తెలంగాణకు 163, ఏపీకి 211 మంది ఐఏఎస్‌లు
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన నేపథ్యంలో సివిల్ సర్వెంట్ల విభజన ఓ కొలిక్కి వచ్చింది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల విభజనపై ప్రత్యూష్ సిన్హా కమిటీ శనివారం సమావేశం అయ్యింది. లాటరీ ప్రక్రియ ద్వారా రోస్టర్ విధానంతో అధికారుల కేటాయింపు పూర్తయింది. ముందుగా తెలంగాణ పేరు లాటరీలో రావడంతో రోస్టర్ విధానాన్ని తెలంగాణ నుంచే అమలు చేశారు. రెండు రాష్ట్రాలకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ పోస్టులను లాటరీ ద్వారానే నిర్ణయించారు.
తెలంగాణకు ఐఏఎస్-163, ఐపీఎస్-112, ఐఎఫ్ఎస్-65 మంది అధికారులను కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌కు ఐఏఎస్-211, ఐపీఎస్-144, ఐఎఫ్ఎస్-85 మంది అధికారులను కేటాయించారు. వచ్చే శనివారానికల్లా అధికారుల కేటాయింపు పూర్తవుతుందని రేమండ్ పీటర్ తెలిపారు. అధికారుల విభజన 13:10 నిష్ఫత్తిలో జరుగుతుందని ఆయన చెప్పారు. గతంలో ఆప్షన్ల కోసం ఇచ్చిన సీల్డ్ కవర్లను నేడు కమిటీ పరిశీలిస్తుందన్నారు. ప్రత్యూష్ సిన్హా కమిటీ మరోసారి సమావేశం కానున్నట్లు రేమండ్ పీటర్ పేర్కొన్నారు.