District tour ysrcp ranges
-
అదే హోరు... అదే జోరు
* ముగిసిన వైఎస్సార్సీపీ అధినేత జగన్ పర్యటన * బాధితుల మోముల్లో మందహాసం * నేతలకు అభయహస్తం సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఆయన రాక ఏరువాకే అయింది. బాధల్లో, కష్టాల్లో ఉన్నవారికి తానున్నానంటూ ధైర్యం చెప్పడానికి తమ నేత వచ్చాడంటూ జిల్లా ప్రజలు ఉప్పొంగిపోయారు. రెండు రోజుల పర్యటనకు శ్రీకాకుళం జిల్లాకు విచ్చేసిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని ప్రజలు అక్కున చేర్చుకున్నారు. తమ కుటుంబ సభ్యుడే వచ్చినట్టుగా హారతులు పట్టారు. తమిళనాడులో ఇటీవల జరిగిన వేర్వేరు ఘటనల్లో జిల్లా వాసులు 23 మంది మృత్యువాతపడగా మరో ముగ్గురు గాయపడ్డారు. వారి కుటుంబాలను పరామర్శించి నేనున్నానంటూ భరోసా ఇవ్వడానికి బుధవారం అర్ధరాత్రి జిల్లాలో అడుగుపెట్టిన జగన్మోహన్రెడ్డి శుక్రవారం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. బుధవారం రాత్రి ఆమదాలవలసలో బస చేసిన ఆయన గురువారం బూర్జ, పాలకొండ, హిరమండలం, ఎల్.ఎన్.పేట తదితర ప్రాంతాల్లో రాత్రి వరకు ప్రజలను పలకరిస్తూ వెళ్లారు. గురువారం రాత్రి శ్రీకాకుళంలో బస చేసి శుక్రవారం ఉదయం నరసన్నపేట, టెక్కలి, పాలకొండ నియోజకవర్గాల్లో బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. బోరున వర్షం కురుస్తున్నప్పటికీ మాముమూల గ్రామాల నుంచి ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ అభిమాన నాయకుడిని కళ్లారా చూసి మురిసిపోయారు. జగన్మోహన్రెడ్డి అడుగడుగునా ప్రజలను చిరునవ్వుతో పలకరిస్తూ భవిష్యత్తు మనదే అంటూ ధీమా ఇచ్చారు. మీ కష్టాల్లో పాలుపంచుకుంటానంటూ భరోసా ఇచ్చారు. నువ్వు తప్ప మాకెవరయ్యా అంటూ అదేరీతిలో ప్రజలూ స్పందించారు. రుణ మాఫీ పేరుతో టీడీపీ ప్రభుత్వం నట్టేట ముంచిందని రైతులు వాపోయారు. ఓట్లు దండుకున్న తర్వాత చంద్రబాబు ముఖం తిప్పేశారని మహిళలు శాపనార్థాలు పెట్టారు. నీలం, పై-లీన్ తుపానుల పరిహారం నేటికీ అందని వైనాన్ని భామిని మండలం కొరమలో ప్రజలు జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. రుణ మాఫీ విషయమై చంద్రబాబు నాటకాలాడుతున్నారని బూర్జ మండలంలో రైతులు జగన్ ఎదుట వాపోయారు. ప్రభుత్వానికి నెల రోజులు టైమిద్దాం... అప్పటికీ ఫలితం లేకపోతే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేద్దామని జగన్ చెప్పడంతో రైతుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. మొత్తంమీద జగనన్న పర్యటన ఇటు బాధితుల కుటుంబాలకు మనోధైర్యం ఇవ్వగా అటు పార్టీ శ్రేణులను ఉత్తేజ పర్చింది. కాగా జగన్ పరామర్శ ఇతర పార్టీ నాయకుల్లో చర్చనీయాంశమైంది. ప్రతిపక్ష నేత స్పందించినంత రీతిలో తాము స్పందించలేకపోయామని చర్చించుకోవడం కనిపించింది. జగన్మోహన్రెడ్డి చుట్టిగుండం నుంచి భామిని మండలం కొమర వెళుతున్న మార్గంలో ఆదర్శ రైతులు టీడీపీ వచ్చాక తమకు అన్యాయం జరుగుతోందని ప్లకార్డులతో కనిపించారు. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలో 3 వేల మంది ఆదర్శ రైతులు రోడ్డున పడతారని, తమను ఆదుకోవాలని జగన్‌కు విజ్ఞప్తి చేశారు. పాకివలస, కొరమ ప్రాంతాలు జనసంద్రమయ్యాయి. జగన్మోహన్రెడ్డిని చూసి వారంతా పొంగిపోయారు. చెన్నై బాధితుల కుటుంబాలను పరామర్శించడానికే వచ్చినప్పటికీ భామిని మండలంలో ఇటీవల చెరువులో ఈతకు దిగి మృతి చెందిన ఐదుగురి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. సంఘటన ఎలా జరిగిందీ అడిగి తెలుసుకున్నారు. వివిధ వర్గాల వారు కలిసి సమస్యలను విన్నవించుకున్నారు. మొత్తం మీద జగన్మోహన్రెడ్డి ఇచ్చిన భరోసా అందరికీ కొండంత ధైర్యం ఇచ్చింది. ఈ పర్యటనలో పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, ఎమ్మెల్యేలు కలమట వెంకటరమణ, విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు, సీఈసీ సభ్యురాలు వరుదు కల్యాణి, మాజీ ఎమ్మెల్యే పి.సాయిరాజ్, పార్టీ నాయకులు రెడ్డి శాంతి, అంధవరపు సూరిబాబు, దువ్వాడ శ్రీనివాస్, నర్తు రామారావు, వజ్జ బాబూరావు, పేడాడ తిలక్, పాలవలస విక్రాంత్, విశాఖ నుంచి వచ్చిన గుడివాడ అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ థ్యాంక్స్ : వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణదాస్ నరసన్నపేట: వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రెండు రోజుల జిల్లా పర్యటన విజయవంతం చేసిన పార్టీ శ్రేణులు, అభిమానులకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ కృతజ్ఞతలు తెలిపారు. జగన్మోహన్రెడ్డి పర్యటన బాధితుల కుటుంబాల్లో ఆత్మస్థైర్యం నింపిందన్నారు. భవిష్యత్‌లో బిల్డర్ల నుంచి పరిహారం అందేలా న్యాయపోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. వర్షం కురుస్తున్నా కార్యక్రమం విజయవంతం చేసినందుకు అభినందనలు తెలిపారు. విద్యార్థుల సమస్యలకు మద్దతు ఇవ్వండి టెక్కలి: ప్రస్తుతం విద్యార్థులు ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, ప్రతిపక్ష నేతగా మద్దతు తెలియజేసి సమస్యలపై పోరాడాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి టి.సూర్యం శుక్రవారం వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కోటబొమ్మాళి మండలం పాకివలసలో ఆయన జగన్మోహన్రెడ్డిని కలిసి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు వివరించారు. సకాలంలో ఉపకార వేతనాలు అందడంలేదని, ఫీజు రీయింబర్స్మెంట్ సక్రమంగా వర్తించడం లేదని చెప్పారు. అన్నా... నాబిడ్డను ఆదుకోవా! జగన్‌కు మందస మహిళ వినతి పీఎన్‌కాలనీ: ‘‘అన్నా... నా బిడ్డ జబ్బుపడ్డాడు. వైద్యం చేయించాలంటే లక్షల్లో ఖర్చవుతోంది. ఢిల్లీ తీసుకువెళితే బాగుపడొచ్చని డాక్టర్లు అంటున్నారు. నువ్వే ఆదుకోవాలి’’ అంటూ మందస మండలానికి చెందిన ఓ మహిళ వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని అభ్యర్థించింది. ఆమె కష్టాన్ని ఓపిగ్గా విన్న జగన్మోహన్రెడ్డి తప్పకుండా సాయం చేస్తానని హామీ ఇచ్చారు. పక్కనే ఉన్న సహాయకుడిని పిలిచి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలు ఇవీ... మందస మండలం ఉగ్రువానిపేటకు చెందిన డొక్కర హైమావతికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పదో తరగతి చదువుతున్న కుమారుడి చేతివేళ్లు కొన్నేళ్లుగా బొబ్బలు వచ్చి వాచిపోతున్నాయి. ఎన్ని ఆస్పత్రులు తిరిగిన ఫలితం కనిపించలేదు. ఢిల్లీలో చూపిస్తే హెమెంజియా అనే వ్యాధని, చికిత్సకు *5 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. నిరుపేదరాలైన హైమావతి ఏం చేయాలో పాలుపోక దాతల కోసం ఎదురు చూస్తోంది. ఆమె భర్త డొక్కరి జానకిరావు గల్ఫ్‌లో కూలీకి వెళ్లాడు. ఏడాదిన్నర అయినా ఇంకా తిరిగిరాలేదు. దీంతో కొడుకుని ఎలాగైనా రక్షించుకోవాలని ఆమె తన గోడును జగన్మోహన్రెడ్డికి చెప్పుకుంది. బాధితుల కన్నీళ్లు తుడుస్తూ... శ్రీకాకుళం సిటీ: వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటన బాధితుల కన్నీళ్లు తుడిచింది. దగ్గరి బంధువులా బాధితుల పక్కనే కూర్చుని కష్టసుఖాలను తెలుసుకోవడం వారికి కొండత ధైర్యాన్ని ఇచ్చింది. ఒక్కొక్కరి పేర్లు, బంధుత్వాలను తెలుసుకుంటూ, ప్రతి ఒక్కరితోనూ మాట్లాడి నేనున్నాననే భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యుడిగా వారితో మమేకమయ్యారు. ఇదంతా చూసి బాధితుల కుటుంబ సభ్యులు చలించిపోయారు. పరామర్శ కోసం జగన్మోహన్రెడ్డి అంతటి వాడు మా ఇంటికి రావడాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నామని పలువురు వ్యాఖ్యానించారు. కాగా జగన్మోహన్రెడ్డిని కనులారా చూడడంతో చాలామంది పరవశించిపోయారు. బాధితుల పరామర్శకు వచ్చినప్పటికీ తన కోసం గంటల తరబడి నిరీక్షించిన వారికి కుశల ప్రశ్నలు వేయడంతో వారు మురిసిపోయారు. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తూ.. ఇదిలా ఉండగా ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి ప్రతిపక్ష నేతగా జిల్లాలో అడుగుపెట్టిన వైఎస్సార్సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడిడ పార్టీ తరఫున చేయాల్సిన కార్యక్రమాలపై ముఖ్య నేతలతో మాట్లాడుతూ దిశానిర్దేశం చేశారు. బాధితుల కష్టాలపై రెండు మూడు రోజుల తర్వాత ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు. బాధితుల తరఫున కోర్టుల్లో కేసువు వేయించి నష్టపరిహారం పూర్తిగా అందేలా చూడాలన్నారు. రైతుల, డ్వాక్రా మహిళల రుణాల మాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఉద్యోగ కల్పన తదితర హామీలపై ప్రభుత్వ తీరుపై ఎలా నిరసన తెలియజేయాలో ముఖ్యనేతలతో చర్చించారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలపై అవగాహన వచ్చేలా సమాచారం అందించారు. -
కన్నీళ్లు తుడుస్తూ...
అసలే వలస బతుకులు... కూలీనాలీ చేసుకుంటూ ఎలాగోలా జీవనాన్ని నెట్టుకొస్తున్న వారిపై మృత్యువు పంజా విసిరింది. ఇంటి పెద్ద దిక్కులను కబళించింది. తీరని శోకం మిగిల్చింది. చెన్నైలో ఇటీవల సంభవించిన రెండు ప్రమాదాల్లో తమవారిని కోల్పోరుు పుట్టెడు దుఃఖంలో ఉన్న పలు కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి రెండో రోజు శుక్రవారం పరామర్శించారు. వారి ఆవేదనను ఆలకించారు. కన్నీళ్లు తుడిచారు. ప్రమాద కారణాలు తెలుసుకుని ప్రభుత్వ సాయంపై ఆరా తీశారు. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. నష్టపరిహాం అందజేసేందుకు పార్టీ తరఫున చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇచ్చారు. -నరసన్నపేటరూరల్/సారవకోట రూరల్/టెక్కలి/కోటబొమ్మాళి/భామిని సత్రాం గ్రామంలో రాము తల్లిదండ్రులను ఓదారుస్తూ... జగన్: మీకు అందివచ్చిన కొడుకు మరణించడం నన్ను కలచివేసిందమ్మా... సరోజిని, సిమ్మయ్య(మృతుని తల్లిదండ్రులు): అవును బాబూ.. మాకు ముగ్గురు కుమారులు. పెద్దవాడు రాము సంపాదన మీదే ఆధారపడి బతుకుతున్నాం. జగన్: చెన్నై ఎప్పుడు వెళ్లారు? సిమ్మయ్య: మూడు మాసాల కిందట పెద్దోడు రాము, చిన్నోడు భాస్కరరావుతో కలిసి నేను కూడా వెళ్లాను. వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో చిన్నోడు, నేను వచ్చేసినాం. పెద్దోడు అక్కడే ఉండిపోరుు గోడ కూలిన ఘటనలో చనిపోయూడు. సరోజిని కలుగుజేసుకుని ఇదే ప్రమాదంలో నా తమ్ముళ్లు, వారి పిల్లలు చనిపోయూరయ్యూ అంటూ భోరున విలపించింది. జగన్: వారిది కూడా ఇదే ఊరా? సరోజిని: లేదయ్యా... వారిది చుట్టిగుండం జగన్: ప్రభుత్వం నుంచి సాయం అందిందా? మృతిని తండ్రి: మన ప్రభుత్వం నుంచి వచ్చింది. తమిళనాడు ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదు. జగన్: మన ఎమ్మెల్యేలను తమిళనాడు పంపించి మంచి లాయర్లను ఏర్పాటు చేసి మీ బాధ వినిపించేలా చేస్తాను. అక్కడే ఉన్న రాము తమ్ముళ్లు చిన్నారావు, భాస్కరరావుల క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నారు. జగన్: మీరిద్దరూ ఏమి చేస్తున్నారు? (మృతిని తమ్ముళ్లను ) చిన్నారావు: నేను ఇంటర్మీడియెట్ చదువుతున్నాను, తమ్ముడు భాస్కరరావు భవన నిర్మాణ కార్మికుడు. జగన్: నీవు చదువు కోలేదా? భాస్కరరావు: చదువు మానేశాను. జగన్: చదువుకుని ఉంటే బాగుండేది కదా... ఇప్పుడు అక్కడకెళ్లి కూలి పని చేస్తావు. తరువాత మేస్త్రీ అవుతావు అంతే కదా... చదువుకుంటే మంచి భవిష్యత్ ఉంటుంది కదా. ఇద్దరు పిల్లల్ని చదివించండి. వారికి మంచి భవిష్యత్ ఇవ్వండి. మన దాసన్న రెండు రోజులలో వస్తారు.. మీకు ఆర్థికంగా సహాయం అందిస్తారు. బాలసీమలో దువ్వారపు పద్మ కుటుంబ సభ్యులతో... జగన్: భవనం కూలిపోరుు పద్మ చనిపోవడం చాలా బాధగా ఉందయ్యూ... అప్పన్న(పద్మ భర్త): కళ్లముందే నా భార్య చనిపోయింది సార్. నేను కూడా ఈ ప్రమాదంలో చిక్కుకోవల్సింది. నాకు పని లేదని మేస్త్రి చెప్పడంతో పక్క బిల్డింగ్‌లో పనికి వెళ్లాను. మరో అరగంటలో పని నుంచి బయటకు వస్తారనగా బిల్డింగ్ కూలింది. అడుగున ఉన్న అంతస్తులో నా భార్య చిక్కుకుంది. జగన్: ఎంతమంది పనికి వెళ్లారు. రోజుకు కూలి ఎంత వస్తుంది? అప్పన్న: నేను, నా భార్య, అన్నలు ఇద్దరు, అన్న భార్యలు కలిసి పనికెళ్లాం. ఎలచ్చన్లకు వచ్చి ఓటేసి మళ్లీ వెళ్లాం. రోజుకు మేస్త్రీకి రూ. 500, ఆడమనిషికి రూ.250 ఇస్తారు. జగన్: ప్రభుత్వం సాయం చేసిందా.. అప్పన్న: రెండు దఫాలు పిలిచి రూ.ఏడు లక్షలు ఇచ్చారు. జగన్: బిల్డర్ నుంచి ఆర్థిక సహాయం అందిందా? అప్పన్న: లేదు సార్. బిల్డింగ్ కూలిన వెంటనే వాళ్లను పోలీసులు పట్టుకు పోయారు. మాకు పైసా కూడా ఆయన నుంచి రాలేదు. మీరే ఏదో ఒకటి చేయాలి. జగన్: వైఎస్సార్ సీపీ తరఫున మా ప్రయత్నం మేము చేస్తాం. దాసన్నతో పాటు మన పార్టీ ఎమ్మెల్యేలను కొందరిని తమిళనాడు పంపుతాం. అక్కడి ప్రభుత్వంతో వారు మాట్లాడతారు. అనంతరం మంచి లాయరును పెట్టి కేసు వేద్దాం. జగన్: ఎంతమంది పిల్లలు? చదువుతున్నారా? అప్పన్న: ఇద్దరు పిల్లలు సార్. పాప లక్ష్మి పెద్దది. శ్యామలరావు కుమారుడు. వీరి కోసమే నాభార్య ఎక్కువగా కష్టపడేది. లక్ష్మి ఇంటర్ చదువుతుంది. శ్యామలరావు టెన్త్‌కు వచ్చాడు. మా పిల్లలను మీరే ఆదుకోవాలి సార్. జగన్: పిల్లలను బాగా చదివించు. పాపను నర్సింగ్‌లో చేర్పించు. తన కాళ్ల మీద తను నిలబడుతుంది. పిల్లలిద్దరినీ బాగా చదువుకోవాలంటూ ఆశీర్వదించారు. కొరమలో దాసరిరాము, దాసరి కుమారి కుటుంబ సభ్యులతో... జగన్: అమ్మా... దంపతులిద్దరూ మరణించడం దారుణం. పిల్లలు అనాథలయ్యూరు. దేవుడు మీ కుటుంబానికి అన్యాయం చేశాడు... అప్పలనర్సమ్మ, ప్రకాశ్(మృతుని తల్లి, సోదరుడు): అవును బాబూ... దేవుడు మా కుటుంబానికి కష్టాలు తెచ్చాడు. జగన్: ప్రమాదానికి కారణమైన బిల్డర్ నుంచి పరిహారం వచ్చిందా? ప్రకాశ్: రాలేదు జగన్: పరిహారం కోసం మీ తరఫున కేసు వేద్దాం. నాణ్యత లేని భవనాలు నిర్మించిన బిల్డర్‌ను బాధ్యుడిని చేద్దాం? ప్రకాశ్: అలాగేనండి... పరిహారం వచ్చేలా చూడండి సార్. జగన్: వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే, ఎంపీలతో ఒక కమిటీ వేశాం. వీరు చెన్నైవెళ్లి మీ తరఫున పోరాటం చేస్తారు. మీలో ఎవరో ఒకరు వారితో వెళ్లండి చాలు. అప్పలనర్సమ్మ: అలాగే బాబూ. మీరు చెప్పినట్లు వింటాం. జగన్: మృతుల పిల్లలు మణికంఠ, సంధ్యలను దగ్గరకు తీసుకుని... బాగా చదువుకోండి అంటూ దీవించారు. అప్పలనర్సమ్మ: దిక్కులేని పిల్లలకు చదవు లెలాసాగుతాయి నాయినా? జగన్: పిల్లల బాధ్యత తీసుకుంటాం. మా ఎమ్మెల్యే విశ్వాసరారుు కళావతి పిల్లలిద్దరినీ పాఠశాలలో చేర్పించి చదువుకు సాయం చేస్తారు. అప్పలనర్సమ్మ: ఆదుకోండి బాబూ. మీరే దిక్కు... జగన్: తప్పకుండా... పార్టీ తరఫున ఎమ్మెల్యే ద్వారా సాయం చేస్తాం. జగన్: గ్రామం నుంచి ఎంతమంది వలసలు వెళ్లారు? ప్రకాశ్: కొరమ నుంచి సుమారు 50 మంది వరకు చెన్నైలో పనిచేస్తున్నారు. జగన్: జాబ్ కార్డులందరికీ ఉన్నాయా? ప్రకాశ్: లేవు సార్, ఉపాధి పనులు కూడా లేవు. జగన్: ప్రభుత్వం నుంచి పరిహారం అందిందా? ప్రకాశ్: అందింది. రెండు విడతులుగా ఇచ్చారు. చుట్టిగుండంలో మృతుల కుటుంబ సభ్యులతో... జగన్: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోవడం బాధగా ఉందమ్మా... మృతులు సిమ్మయ్య, అప్పయ్యల చెల్లెలు చిన్నమ్మడు: అవును బాబూ... ఇప్పటికీ తెరుకోలేకపోతున్నాం.. ఆ దేవుడు మా కుటుంబానికి అన్యాయం చేశాడు. నేను చెన్నైలో గోడకూలి చనిపోయిన సిమ్మయ్యకు అక్కనవుతాను... అప్పయ్యకు చెల్లెలనవుతాను... వీరితో పాటు మా ఇద్దరు వదినలు ఉమా, లక్ష్మీలు, చిన్న మేనల్లుడు జగదీష్ కూడా చనిపోయారు. జగన్: అసలు ప్రమాదం ఎలా జరిగింది...? మృతుడు అప్పయ్య కుమారుడు ప్రసాద్: మా అమ్మా నాన్న, మా పెద్దనాన్న పెద్దమ్మలు.. పని చేస్తున్న దగ్గర్లో ఉన్న ప్రహరీ ఆనుకుని పాకలు వేశారు. ఆ రాత్రి గోడకు వెనుక నుంచి వాహనం ఢీ కొనడంతో గోడ కూలిపోయి ఉండవచ్చని అక్క డే పనిచేస్తున్న కొంత మంది తెలిసిన వారు చెబుతున్నారు. కానీ మాకు స్పష్టంగా తెలియడం లేదు. జగన్: ఒకే కుటుంబం నుంచి ఇంత మంది ఎందుకు వెళ్లారు? చిన్నమ్మడు: మా ఊళ్లో పూర్తిగా పనులు లేవు... ఉపాధి పనుల వలన కూడా పూట గడవని పరిస్థితి. పొట్టగడవడాని కోసం మా వాళ్లంతా కలిసి చెన్నై వెళ్లారు. జగన్: గోడ కూలిన ఘటనలో ఆ కంపెనీపై కేసులేమైనా పెడ్తున్నారా... మా సాయం కావాలా? మృతుని బావ యర్రయ్య: చెన్నైలో అధికారులు కొంత మంది మా వాళ్ల దగ్గరకు వచ్చి సంతకాలు తీసుకున్నారటన్నా... వాళ్లు మాకు విషయం చెప్పారు. ముందు మాకు సంబంధం లేదని కంపెనీ వాళ్లు బుకాయించారు. జగన్: చెన్నై నుంచి పరిహారం అందిందా? చిన్నమ్మడు: పరిహారం బాండ్లు తయారయ్యాయని అధికారులు చెప్పారు... చిన్న పిల్లలు కావడంతో వారికి ఇవ్వలేదు... మరో రెండు రోజుల పోతే ఆంధ్రాబ్యాంక్‌లోని ఖాతాకు జమచేస్తామని చెప్పారు. తమిళనాడు గవర్నమెంట్ నుంచి కూడా మరో రెండు రోజుల్లో వస్తాయన్నారు. జగన్: మీ ఊళ్లో ఎంత మంది చెన్నై వెళ్లారు... ఊళ్లో ఉపాధి పనులు లేవా? మృతుల బావ ముసలయ్య: మా ఊరు నుంచి ఇంటికి ఒకరు చొప్పున చెన్నైలో ఉన్నారు. ఇక్కడ పనుల్లేవు బాబూ... అందుకే చెన్నై వెళ్లిపోయారు. చనిపోయిన వాళ్లంతా మొన్ననే ఊరోచ్చివెళ్లారు... ఊళ్లో పనులు ఉంటే వారు వెళ్లేవారు కాదు. జగన్: పిల్లలు చదువుతున్నారా... ఎక్కడ చదువుతున్నారు? మృతుల తండ్రి నర్సింహులు: సిమ్మయ్యకు ఒక్క కొడుకు సంతోషే మిగిలాడు... ఇక్కడే చదువుతున్నాడు... అప్పయ్య పిల్లలు ప్రసాద్, అశ్వినిలు వాళ్ల తాతగారి ఊరు జలుమూరులో చదువుతున్నారు. జగన్: మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇక్కడ పార్టీ ఇన్చార్జి శీను ఉంటాడు... రేపు మరళా మీ ఊరు వస్తాడు... ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం కోసం ఆయన మీకు సాయం చేస్తాడు... అంటూ జగన్ మృతుల పిల్లలు ప్రసాద్, అశ్విని, సంతోష్‌లను అప్యాయంగా ముద్దాడారు. రిమ్స్‌క్యాంపస్: చెన్నైలో ఇటీవల జరిగిన రెండు ప్రమాదాల్లో మృతిచెందిన వారిని పరామర్శించేందుకు రెండోరోజు శుక్రవారం నరసన్నపేట మండలంలోని బాలసీమ, సారవకోట మండలంలోని సత్రాం, కోటబొమ్మాళి మండలంలోని పాకివలస, చుట్టిగుండం, భామిని మండలం కొరమ గ్రామాలకు వెళ్లిన రాజన్నబిడ్డ, వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డిని ప్రజలు సాదరంగా ఆహ్వానించారు. కొన్ని చోట్ల తమ సమస్యలు చెప్పుకున్నారు. జగనన్న వచ్చారు...పదండ్రో అంటూ సారువకోట మండలం అలుదు గ్రామం వద్దకు జగన్ కాన్వాయ్ రాగానే అక్కడి ప్రభుత్వ పాఠాశాల విద్యార్థులు రోడ్డుపైకి పరుగులు తీశారు. వారిని జగన్ ఆప్యాయంగా పలకరించారు. సారవకోట మండలం సత్రాం గ్రామానికి జగన్ వస్తున్నారని తెలుసుకుని బి.తవిటయ్య అనే వికలాంగుడు దేకురుకుంటూ రోడ్డుపైకి వచ్చాడు. తవిటయ్యను చూసిన జగన్ దగ్గరకు వెళ్లి కష్టసుఖాలను తెలుసుకున్నారు. బాబు ఎంత మోసం చేశాడో జగనన్నకు చెబుదామంటూ కోటబొమ్మాళి మండలం పాకివలస డ్వాక్రా మహిళలు పరుగున వచ్చారు. మడపాం సమీపంలోని మహిళలు రోడ్డుపై నిరీక్షించడంతో జగన్ కాన్వాయ్‌ను ఆపి వారిని పలకరించారు. రుణాలు మాఫీ చేయకుండా సీఎం చంద్రబాబు తమను మోసం చేశారంటూ బైరి జంక్షన్ వద్ద పలువురు రైతులు ప్లకార్డులు ప్రదర్శించారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని జగన్‌కు విన్నవించారు.ఫీజు రీయింబర్స్మెంట్ అమలయ్యేలా చూడాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య నాయకులు చుట్టిగుండంలో జగన్‌ను కలసి వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లా నుంచి తిరిగివెళ్తున్న జగనన్నకు ఆమదాలవలస వద్ద తమ్మినేని విద్యాసంస్థల విద్యార్థులు టాటా చెప్పారు. -
జగన్ రాక ఏరువాక.
* రెండు రోజులూ జననేత వెన్నంటి నడిచిన వర్షం.. జనం * ఇటు చెన్నై బాధితులకు భరోసా.. అటు పీడిత ప్రజలకు బాసట * జనాదరణ చూసి ఉప్పొంగిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు శ్రీకాకుళం: సార్వత్రిక ఎన్నికల తర్వాత కొంత స్తబ్దత ఆవరించిన వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటన కొత్త ఉత్సాహం నింపింది. టానిక్‌లా పని చేసి నిస్సత్తువను పారదోలింది. నిజానికి ఈ పర్యటన చెన్నై దుర్ఘటనల్లో మృతుల కుటుంబాలను ఓదార్చేందుకు ఉద్దేశించిందే అయినా.. రెండురోజుల పాటు పర్యటన సాగిన తీరు, ప్రజలు అడుగడుగునా జననేతను చూసేందుకు గం టల తరబడి నిరీక్షించిన తీరు పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉత్తేజితం చేసింది. పార్టీ అధికారంలోకి రాకపోయినా.. జనంలో ఏమాత్రం ఆదరణ తగ్గలేదని ఈ పర్యటన ససాక్ష్యంగా రుజువు చేసింది. రైతులు, నిరుద్యోగు లు, విద్యార్థులు, ఇంకా పలు వర్గాల ప్రజలు జగన్ కలుసుకొని తమ కష్టాలు చెప్పుకోవడం.. న్యాయం చేయమని కోరడం చూస్తే ప్రతిపక్ష నాయకునిగా ఆయన్ను ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్నారని స్పష్టమైంది. దీనికితోడు జగన్ సైతం చెన్నై బాధితుల తరఫున అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని చెప్పడం, రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఇంటి కో ఉద్యోగం వంటి హామీల విషయంలో యూటర్న్ తీసుకున్న ప్రభుత్వ తీరు తీవ్రంగా ఎండగట్టడమే కాకుండా రైతుల పక్షాల ఉద్యమిస్తామని ప్రకటించడం ద్వారా ఆయా వర్గాలకు వైఎస్ఆర్సీపీ బాసటగా నిలుస్తుందని చాటిచెప్పడం పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచింది. తమిళనాడులోని చెన్నై, తిరువళ్లూరు ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనల్లో మృతి చెందిన 23 మంది జిల్లావాసుల కుటుం బాలను పరామర్శిం చేందుకు వచ్చిన ఆయన రెండు రోజు ల పాటు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పర్యటించారు. మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్లి బాధితుల కష్టసుఖాలు తెలుసుకున్నారు. అండగా ఉంటామ ని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా బిల్డర్లు, యజమానులతో పరిహారం ఇప్పించేందుకు బాధితుల తరపున పార్టీ పోరాటం చేస్తుందని జగన్ హామీ ఇచ్చారు. దీని కోసం పార్టీ నాయకులతో ఉన్నతస్థాయి కమిటీని వేసి చెన్నై పంపిస్తామన్నారు. అలాగే పలుచోట్ల రైతులు జననేత వాహనాన్ని ఆపి రుణమాఫీపై టీడీపీ ప్రభుత్వ సాచివేత ధోరణిని ప్రసావించారు. ప్లకార్డులతో ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీనికి జగన్ స్పందిస్తూ ప్రభుత్వానికి నెలరోజులు గడువిస్తున్నామని, అప్పటికీ రుణమాఫీ చేయకుంటే రైతుల పక్షాన నిరాహార దీక్షలు, ధర్నాలు చేపడతామని ప్రకటించారు. తద్వారా ప్రజాపోరాటాలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు సూచించారు. విద్యార్థుల మధ్యాహ్న భోజనం, ఆదర్శ రైతుల తొలగింపు, ఫీజు రీయింబర్స్మెంట్ తదితర అంశాలపై ఆయా వర్గాల ప్రజలు చేసుకున్న విన్నపాలకు జగన్ సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రభుత్వంతో పోరాడతామని చెప్పడం ద్వారా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటాలే తమ ఎజెండా అన్నట్లు పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇచ్చారు. ఇవన్నీ ఒకెత్తయితే జగన్ అర్ధరాత్రి వరకు పర్యటించినా.. ఆయన పర్యటన సాగిన మార్గాల్లో ప్రతి గ్రామ కూడలి వద్ద మహిళలు, వృద్ధులు సైతం పెద్ద సంఖ్యలో నిరీక్షించారు. జగన్‌ను చూడగానే ఆయనతో మాట్లాడేందుకు, చేయి కలిపేందుకు పోటీ పడటం.. జగన్ కూడా ఎక్కడికక్కడ వాహనం ఆపి వారిని ఆప్యాయంగా పలకరిస్తూ, చిన్నారులను ఆశీర్వదిస్తూ ముందుకు సాగడం పార్టీకి కొత్త ఊపునిచ్చింది.