భిక్షమయ్యగౌడ్‌కు డీసీసీ పగ్గాలు | District Congress captain Responsibilities Budida Bikshamaiah | Sakshi
Sakshi News home page

భిక్షమయ్యగౌడ్‌కు డీసీసీ పగ్గాలు

Published Tue, Jan 6 2015 3:59 AM | Last Updated on Sat, Sep 2 2017 7:15 PM

భిక్షమయ్యగౌడ్‌కు డీసీసీ పగ్గాలు

భిక్షమయ్యగౌడ్‌కు డీసీసీ పగ్గాలు

ఇన్‌చార్జ్‌అధ్యక్షుడిగా కొనసాగింపు
 నియామక ఉత్తర్వు అందించిన పొన్నాల
 
 సాక్షి ప్రతినిధి, నల్లగొండ  : జిల్లాకాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు ఆలేరు మాజీఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌కు అప్పగించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగిసేవరకూ ఇన్‌చార్జ్ అధ్యక్షుడి హోదాలో పనిచేస్తారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు డీసీసీ అధ్యక్ష నియామక ఉత్తర్వులను టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య చేతుల మీదుగా భిక్షమయ్యగౌడ్ అందుకున్నారు. గతంలో డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన తూడి దేవేందర్‌రెడ్డి సార్వత్రిక ఎన్నికల అనంతరం పార్టీ కార్యక్రమాలకు దూ రంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల ఏఐసీసీ పరిశీలకుడి సమక్షంలో హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో తనను బాధ్యతల నుంచి తప్పించాలని చెప్పడంతో పాటు, పీసీసీ అధ్యక్షుడు పొన్నాలకు కూడా లేఖ రాశారు.  ఈ నేపథ్యంలోనే కొత్త డీసీసీ అధ్యక్షుడిని నియమించారు. భిక్షమయ్యగౌడ్ ఇన్‌చార్జ్ అధ్యక్షుడే అని ప్రకటించినా, ఆయనే పూర్తిస్థాయి అధ్యక్షుడిగా కొనసాగుతారని పార్టీ వర్గాలంటున్నాయి.
 
 సింగిల్‌విండో డెరైక్టర్ నుంచి....
 బూడిద భిక్షమయ్యగౌడ్ చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. ఆలేరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం దాదాపు మూడు దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. తొలుత యూత్‌కాంగ్రెస్‌లో పనిచేసిన ఆయన, ఆ తర్వాత గుండాల మండలం సుద్దాల గ్రామ సింగిల్‌విండో డెరైక్టర్‌గా పనిచేశారు. అప్పటి నుంచి పార్టీలోనే ఉన్న గౌడ్ 2009 ఎన్నికలలో అనూహ్యంగా ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ తెచ్చుకుని ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 2014 ఎన్నికలలో ఆయన అదే నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో భిక్షమయ్య చురుగ్గా వ్యవహరించారు.  జిల్లాలోని అందరు నాయకులతో ఉన్న సఖ్యతే ఆయన నియామకానికి సహకరించిందని పార్టీవర్గాలంటున్నాయి.
 
 అందరితో కలిసి ముందుకెళతా: డీసీసీ అధ్యక్షుడు భిక్షమయ్యగౌడ్
 పార్టీ శ్రేణులందరినీ కలుపుకుపోయి పనిచేస్తానని నూతన డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ చెప్పారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. పార్టీ తనపై నమ్మకంతో ఉంచిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానని, అందరు నేతలను సమన్వయం చేసుకుంటూ పనిచేస్తానని చెప్పారు. జిల్లాలో పార్టీ అభివృద్ధితో పాటు సమస్యల పరిష్కారం కోసం ప్రజల తరఫున పనిచేసే గొంతుకనవుతానని తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement