ఒంగోలు టౌన్ : ‘జిల్లా పంచాయతీ కార్యాలయంపై తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రజా దర్బార్‌లో వరుసపెట్టి అర్జీలు అందుతున్నాయి. వాటిని పరిష్కరించకుండా జిల్లా పంచాయతీ అధికారి శ్రీదేవి ఏమి చేస్తున్నారో అర్థం కావడం లేదు. వెంటనే ఆమెకు చార్జి మెమో ఇవ్వాలి. ఇప్పటివరకు ఆ శాఖకు సంబంధించి ఎన్ని అర్జీలు వచ్చాయి, వాటిలో ఎన్ని పరిష్కరించారో నివేదిక అందజేయాలని’ కలెక్టర్ విజయకుమార్ జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడ్‌ను ఆదేశించారు. స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. పంచాయతీలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా రావడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వేతనం పెంచమంటే దిగ్గోశారు
వేతనం పెంచమని వేడుకుంటే దిగ్గోశారని కేజీబీవీ పాఠశాలల్లో పనిచేస్తున్న క్రాఫ్ట్ టీచర్లు వాపోయారు. రెండేళ్ల నుంచి 36 మంది క్రాఫ్ట్ టీచర్లు నెలకు 4500 రూపాయల వేతనంతో విధులు నిర్వర్తిస్తుంటే, ఇటీవల 3వేల రూపాయలకు తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు సమాధానం చెప్పడం లేదన్నారు. నెలకు 8వేల రూపాయలు ఇవ్వాలని వేడుకున్నారు.
మొదటి డిజైన్ ప్రకారం కాలువ నిర్మించాలి
ఇంకొల్లు మండలం దుద్దుకూరు గ్రామంలో గుండ్లకమ్మ ప్రాజెక్టు ఎడమ కాలువ నిర్మాణానికి మొదటి డిజైన్ ప్రకారం చేపట్టాలని పలువురు కోరారు. 2007లో గుండ్లకమ్మ ప్రాజెక్టు అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది తమ గ్రామ భూముల్లో కాలువ నిర్మాణానికి లెవల్ బేస్‌రాళ్లను వేశారని, కొంతమంది వాటిని పీకివేశారని చెప్పారు. రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించినప్పటికీ వాటిపై ఎలాంటి విచారణ చేయలేదన్నారు.
సాగు చేసుకుంటున్న భూముల్లో ఇతరులకు పాసు బుక్‌లు ఇచ్చారు
పదిహేనేళ్ల నుంచి సాగు చేసుకుంటున్న తమ భూమికి ఏడో విడత భూ పంపిణీ కింద ఇతరులకు పాసు బుక్‌లు ఇచ్చారని కంభం మండలం ఎల్ కోట పంచాయతీలోని తెల్లదిన్నె గ్రామానికి చెందిన కల్లు సామ్యూల్ వాపోయాడు.
సర్వే నెం 1070లోని 3ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నట్లు తెలిపారు. కొంతమంది రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ఆ భూమికి పాసు బుక్‌లు ఇచ్చారన్నారు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు.
14 నెలల నుంచి వేతనాలు ఇవ్వలేదు
వైద్య ఆరోగ్యశాఖలో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీం కింద విధులు నిర్వర్తిస్తున్న తమకు 14నెలల నుంచి వేతనాలు ఇవ్వలేదని మహిళా ఆరోగ్య కార్యకర్తలు వాపోయారు. యునెటైడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లూరి వెంకటేశ్వర్లుతో కలిసి తమ గోడును కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. ఈ స్కీం కింద 28మంది ఆరోగ్య కార్యకర్తలు విధులు నిర్వర్తిస్తున్నట్లు వెల్లడించారు. తక్కువ వేతనంతో విధులు నిర్వర్తిస్తున్న తమకు నెలల తరబడి నిలిపివేయడంతో కుటుంబాలను పోషించుకోలేకపోతున్నామన్నారు.
కరవదిలో వీధిలైట్లు, పారిశుధ్యం మెరుగుపరచాలి
ఒంగోలు మండలంలోని కరవది గ్రామంలో వీధిలైట్లు ఏర్పాటు చేయడంతోపాటు పారిశుధ్యం మెరుగుపరచాలని ఏఐవైఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జీ శివాజీ కోరారు. కొన్ని నెలల నుంచి వీధి దీపాలు వెలగడం లేదని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వివరించారు. పారిశుధ్యం గురించి పట్టించుకోకపోవడంతో వ్యాధులు ఎప్పుడు ప్రబలుతాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు.
డీపీఓ తీరుపై కలెక్టర్ ఆగ్రహం
Published Tue, Jul 29 2014 1:28 AM | Last Updated on Sat, Sep 2 2017 11:01 AM
Advertisement
Advertisement