District Department of Agriculture
-
ఇక కొర్రీల్లేవ్
గజ్వేల్ : సాగుకు సాయం చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. రైతుకు లబ్ధి కలిగే పథకాల్లో గతంలో విధించిన కొన్ని నిబంధనలను సైతం సడలించింది. యాంత్రీకరణను రైతు ముంగిట్లో చేర్చడంతో పాటు సాగు విస్తీర్ణం పెంచేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పాత పద్ధతిలోనే అమలుచేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా వ్యవసాయశాఖకు ఆదేశాలు అందాయి. ‘మీ-సేవా’ ద్వారానే దరఖాస్తు చేసుకుంటేనే పథకం వర్తింపజేస్తామని, ముందుగా రైతులు యంత్రపరికరాలను కొనుగోలు చేసిన తర్వాతే సబ్సీడీ మొత్తాన్ని విడుదల చేస్తామన్న నిబంధనలు సైతం ఇపుడు మార్చారు. దీంతో రైతులకు ప్రయోజనం కలుగనుంది. జిల్లా అధికారులకే లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలు జిల్లాలో ప్రతి ఖరీఫ్ సీజన్లో 6 లక్షల హెక్టార్లకుపైగా వివిధ పంటలు సాగవుతున్నాయి. పాత పద్ధతులకు క్ర మంగా స్వస్తి పలుకుతున్న రైతులు అధునాతన యం త్రాల వాడకంపై దృష్టి సారించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునేందుకు ఈ విధానం అనివార్యమవుతోంది. ప్రభుత్వం ఇటీవల 50 శాతం సబ్సీడీపై పథకాన్ని ప్రకటించినా, వివిధ రకాల నిబంధనల కారణంగా రైతులు ఆ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. దీంతో రైతుకు ఇబ్బందిగా మారిన నిబంధనలను సడలిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కొత్తగా రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం యాంత్రికీకరణ పథకానికి లబ్ధిదారుల ఎంపిక కోసం జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటుచేయ తలపెట్టారు. కమిటీలో జేడీఏ, హార్టికల్చర్ అసిస్టెంట్ డెరైక్టర్, ఆత్మ పీడీ, డ్వామా పీడీ, డీఆర్డీఏ పీడీతో పాటు జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు, నాబార్డు ప్రతినిధులు సభ్యులుగా ఉండాలని, మండల స్థాయి కమిటీలో వ్యవసాయాధికారి, డీఆర్డీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, డ్వామా ఏపీఓ, ఎంపీడీఓ, తహశీల్దార్లు సభ్యులుగా ఉండాలని నిర్ణయించారు. సబ్సిడీపై భారీ యంత్రాలు ఈసారి హార్వెస్టర్, రోటోవేటర్, శ్రీవరిసాగు యంత్రం, ట్రాక్టర్లు వంటి భారీ యంత్రాలను కూడా సబ్సిడీపై అందించడానికి ప్రభుత్వం సంకల్పించింది. అయితే ఈ పథకం పొందాలంటే రైతులు మీ-సేవ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు అందజేయాలని.. లేని పక్షంలో పథకం వర్తించదని తొలుత ఉత్తర్వులిచ్చారు. అంతేకాకుండా గ్రామసభల ద్వారా ఎంపిక కూడా జాప్యమయ్యే అవకాశముండేది. దీంతో క్షేత్రస్థాయిలో రైతుల నుంచి నిరసన వ్యక్తం కావడంతో నిబంధనలను మార్చారు. మీ-సేవతో ప్రమేయం లేకుండా నేరుగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ మేరకు కొన్ని రోజుల కిందట జిల్లా వ్యవసాయశాఖకు ఆదేశాలు వచ్చాయి. ఈ విషయాన్ని జేడీఏ హుక్యానాయక్ ‘సాక్షి’కి ధృవీకరించారు. ట్రాక్టర్లు, హార్వెస్టర్లకు డిమాండ్ జిల్లాకు యాంత్రీకరణ పథకానికి ప్రభుత్వం రూ.22 కోట్లు మంజూరు చేసింది. ఈ పథకంలో మండలానికి ఒక ట్రాక్టర్‌ను, ఒక హార్వెస్టర్‌ను మాత్రమే కేటాయించడం రైతులను నిరాశకు గురిచేస్తోంది. ఈ యంత్రాలకు రైతుల నుంచి విపరీతమైన డిమాండ్ ఉండగా కేటాయింపులు లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. రైతులకు మేలు చేసేందుకు కొన్ని నిబంధనలు మార్చిన సర్కార్ మండలానికి ఒక ట్రాక్టర్, ఒక హార్వెస్టర్ నిబంధనను కూడా సడలిస్తే మేలు జరుగుతుందని రైతులు కోరుతున్నారు. -
పోచారం.. చూడండీ మా గాచారం!
⇒ వ్యవసాయశాఖ.. సమస్యల తడాఖా! ⇒ అద్దె ఇంటిలోనే జేడీఏ కార్యాలయం ⇒ పోస్టులు ఖాళీ.. ఇన్‌చార్జీలే దిక్కు.. ⇒ రైతులకు సేవలందించలేని దుస్థితి ⇒ కొత్త సర్కారుపైనే గంపెడాశలు ⇒ నేడు మంత్రి పోచారం రాక వరంగల్ : జిల్లా వ్యవసాయ శాఖ సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. అద్దె భవనాలే వ్యవసాయ కార్యాలయాలకు దిక్కుగా మారాయి. ప్రధానమైన వ్యవసాయ సంయుక్త సంచాలకుల(జేడీఏ) కార్యాలయం ఇరుకుగా ఉన్న అద్దె ఇంటిలో కొనసాగుతోంది. జిల్లావ్యాప్తంగా ఏడీఏ, ఏఓలకూడా సరైన కార్యాలయాలు లేవు. కీలక పోస్టులు ఖాళీగా ఉండడంతో పాలన అస్తవ్యస్తంగా తయూరైంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సోమవారం జిల్లాకు వస్తున్న నేపథ్యంలో ఈ సమస్యలకు పరిష్కారం చూపిస్తారని రైతాంగం గంపెడాశలు పెట్టుకుంది. మురుగుతున్న రూ.45 లక్షలు హన్మకొండలోని అదాలత్ వెనుక జేడీఏ కార్యాలయం ఉంది. సర్క్యూట్ గెస్ట్‌హౌస్ సమీపంలో ఏడీఏ కార్యాలయం కొనసాగుతోంది. కీలక కార్యాలయాలన్నీ ఒకే చోట ఏర్పాటు చేయాలనే డిమాండ్ దశాబ్దకాలంగా పెండింగ్‌లోనే ఉంది. 2005లో జేడీఏ కార్యాలయ నిర్మాణం కోసం రూ.45 లక్షలు విడుదలయ్యూయి. అవి అతీగతి లేకుండా అక్కడే మురిగిపోతున్నాయి. బంధం చెరువు సమీపంలో జేడీఏ కార్యాలయానికి స్థలం కేటాయించినా.. కోర్టు కేసుల కారణంగా ముందుకు సాగడం లేదు. నూతన తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తూ కార్యాలయాల నిర్మాణానికి చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్చార్జలతోనే కాలం వెళ్లదీత జిల్లాలో ప్రస్తుతం వ్యవసాయ శాఖలో అధికారుల కొరత పీడిస్తోంది. ఖాళీ పోస్టుల్లో తాత్కాలికంగా ఇతర అధికారులను ఇన్‌చార్జీలుగా నియమించి కాలం వెళ్లదీస్తున్నారు. కొంతకాలంగా జిల్లాలో 10 స్థానాల్లో అధికారులు లేకుండానే కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఫలితంగా ఉన్న అధికారులపై పని ఒత్తిడి పెరిగింది. జిల్లా వ్యవసాయ శాఖలో అత్యంత ప్రధానమైన జాయింట్ డెరైక్టర్ ఆఫ్ అగ్రికల్చర్(జేడీఏ) స్థానంలో పూర్తిస్థాయి అదనపు బాధ్యతలతో డీడీఏగా జి.రామారావు విధులు నిర్వర్తిస్తున్నారు. నూతన రాష్ట్రంలో చేర్పులు, మార్పులు జరిగితే కొత్త జేడీఏను నియమించే అవకాశం ఉంది. అదేవిధంగా.. ప్లాంట్ ప్రొడక్షన్, రైతు శిక్షణ కేంద్రం, భూసార కేంద్రం, జేడీఏ కార్యాలయంలో నాలుగు డిప్యూటీ డెరైక్టర్ అఫ్ అగ్రికల్చర్(డీడీఏ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మండల స్థాయిలో రైతులతో ప్రత్యక్ష సంబంధాలుండే ఆరు వ్యవసాయ అధికారుల (ఏఓ) స్థానాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. తాడ్వాయి, వరంగల్ ఏడీఏ కార్యాలయం, రైతు శిక్షణ కేంద్రం, కేసముద్రం, ఏటూరునాగారంలోని భూసార పరీక్ష కేంద్రం, పాలంపేటలోని విత్తన ఫామ్‌లలో ఒక్కో ఏఓ పోస్టు ఖాళీగా ఉంది. వీటితోపాటు ఏఈఓ స్థానా లు పలు ఖాళీగా ఉన్నట్లు అధికారులు ఇటీవల రాష్ట్ర వ్యవసాయశాఖకు నివేదించారు. ఈ దఫా భర్తీ చేస్తారనే.. ఈ ఖాళీల వల్ల సంబంధిత విభాగాలు, మండలాల్లో రైతులకు వ్యవసాయ అధికారులు, సిబ్బంది సరైన సమయంలో సూచనలు అందించలేకపోతున్నారు. కార్యాలయాల్లో ఏఓల కొరత వల్ల పనులు సకాలంలో పూర్తి చేయలేని పరిస్థితి నెలకొంది. నూతన ప్రభుత్వం వ్యవసాయ శాఖకు అత్యంత ప్రాధాన్యమినిస్తున్నట్లు ప్రకటిస్తున్నందున ఈ దఫా ఈ ఖాళీలు భర్తీ చేస్తారనే ఆశాభావంతో జిల్లా రైతులు ఉన్నారు. ఈ దిశగా మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సత్వర చర్యలు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నారు. -
వర్రి @777 హెక్టార్లు
సాక్షి, సంగారెడ్డి: మళ్లీ ‘అకాల’ వర్షం విజృంభించింది. మండుటెండల్లో ఆరుగాలం శ్రమించి పండించిన పంటలపై దెబ్బకొట్టింది. చేతికొచ్చిన పంటలను నేలకూల్చి అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లుతోంది. మూడు రోజులుగా కురుస్తున్న భీకర గాలివానలతో జిల్లాలో 777 హెక్టార్లలో వరి పంట దెబ్బతిన్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అంచ నా వేసింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక అంచనా నివేదిక పంపించింది. మండలాల వారీగా పరిశీలిస్తే.. దౌల్తాబాద్‌లో 510 హెక్టార్లు, వెల్దుర్తిలో 101, చేగుం టలో 106, కొ ల్చారంలో 60 హెక్టార్లలో వరికి నష్టం వాటిల్లింది. గాలివాన ఉధృతికి చేతికొచ్చిన వరి గింజలు నేలరాలాయి. సోమవారం సైతం జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురవడంతో పంట నష్టం మరింత పెరగనుందని అధికారులు భావిస్తున్నారు. రెండో సారీ..! ఈ ఏడాది రబీ రైతాంగంపై ప్రకృతి రెండు పర్యాయాలు విరుచుకుపడింది. గత ఫిబ్రవరి 27 మార్చి 9 మధ్య కాలంలో కురిసిన వడగండ్ల వానకు జిల్లాలోని 27 మండలాల పరిధిలో 2021.66 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లింది. మొత్తం 4,800 మంది రైతులు నష్టపోయారు. దీంతో రైతులను ఆదుకోవడానికి రూ.1.35 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ గత నెలలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది.