ఇక కొర్రీల్లేవ్
గజ్వేల్ : సాగుకు సాయం చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. రైతుకు లబ్ధి కలిగే పథకాల్లో గతంలో విధించిన కొన్ని నిబంధనలను సైతం సడలించింది. యాంత్రీకరణను రైతు ముంగిట్లో చేర్చడంతో పాటు సాగు విస్తీర్ణం పెంచేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పాత పద్ధతిలోనే అమలుచేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా వ్యవసాయశాఖకు ఆదేశాలు అందాయి.
‘మీ-సేవా’ ద్వారానే దరఖాస్తు చేసుకుంటేనే పథకం వర్తింపజేస్తామని, ముందుగా రైతులు యంత్రపరికరాలను కొనుగోలు చేసిన తర్వాతే సబ్సీడీ మొత్తాన్ని విడుదల చేస్తామన్న నిబంధనలు సైతం ఇపుడు మార్చారు. దీంతో రైతులకు ప్రయోజనం కలుగనుంది.
జిల్లా అధికారులకే లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలు
జిల్లాలో ప్రతి ఖరీఫ్ సీజన్‌లో 6 లక్షల హెక్టార్లకుపైగా వివిధ పంటలు సాగవుతున్నాయి. పాత పద్ధతులకు క్ర మంగా స్వస్తి పలుకుతున్న రైతులు అధునాతన యం త్రాల వాడకంపై దృష్టి సారించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునేందుకు ఈ విధానం అనివార్యమవుతోంది. ప్రభుత్వం ఇటీవల 50 శాతం సబ్సీడీపై పథకాన్ని ప్రకటించినా, వివిధ రకాల నిబంధనల కారణంగా రైతులు ఆ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు.
దీంతో రైతుకు ఇబ్బందిగా మారిన నిబంధనలను సడలిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కొత్తగా రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం యాంత్రికీకరణ పథకానికి లబ్ధిదారుల ఎంపిక కోసం జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటుచేయ తలపెట్టారు. కమిటీలో జేడీఏ, హార్టికల్చర్ అసిస్టెంట్ డెరైక్టర్, ఆత్మ పీడీ, డ్వామా పీడీ, డీఆర్‌డీఏ పీడీతో పాటు జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు, నాబార్డు ప్రతినిధులు సభ్యులుగా ఉండాలని, మండల స్థాయి కమిటీలో వ్యవసాయాధికారి, డీఆర్‌డీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, డ్వామా ఏపీఓ, ఎంపీడీఓ, తహశీల్దార్లు సభ్యులుగా ఉండాలని నిర్ణయించారు.
సబ్సిడీపై భారీ యంత్రాలు
ఈసారి హార్వెస్టర్, రోటోవేటర్, శ్రీవరిసాగు యంత్రం, ట్రాక్టర్లు వంటి భారీ యంత్రాలను కూడా సబ్సిడీపై అందించడానికి ప్రభుత్వం సంకల్పించింది. అయితే ఈ పథకం పొందాలంటే రైతులు మీ-సేవ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందజేయాలని.. లేని పక్షంలో పథకం వర్తించదని తొలుత ఉత్తర్వులిచ్చారు.
అంతేకాకుండా గ్రామసభల ద్వారా ఎంపిక కూడా జాప్యమయ్యే అవకాశముండేది. దీంతో క్షేత్రస్థాయిలో రైతుల నుంచి నిరసన వ్యక్తం కావడంతో నిబంధనలను మార్చారు. మీ-సేవతో ప్రమేయం లేకుండా నేరుగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ మేరకు కొన్ని రోజుల కిందట జిల్లా వ్యవసాయశాఖకు ఆదేశాలు వచ్చాయి. ఈ విషయాన్ని జేడీఏ హుక్యానాయక్ ‘సాక్షి’కి ధృవీకరించారు.
ట్రాక్టర్‌లు, హార్వెస్టర్లకు డిమాండ్
జిల్లాకు యాంత్రీకరణ పథకానికి ప్రభుత్వం రూ.22 కోట్లు మంజూరు చేసింది. ఈ పథకంలో మండలానికి ఒక ట్రాక్టర్‌ను, ఒక హార్వెస్టర్‌ను మాత్రమే కేటాయించడం రైతులను నిరాశకు గురిచేస్తోంది. ఈ యంత్రాలకు రైతుల నుంచి విపరీతమైన డిమాండ్ ఉండగా కేటాయింపులు లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. రైతులకు మేలు చేసేందుకు కొన్ని నిబంధనలు మార్చిన సర్కార్ మండలానికి ఒక ట్రాక్టర్, ఒక హార్వెస్టర్ నిబంధనను కూడా సడలిస్తే మేలు జరుగుతుందని రైతులు కోరుతున్నారు.