జగన్ రాక ఏరువాక.
* రెండు రోజులూ జననేత వెన్నంటి నడిచిన వర్షం.. జనం
* ఇటు చెన్నై బాధితులకు భరోసా.. అటు పీడిత ప్రజలకు బాసట
* జనాదరణ చూసి ఉప్పొంగిన వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు
శ్రీకాకుళం: సార్వత్రిక ఎన్నికల తర్వాత కొంత స్తబ్దత ఆవరించిన వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణుల్లో పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటన కొత్త ఉత్సాహం నింపింది. టానిక్‌లా పని చేసి నిస్సత్తువను పారదోలింది. నిజానికి ఈ పర్యటన చెన్నై దుర్ఘటనల్లో మృతుల కుటుంబాలను ఓదార్చేందుకు ఉద్దేశించిందే అయినా.. రెండురోజుల పాటు పర్యటన సాగిన తీరు, ప్రజలు అడుగడుగునా జననేతను చూసేందుకు గం టల తరబడి నిరీక్షించిన తీరు పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉత్తేజితం చేసింది. పార్టీ అధికారంలోకి రాకపోయినా.. జనంలో ఏమాత్రం ఆదరణ తగ్గలేదని ఈ పర్యటన ససాక్ష్యంగా రుజువు చేసింది.
రైతులు, నిరుద్యోగు లు, విద్యార్థులు, ఇంకా పలు వర్గాల ప్రజలు జగన్ కలుసుకొని తమ కష్టాలు చెప్పుకోవడం.. న్యాయం చేయమని కోరడం చూస్తే ప్రతిపక్ష నాయకునిగా ఆయన్ను ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్నారని స్పష్టమైంది. దీనికితోడు జగన్ సైతం చెన్నై బాధితుల తరఫున అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని చెప్పడం, రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఇంటి కో ఉద్యోగం వంటి హామీల విషయంలో యూటర్న్ తీసుకున్న ప్రభుత్వ తీరు తీవ్రంగా ఎండగట్టడమే కాకుండా రైతుల పక్షాల ఉద్యమిస్తామని ప్రకటించడం ద్వారా ఆయా వర్గాలకు వైఎస్‌ఆర్‌సీపీ బాసటగా నిలుస్తుందని చాటిచెప్పడం పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచింది. తమిళనాడులోని చెన్నై, తిరువళ్లూరు ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనల్లో మృతి చెందిన 23 మంది జిల్లావాసుల కుటుం బాలను పరామర్శిం చేందుకు వచ్చిన ఆయన రెండు రోజు ల పాటు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పర్యటించారు.
మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్లి బాధితుల కష్టసుఖాలు తెలుసుకున్నారు. అండగా ఉంటామ ని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా బిల్డర్లు, యజమానులతో పరిహారం ఇప్పించేందుకు బాధితుల తరపున పార్టీ పోరాటం చేస్తుందని జగన్ హామీ ఇచ్చారు. దీని కోసం పార్టీ నాయకులతో ఉన్నతస్థాయి కమిటీని వేసి చెన్నై పంపిస్తామన్నారు. అలాగే పలుచోట్ల రైతులు జననేత వాహనాన్ని ఆపి రుణమాఫీపై టీడీపీ ప్రభుత్వ సాచివేత ధోరణిని ప్రసావించారు. ప్లకార్డులతో ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీనికి జగన్ స్పందిస్తూ ప్రభుత్వానికి నెలరోజులు గడువిస్తున్నామని, అప్పటికీ రుణమాఫీ చేయకుంటే రైతుల పక్షాన నిరాహార దీక్షలు, ధర్నాలు చేపడతామని ప్రకటించారు.
తద్వారా ప్రజాపోరాటాలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు సూచించారు. విద్యార్థుల మధ్యాహ్న భోజనం, ఆదర్శ రైతుల తొలగింపు, ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితర అంశాలపై ఆయా వర్గాల ప్రజలు చేసుకున్న విన్నపాలకు జగన్ సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రభుత్వంతో పోరాడతామని చెప్పడం ద్వారా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటాలే తమ ఎజెండా అన్నట్లు పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇచ్చారు. ఇవన్నీ ఒకెత్తయితే జగన్ అర్ధరాత్రి వరకు పర్యటించినా.. ఆయన పర్యటన సాగిన మార్గాల్లో ప్రతి గ్రామ కూడలి వద్ద మహిళలు, వృద్ధులు సైతం పెద్ద సంఖ్యలో నిరీక్షించారు. జగన్‌ను చూడగానే ఆయనతో మాట్లాడేందుకు, చేయి కలిపేందుకు పోటీ పడటం.. జగన్ కూడా ఎక్కడికక్కడ వాహనం ఆపి వారిని ఆప్యాయంగా పలకరిస్తూ, చిన్నారులను ఆశీర్వదిస్తూ ముందుకు సాగడం పార్టీకి కొత్త ఊపునిచ్చింది.