'అద్దె'రిపోయే ఆఫర్
దివ్య దర్శనం.. ద్రవ్యభారం..
ప్రముఖ దేవస్థానాలపై ‘ద్రవ్య’భారం
- జనవరి నుంచి ఇప్పటి వరకూ బస్సుల అద్దె రూ.2.5 కోట్లు
సగం టీటీడీ, మిగిలిన సగం ఏడు దేవస్థానాలు భరించాలని ఆదేశం
అన్నవరం దేవస్థానం వాటాగా రూ.17.85 లక్షలట..
‘సొమ్మొకరిది.. సోకొకరిది’ అన్నట్టుగా ఉంది ‘దివ్యదర్శనం ’ పథకం అమలు తీరు. ఈ పథకం కింద పేదలకు ఉచితంగా యాత్రలు చేయిస్తున్నామని ప్రభుత్వం ఓ పక్క ప్రచారం చేసుకుంటూనే.. మరోపక్క ఆ యాత్రలకయ్యే ఖర్చులను భరించాల్సిందేనంటూ దేవస్థానాలపై రుద్దడం విశేషం. - అన్నవరం(ప్రత్తిపాడు)
తీర్థయాత్రలు చేయలేని పేద భక్తులను వివిధ పుణ్యక్షేత్రాలకు ఉచితంగా బస్సుల్లో తీసుకువెళ్లి దర్శనాల అనంతరం తిరిగి వారి స్వగృహాలకు చేర్చేందుకు ఉద్దేశించిన ‘దివ్యదర్శనం’ పథకాన్ని గత జనవరిలో ప్రభుత్వం ప్రారంభించింది. భక్తులకు దివ్యదర్శనం చేయిస్తున్నందుకు గాను అయ్యే రవాణా చార్జీల భారాన్ని ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు రాష్ట్రంలోని ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాలపై మోపింది. దివ్యదర్శనం పథకం కింద వచ్చే భక్తులకు ఇప్పటికే ఆయా దేవస్థానాలు ఉచిత వసతి, భోజనసౌకర్యం కల్పిస్తుండగా.. తాజాగా వారు వచ్చే బస్సుల అద్దె కూడా భరించాలని ఆదేశాల్లో పేర్కొంది. గత జనవరి నుంచి ఇప్పటి వరకూ ఈ ‘దివ్యదర్శనం’ బస్సులకు అద్దెల కింద రూ.2.5 కోట్లు ఖర్చుకాగా అందులో సగం తిరుమల తిరుపతి దేవస్థానం, మిగిలిన సగం ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాలు భరించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీని ప్రకారం సింహాచలం, అన్నవరం, ద్వారకాతిరుమల, విజయవాడ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, పెనుగంచిప్రోలు దేవస్థానాలు రూ.17,85 లక్షలు చొప్పున చెల్లించాలని దేవాదాయశాఖ ప్రిన్స్‌పల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలు అన్నవరం దేవస్థానానికి శనివారం అందాయి.
సీజీఎఫ్ నుంచి చెల్లించే వీలున్నా..
ఏటా దేవస్థానాలు తమ వార్షికాదాయంలో 15శాతం ‘కామన్ గుడ్ ఫండ్ ’ తదితర నిధులకు చెల్లిస్తున్నాయి. ఒక్క అన్నవరం దేవస్థానమే సుమారు రూ.15 కోట్ల వరకూ చెల్లిస్తోంది. ఆ మొత్తం నుంచి ఈ ‘దివ్యదర్శనం’ పథకానికి నిధులు ప్రభుత్వం చెల్లించవచ్చు. కానీ అలా చేయకుండా మరలా అదనంగా దీనికి వసూలు చేయడంపై ఆలయ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దివ్యదర్శనం పథకం ఎన్ని రోజులు అమలైతే అన్ని రోజులు ఈ విధంగా దేవస్థానాలు ఈ భారం మోయాల్సిందేనని అధికారులు తెలిపారు.