అదే హోరు... అదే జోరు | Y.S.Jagan Mohan Reddy District tour in srikakulam | Sakshi
Sakshi News home page

అదే హోరు... అదే జోరు

Published Sat, Jul 19 2014 4:55 AM | Last Updated on Wed, Aug 8 2018 5:33 PM

అదే హోరు... అదే జోరు - Sakshi

అదే హోరు... అదే జోరు

* ముగిసిన వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ పర్యటన
* బాధితుల మోముల్లో మందహాసం
* నేతలకు అభయహస్తం

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఆయన రాక ఏరువాకే అయింది. బాధల్లో, కష్టాల్లో ఉన్నవారికి తానున్నానంటూ ధైర్యం చెప్పడానికి తమ నేత వచ్చాడంటూ జిల్లా ప్రజలు ఉప్పొంగిపోయారు. రెండు రోజుల పర్యటనకు శ్రీకాకుళం జిల్లాకు విచ్చేసిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలు అక్కున చేర్చుకున్నారు. తమ కుటుంబ సభ్యుడే వచ్చినట్టుగా హారతులు పట్టారు. తమిళనాడులో ఇటీవల జరిగిన వేర్వేరు ఘటనల్లో జిల్లా వాసులు 23 మంది మృత్యువాతపడగా మరో ముగ్గురు గాయపడ్డారు. వారి కుటుంబాలను పరామర్శించి నేనున్నానంటూ భరోసా ఇవ్వడానికి బుధవారం అర్ధరాత్రి జిల్లాలో అడుగుపెట్టిన జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు.

బుధవారం రాత్రి ఆమదాలవలసలో బస చేసిన ఆయన గురువారం బూర్జ, పాలకొండ, హిరమండలం, ఎల్.ఎన్.పేట తదితర ప్రాంతాల్లో రాత్రి వరకు ప్రజలను పలకరిస్తూ వెళ్లారు. గురువారం రాత్రి శ్రీకాకుళంలో బస చేసి శుక్రవారం ఉదయం నరసన్నపేట, టెక్కలి, పాలకొండ నియోజకవర్గాల్లో బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. బోరున వర్షం కురుస్తున్నప్పటికీ మాముమూల గ్రామాల నుంచి ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ అభిమాన నాయకుడిని కళ్లారా చూసి మురిసిపోయారు. జగన్‌మోహన్‌రెడ్డి అడుగడుగునా ప్రజలను చిరునవ్వుతో పలకరిస్తూ భవిష్యత్తు మనదే అంటూ ధీమా ఇచ్చారు.

మీ కష్టాల్లో పాలుపంచుకుంటానంటూ భరోసా ఇచ్చారు. నువ్వు తప్ప మాకెవరయ్యా అంటూ అదేరీతిలో ప్రజలూ స్పందించారు.
 రుణ మాఫీ పేరుతో టీడీపీ ప్రభుత్వం నట్టేట ముంచిందని రైతులు వాపోయారు. ఓట్లు దండుకున్న తర్వాత చంద్రబాబు ముఖం తిప్పేశారని మహిళలు శాపనార్థాలు పెట్టారు. నీలం, పై-లీన్ తుపానుల పరిహారం నేటికీ అందని వైనాన్ని భామిని మండలం కొరమలో ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. రుణ మాఫీ విషయమై చంద్రబాబు నాటకాలాడుతున్నారని బూర్జ మండలంలో రైతులు జగన్ ఎదుట వాపోయారు. ప్రభుత్వానికి నెల రోజులు టైమిద్దాం... అప్పటికీ ఫలితం లేకపోతే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేద్దామని జగన్ చెప్పడంతో రైతుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది.

మొత్తంమీద జగనన్న పర్యటన ఇటు బాధితుల కుటుంబాలకు మనోధైర్యం ఇవ్వగా అటు పార్టీ శ్రేణులను ఉత్తేజ పర్చింది. కాగా జగన్ పరామర్శ ఇతర పార్టీ నాయకుల్లో చర్చనీయాంశమైంది. ప్రతిపక్ష నేత స్పందించినంత రీతిలో తాము స్పందించలేకపోయామని చర్చించుకోవడం కనిపించింది. జగన్‌మోహన్‌రెడ్డి చుట్టిగుండం నుంచి భామిని మండలం కొమర వెళుతున్న మార్గంలో ఆదర్శ రైతులు టీడీపీ వచ్చాక తమకు అన్యాయం జరుగుతోందని ప్లకార్డులతో కనిపించారు. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలో 3 వేల మంది ఆదర్శ రైతులు రోడ్డున పడతారని, తమను ఆదుకోవాలని జగన్‌కు విజ్ఞప్తి చేశారు. పాకివలస, కొరమ ప్రాంతాలు జనసంద్రమయ్యాయి.

జగన్‌మోహన్‌రెడ్డిని చూసి వారంతా పొంగిపోయారు. చెన్నై బాధితుల కుటుంబాలను పరామర్శించడానికే వచ్చినప్పటికీ భామిని మండలంలో ఇటీవల చెరువులో ఈతకు దిగి మృతి చెందిన ఐదుగురి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. సంఘటన ఎలా జరిగిందీ అడిగి తెలుసుకున్నారు. వివిధ వర్గాల వారు కలిసి సమస్యలను విన్నవించుకున్నారు. మొత్తం మీద జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన భరోసా అందరికీ కొండంత ధైర్యం ఇచ్చింది. ఈ పర్యటనలో పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, ఎమ్మెల్యేలు కలమట వెంకటరమణ, విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు, సీఈసీ సభ్యురాలు వరుదు కల్యాణి, మాజీ ఎమ్మెల్యే పి.సాయిరాజ్, పార్టీ నాయకులు రెడ్డి శాంతి, అంధవరపు సూరిబాబు, దువ్వాడ శ్రీనివాస్, నర్తు రామారావు, వజ్జ బాబూరావు, పేడాడ తిలక్, పాలవలస విక్రాంత్, విశాఖ నుంచి వచ్చిన గుడివాడ అమర్‌నాథ్ తదితరులు పాల్గొన్నారు.
 
అందరికీ థ్యాంక్స్ : వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణదాస్
నరసన్నపేట: వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల జిల్లా పర్యటన విజయవంతం చేసిన పార్టీ శ్రేణులు, అభిమానులకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ కృతజ్ఞతలు తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన బాధితుల కుటుంబాల్లో ఆత్మస్థైర్యం నింపిందన్నారు. భవిష్యత్‌లో బిల్డర్ల నుంచి పరిహారం అందేలా న్యాయపోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. వర్షం కురుస్తున్నా కార్యక్రమం విజయవంతం చేసినందుకు అభినందనలు తెలిపారు.

 
విద్యార్థుల సమస్యలకు మద్దతు ఇవ్వండి
టెక్కలి: ప్రస్తుతం విద్యార్థులు ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, ప్రతిపక్ష నేతగా మద్దతు తెలియజేసి సమస్యలపై పోరాడాలని కోరుతూ ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి టి.సూర్యం శుక్రవారం వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కోటబొమ్మాళి మండలం పాకివలసలో ఆయన జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు వివరించారు. సకాలంలో ఉపకార వేతనాలు అందడంలేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్ సక్రమంగా వర్తించడం లేదని చెప్పారు.
 
అన్నా... నాబిడ్డను ఆదుకోవా!
జగన్‌కు మందస మహిళ వినతి

పీఎన్‌కాలనీ: ‘‘అన్నా... నా బిడ్డ జబ్బుపడ్డాడు. వైద్యం చేయించాలంటే లక్షల్లో ఖర్చవుతోంది. ఢిల్లీ తీసుకువెళితే బాగుపడొచ్చని డాక్టర్లు అంటున్నారు. నువ్వే ఆదుకోవాలి’’ అంటూ మందస మండలానికి చెందిన ఓ మహిళ వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని అభ్యర్థించింది. ఆమె కష్టాన్ని ఓపిగ్గా విన్న జగన్‌మోహన్‌రెడ్డి తప్పకుండా సాయం చేస్తానని హామీ ఇచ్చారు. పక్కనే ఉన్న సహాయకుడిని పిలిచి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలు ఇవీ... మందస మండలం ఉగ్రువానిపేటకు చెందిన డొక్కర హైమావతికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు.

పదో తరగతి చదువుతున్న కుమారుడి చేతివేళ్లు కొన్నేళ్లుగా బొబ్బలు వచ్చి వాచిపోతున్నాయి. ఎన్ని ఆస్పత్రులు తిరిగిన ఫలితం కనిపించలేదు. ఢిల్లీలో చూపిస్తే హెమెంజియా అనే వ్యాధని, చికిత్సకు *5 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. నిరుపేదరాలైన హైమావతి ఏం చేయాలో పాలుపోక దాతల కోసం ఎదురు చూస్తోంది. ఆమె భర్త డొక్కరి జానకిరావు గల్ఫ్‌లో కూలీకి వెళ్లాడు. ఏడాదిన్నర అయినా ఇంకా తిరిగిరాలేదు. దీంతో కొడుకుని ఎలాగైనా రక్షించుకోవాలని ఆమె తన గోడును జగన్‌మోహన్‌రెడ్డికి చెప్పుకుంది.
 
బాధితుల కన్నీళ్లు తుడుస్తూ...
శ్రీకాకుళం సిటీ: వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటన బాధితుల కన్నీళ్లు తుడిచింది. దగ్గరి బంధువులా బాధితుల పక్కనే కూర్చుని కష్టసుఖాలను తెలుసుకోవడం వారికి కొండత ధైర్యాన్ని ఇచ్చింది. ఒక్కొక్కరి పేర్లు, బంధుత్వాలను తెలుసుకుంటూ, ప్రతి ఒక్కరితోనూ మాట్లాడి నేనున్నాననే భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యుడిగా వారితో మమేకమయ్యారు. ఇదంతా చూసి బాధితుల కుటుంబ సభ్యులు చలించిపోయారు. పరామర్శ కోసం జగన్‌మోహన్‌రెడ్డి అంతటి వాడు మా ఇంటికి రావడాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నామని పలువురు వ్యాఖ్యానించారు. కాగా జగన్‌మోహన్‌రెడ్డిని కనులారా చూడడంతో చాలామంది పరవశించిపోయారు. బాధితుల పరామర్శకు వచ్చినప్పటికీ తన కోసం గంటల తరబడి నిరీక్షించిన వారికి కుశల ప్రశ్నలు వేయడంతో వారు మురిసిపోయారు.
 
పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తూ..
ఇదిలా ఉండగా ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి ప్రతిపక్ష నేతగా జిల్లాలో అడుగుపెట్టిన వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడిడ పార్టీ తరఫున చేయాల్సిన కార్యక్రమాలపై ముఖ్య నేతలతో మాట్లాడుతూ దిశానిర్దేశం చేశారు. బాధితుల కష్టాలపై రెండు మూడు రోజుల తర్వాత ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు. బాధితుల తరఫున కోర్టుల్లో కేసువు వేయించి నష్టపరిహారం పూర్తిగా అందేలా చూడాలన్నారు. రైతుల, డ్వాక్రా మహిళల రుణాల మాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగ కల్పన తదితర హామీలపై ప్రభుత్వ తీరుపై ఎలా నిరసన తెలియజేయాలో ముఖ్యనేతలతో చర్చించారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలపై అవగాహన వచ్చేలా సమాచారం అందించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement