District Panchayat Office
-
బదిలీల జాతర
నేటితో ముగియనున్న గడువు పలుకుబడి లేని వారికి ఏజెన్సీలో పోస్టింగ్ మహారాణిపేట(విశాఖ):బదిలీల గడువు నేటితో ముగియనుండడంతో పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్,జెడ్పీల్లోసూపరింటెండెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, టైపిస్టుల బదిలీలకు కౌన్సెలింగ్ మొదలైంది. కౌన్సెలింగ్ ప్రక్రియ శుక్రవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. పంచాయతీ పరిధిలో 300 మంది కార్యదర్శులను మండలం దాటి బదిలీలు చేయనున్నారు. ఇప్పటికీ వీరి జాబితాను సిద్ధం చేసి కలెక్టర్ ఆమోదం కోసం డీపీఓ టి.వెంకటేశ్వర్రావు పంపించారు. వీరితోపాటు కార్యాలయంలో పనిచేస్తున్నసీనియర్ అసిస్టెంట్లు,జూనియర్ అసిస్టెంట్ల బదిలీకి రంగం సిద్ధమైంది. కలెక్టర్ ఆమోదం వచ్చిన వెంటనే వీరికి స్థానాల కేటాయింపు జరుగుతుంది. శనివారం సాయంత్రానికల్లా వీరికి కొత్తస్థానాలు కేటాయించే అవకాశం ఉంది. జిల్లాపంచాయతీ కార్యాలయం పరిధిలో పనిచేస్తున్న ముగ్గురు డీఎల్పీఓలను ఇప్పటికే ప్రభుత్వం బదిలీ చేసింది. విశాఖ డివిజన్ డీఎల్పీఓ మోహన్‌రావును విజయనగరం, పాడేరు డీఎల్పీఓ రామ్‌ప్రసాద్, నర్సీపట్నం డీఎల్పీఓ పి.సత్యనారాయణను ప్రభుత్వం ఇప్పటికే శ్రీకాకుళం బదిలీ చేసింది. వీరిస్థానంలో శ్రీకాకుళం నుంచి బి.మోహనరావు, బి.ఎం.ఎలీవియా, పి.శిరీషారాణి ఇక్కడకు వస్తున్నారు. వీరికి కలెక్టర్ ఆమోదంతో డివిజన్లు కేటాయిస్తారు. డీపీఓ కార్యాలయంలో పరిపాలనాధికారిగా పనిచేస్తున్న ఆర్.నారాయణరావును శ్రీకాకుళంబదిలీ చేశారు. ఆయన స్థానంలో విజయనగరం నుంచి ఎస్.ఎస్.ఎస్.ఎస్.ఎన్.మూర్తి వస్తున్నారు. ఎంపీడీఓ పోస్టులకు గిరాకీ: ఇదిలా ఉండగా జిల్లాలో ఖాళీగా ఉన్న మండలాల్లో ఎంపీడీఓల పోస్టులకు గట్టి పోటీ ఏర్పడింది. కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి వారి స్థానాలను ఇప్పటికే రిజర్వ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. భీమిలి, కోటవురట్ల, నర్సీపట్నం, పరవాడ, అనకాపల్లి, సబ్బవరం, యలమంచిలి, నక్కపల్లి మండలాలకు పోటీ ఎక్కువగా ఉండడంతో అవే కావాలని ఎంపీడీఓ అభ్యర్థులు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. మైదాన ప్రాంతంతో పాటు రోడ్డుపక్కన మండలాల్లో ఎంపీడీఓ పోస్టులకు రేటు ఎక్కువగానే పలుకుతుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని, ఎలాంటి పలుకుబడి లేనివారిని, డబ్బులు ఇచ్చుకోలేని వారిని ఏజెన్సీ ప్రాంతానికి పంపించేందుకు ప్రజాప్రతినిధులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. శనివారం స్వాతంత్య్ర వేడుకలు ముగిసిన తరువాత ఈ ఎంపీడీఓ పోస్టుల భర్తీ జరిగే అవకాశం ఉంది. జెడ్పీ పరిధిలో 200మంది వరకు సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టుల బదిలీలకు శుక్రవారం జెడ్పీ కార్యాలయంలో జెడ్పీ సీఈఓ జయప్రకాశ్‌నారాయణ్, జెడ్పీ చైర్పర్సన్ లాలం భవానీ కౌన్సెలింగ్ నిర్వహించారు. -
అక్రమాల పంచాయితీ
దొడ్డిదారిన బదిలీలు, పదోన్నతులు డీపీవో కార్యాలయ లీలలు ప్రతి పనికీ ఓ రేటు సెలవులో ఉండి చక్రం తిప్పుతున్న సీనియర్ అసిస్టెంట్ మచిలీపట్నం : జిల్లా పంచాయతీ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులను ప్రసన్నం చేసుకుని అమ్యామ్యాలు సమర్పించుకుంటే కోరిన చోటుకు పోస్టింగ్ ఇస్తున్నారని సమాచారం. ఇటీవలనే బాధ్యతలు స్వీకరించిన ఓ అధికారి తనదైన శైలిలో వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. అధిక ఆదాయం ఉండే పంచాయతీలకు బదిలీలు చేస్తామని చెప్పి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చిన ఓ నలుగురు పంచాయతీ కార్యదర్శుల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేసుకుని కలెక్టర్‌కు ఫైలును పంపినట్లు సమాచారం. ఈ నలుగురు కార్యదర్శులు జిల్లాలో పనిచేస్తూ ఏసీబీకి చిక్కిన వారే. యనమలకుదురు, కొండపల్లి వంటి పంచాయతీల్లో వీరిని నియమించేందుకు ఫైలు సిద్ధం చేసినట్లు సమాచారం. పంచాయతీ కార్యదర్శులు అతి తక్కువగా ఉన్న మండలాలను గుర్తించి అక్కడ పంచాయతీ కార్యదర్శులను నియమించాలని కలెక్టర్ పదే పదే చెబుతున్నా... వీటిని పక్కనపెట్టి ఈ నలుగురికి వారు కోరుకున్న పంచాయతీల్లో పోస్టింగ్‌లు ఇప్పించేందుకు ప్రయత్నాలు జరుగు తున్నాయని తెలుస్తోంది. పదోన్నతుల్లోనూ అక్రమాలే... డీపీవో కార్యాలయంలో ఇద్దరు నైట్వాచ్మెన్లు పని చేస్తున్నారు. వీరికి అటెండర్లుగా పదోన్నతి ఇచ్చేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. మొవ్వలో పనిచేస్తున్న స్వీపరును డీపీవో కార్యాలయంలో నైట్‌వాచ్‌మెన్‌గా నియమించేందుకు ఫైలు సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. సెలవులో ఉండి చక్రం తిప్పుతున్న ఉద్యోగి... విజయవాడ డీఎల్పీవో కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగికి ఓ టీడీపీఎమ్మెల్యే సిఫార్సులతో నిబంధనలకు విరుద్ధంగా విజయవాడ సమీపంలోని అధిక ఆదాయమున్న ఓ పంచాయతీకి కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు. బాధ్యతలు చేపట్టిన ఈ ఉద్యోగి కొంత కాలం పాటు తనదైన శైలిలో వసూళ్లకు పాల్పడడంతో ఆగ్రహించిన స్థానికులు ఈ ఉద్యోగిని ఏసీబీకి పట్టించేందుకు వ్యూహం రచించారు. విషయం తెలుసుకున్న ఈ ఉద్యోగి సెలవుపై వెళ్లిపోయారు. అక్కడితో ఆగకుండా మచిలీపట్నంలోని డీపీవో కార్యాలయానికి వచ్చి ఇక్కడ తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నాడు. ఇటీవల జరిగిన పంచాయతీ కార్యదర్శుల బదిలీలు, పంచాయతీ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి సంబంధించిన పదోన్నతుల విషయంలో తెరవెనుక ఉండి ఈ ఉద్యోగి వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సెలవులో ఉన్నప్పటికీ డీపీవో కార్యాలయంలో అన్నీ తానై వ్యవహరిస్తున్న ఈ ఉద్యోగి ఉన్నతాధికారి షాడో మాదిరిగా వ్యవహరిస్తున్నట్లు కార్యాలయ ఉద్యోగులు చెబుతున్నారు. సెలవుపై ఉన్న ఉద్యోగిని ఏ నిబంధనల మేరకు డీపీవో కార్యాలయంలో పనిచేయించుకుంటున్నారో తెలియని పరిస్థితి నెలకొందని సిబ్బందే పేర్కొంటున్నారు. -
డీపీఓ తీరుపై కలెక్టర్ ఆగ్రహం
ఒంగోలు టౌన్ : ‘జిల్లా పంచాయతీ కార్యాలయంపై తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రజా దర్బార్‌లో వరుసపెట్టి అర్జీలు అందుతున్నాయి. వాటిని పరిష్కరించకుండా జిల్లా పంచాయతీ అధికారి శ్రీదేవి ఏమి చేస్తున్నారో అర్థం కావడం లేదు. వెంటనే ఆమెకు చార్జి మెమో ఇవ్వాలి. ఇప్పటివరకు ఆ శాఖకు సంబంధించి ఎన్ని అర్జీలు వచ్చాయి, వాటిలో ఎన్ని పరిష్కరించారో నివేదిక అందజేయాలని’ కలెక్టర్ విజయకుమార్ జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడ్‌ను ఆదేశించారు. స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. పంచాయతీలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా రావడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేతనం పెంచమంటే దిగ్గోశారు వేతనం పెంచమని వేడుకుంటే దిగ్గోశారని కేజీబీవీ పాఠశాలల్లో పనిచేస్తున్న క్రాఫ్ట్ టీచర్లు వాపోయారు. రెండేళ్ల నుంచి 36 మంది క్రాఫ్ట్ టీచర్లు నెలకు 4500 రూపాయల వేతనంతో విధులు నిర్వర్తిస్తుంటే, ఇటీవల 3వేల రూపాయలకు తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు సమాధానం చెప్పడం లేదన్నారు. నెలకు 8వేల రూపాయలు ఇవ్వాలని వేడుకున్నారు. మొదటి డిజైన్ ప్రకారం కాలువ నిర్మించాలి ఇంకొల్లు మండలం దుద్దుకూరు గ్రామంలో గుండ్లకమ్మ ప్రాజెక్టు ఎడమ కాలువ నిర్మాణానికి మొదటి డిజైన్ ప్రకారం చేపట్టాలని పలువురు కోరారు. 2007లో గుండ్లకమ్మ ప్రాజెక్టు అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది తమ గ్రామ భూముల్లో కాలువ నిర్మాణానికి లెవల్ బేస్రాళ్లను వేశారని, కొంతమంది వాటిని పీకివేశారని చెప్పారు. రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించినప్పటికీ వాటిపై ఎలాంటి విచారణ చేయలేదన్నారు. సాగు చేసుకుంటున్న భూముల్లో ఇతరులకు పాసు బుక్‌లు ఇచ్చారు పదిహేనేళ్ల నుంచి సాగు చేసుకుంటున్న తమ భూమికి ఏడో విడత భూ పంపిణీ కింద ఇతరులకు పాసు బుక్‌లు ఇచ్చారని కంభం మండలం ఎల్ కోట పంచాయతీలోని తెల్లదిన్నె గ్రామానికి చెందిన కల్లు సామ్యూల్ వాపోయాడు. సర్వే నెం 1070లోని 3ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నట్లు తెలిపారు. కొంతమంది రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ఆ భూమికి పాసు బుక్‌లు ఇచ్చారన్నారు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. 14 నెలల నుంచి వేతనాలు ఇవ్వలేదు వైద్య ఆరోగ్యశాఖలో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీం కింద విధులు నిర్వర్తిస్తున్న తమకు 14నెలల నుంచి వేతనాలు ఇవ్వలేదని మహిళా ఆరోగ్య కార్యకర్తలు వాపోయారు. యునెటైడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లూరి వెంకటేశ్వర్లుతో కలిసి తమ గోడును కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. ఈ స్కీం కింద 28మంది ఆరోగ్య కార్యకర్తలు విధులు నిర్వర్తిస్తున్నట్లు వెల్లడించారు. తక్కువ వేతనంతో విధులు నిర్వర్తిస్తున్న తమకు నెలల తరబడి నిలిపివేయడంతో కుటుంబాలను పోషించుకోలేకపోతున్నామన్నారు. కరవదిలో వీధిలైట్లు, పారిశుధ్యం మెరుగుపరచాలి ఒంగోలు మండలంలోని కరవది గ్రామంలో వీధిలైట్లు ఏర్పాటు చేయడంతోపాటు పారిశుధ్యం మెరుగుపరచాలని ఏఐవైఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జీ శివాజీ కోరారు. కొన్ని నెలల నుంచి వీధి దీపాలు వెలగడం లేదని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వివరించారు. పారిశుధ్యం గురించి పట్టించుకోకపోవడంతో వ్యాధులు ఎప్పుడు ప్రబలుతాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. -
డీపీవో కార్యాలయంలో ప్రమోషన్ల సందడి
- 80 మంది పంచాయతీ కార్యదర్శులకు అడ్హాక్ ప్రమోషన్లు - 4వ గ్రేడ్ నుంచి 3వ గ్రేడ్‌కు పెంపు ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్ : జిల్లా పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శుల ప్రమోషన్ల సందడి నెలకొంది. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ప్రకాశం భవనంలోని జిల్లా పంచాయతీ కార్యాలయంలో హడావిడి నెలకొంది. జిల్లాలోని 80 మంది పంచాయతీ కార్యదర్శులకు అడ్హాక్ ప్రమోషన్లు ఇచ్చారు. నాల్గో గ్రేడ్ నుంచి మూడో గ్రేడ్‌కు మార్చారు. జిల్లాలోని 56 మండలాల్లో 1,028 పంచాయతీలున్నాయి. 398 మంది కార్యదర్శులు ఉన్నారు. రెండు, మూడు పంచాయతీలను కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేశారు. సుమారుగా 530కి పైగా క్లస్టర్లు ఉన్నాయి. కార్యదర్శుల కొరతను తీర్చేందుకు ఒక్కొక్క క్లస్టర్ ఒక్కొక్క కార్యదర్శిని నియమించి నెట్టుకొస్తున్నారు. వచ్చే నిధులను బట్టి పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా విభజించారు. వీటిలో పనిచేస్తున్న కార్యదర్శులను 80 మందిని గుర్తించి అడ్హాక్ ప్రమోషన్లు కల్పించారు. ప్రమోషన్లు ఇచ్చినా వీరంతా ప్రస్తుతం పనిచేస్తున్న చోటే పనిచేస్తారు తప్పితే.. బదిలీలు జరగవు. ఇదే విషయాన్ని జిల్లా పంచాయతీ అధికారిణి కె. శ్రీదేవి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఈ ప్రమోషన్ల వ్యవహారం గతంలోనే జరిగిందన్నారు. అయితే మధ్యలో ఎన్నికలు రావడంతో తాత్కాలికంగా బ్రేక్ పడిందని చెప్పారు. జిల్లా కలెక్టర్ అనుమతితోనే అడ్హాక్ ఇచ్చామన్నారు.