం ఇప్పట్లో జరిగేనా అని కార్యకర్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 24, 25 తేదీ లలో జరిగే ప్లీనరీ సమావేశాల్లోనైనా ఈ వ్యవహారం ఒక కొలిక్కి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

 ఆధిపత్య పోరుతో అడుగున పడిన ఎంపిక..
 జిల్లా కాంగ్రెస్‌లో నాయకుల మధ్య ఉన్న ఆధిపత్య పోరుతో పార్టీ ప్రాభవం కోల్పోతోంది. చివరకు డీసీసీ అధ్యక్ష పదవిని కూడా తమ అనుచరులకే ఇప్పించాలని నాయకులు పట్టుపట్టడంతో నియామకమే నిలిచిపోయింది. గతంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడిగా పనిచేసిన వనమా వెంకటేశ్వరరావు సార్వత్రిక ఎన్నికలకు ముందు వేరే పార్టీలోకి వెళ్లారు.

దీంతో ఖాళీ అయిన ఈ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నికల ముందే టీపీసీసీ ప్రయత్నం చేసింది. అయితే వర్గపోరుతో భగ్గుమంటున్న ఆ పార్టీలో డీసీసీ అధ్యక్ష ఎన్నిక మరింత ఆజ్యం పోసినట్లు అవుతుందని భావించిన అధిష్టానం వాయిదా వేసింది. అనంతరం కార్యాలయాన్ని నడిపించే బాధ్యతను మాజీ మంత్రి రాంరెడ్డి వర్గానికి చెందిన శీలంశెట్టి వీరభద్రం, మాజీ ఉపసభాపతి మల్లు భట్టి విక్రమార్క వర్గానికి చెందిన అయితం సత్యం, ఎమ్మెల్యే పొంగులేటి సుధాకర్‌రెడ్డి వర్గానికి చెందిన శ్రీనివాసరెడ్డికి అప్పగిస్తూ ఆ పార్టీ జిల్లా ఇన్‌చార్జి వట్టి కుసుమకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ కమిటీలో తన వర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం, అప్పటి వరకు కార్యాలయ వ్యవహారాలు చూస్తున్న తమ అనుచరుడు పులిపాటి వెంకయ్యను తొలగించడంపై కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరి ఆగ్రహించినట్లు తెలిసింది. దీంతో ఆమె వర్గానికి చెందిన వి.వి.అప్పారావు, పరుచూరి మురళిని కూడా డీసీసీ కార్యాలయ ఇన్‌చార్జిల జాబితాలో చేర్చారు. అయితే ఒకే కుర్చీని ఐదుగురు నాయకులు పట్టుకుని ఉండటం ఏంటని కాంగ్రెస్ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 అనుచరుల కోసం ఆరాటం..
 కీలకమైన జిల్లా కాంగ్రెస్ పార్టీ పగ్గాలను తమ అనుచరులకు అప్పగించేందుకు పలువురు నాయకులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. కాగా, అధ్యక్ష ఎంపికపై జిల్లా నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్లే వాయిదా వేసినట్లు టీపీసీసీ వర్గాలు చెపుతున్నాయి. తమ వర్గానికి చెందిన పరుచూరి మురళీకృష్ణ, వి.వి. అప్పారావు, ఇల్లందు మాజీమార్కెట్ కమిటీ చైర్మన్ కావూరి వెంకట్రామయ్యల్లో ఎవరైనా ఒకరికి ఇవ్వాలని రేణుకా చౌదరి అధిష్టానం ఎదుట పట్టుపట్టినట్లు తెలిసింది. పార్టీ పటిష్టతకు డీసీసీ కీలకమని, ఈ సారి డీసీసీ అధ్యక్షుడిగా తానే ఉంటానని, లేదా బీసీ వర్గానికి చెందిన తన అనుచరుడు శీలంశెట్టి వీరభద్రానికి అయినా పగ్గాలు అప్పగించాలని మాజీమంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి తేల్చిచెప్పినట్లు సమాచారం.

 అదేవిధంగా అయితం సత్యం పేరును భట్టి విక్రమార్క చెప్పగా, సీపీఐతో పొత్తులో భాగంగా పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు అన్యాయం జరిగిందని, సార్వత్రిక ఎన్నికల ముందే డీసీసీ అధ్యక్ష పదవి ఇస్తామని ఆయనకు హామీ ఇచ్చామని, ఆ పదవిని ఆయనకు ఇవ్వడమే న్యాయమని కేంద్ర మాజీమంత్రి బలరాంనాయక్ చెపుతున్నట్లు తెలిసింది. ఇటువంటి పరిస్థితుల్లో అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలోనని టీపీసీసీ సందిగ్ధంలో పడింది. అయితే పార్టీని బలోపేతం చేసేందుకు ఈనెల 24, 25 తేదీల్లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నిర్వహించే ప్లీనరీ సమావేశంలోనైనా జిల్లా అధ్యక్షుడి ఎంపిక వ్యవహారాన్ని తేల్చాలని, లేకపోతే పార్టీ నష్టపోయే ప్రమాదం ఉందని స్థానిక నాయకులు అధిష్టానాన్ని కోరుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement