‘డివైన్ లవర్స్’గా కంగనా, ఇర్ఫాన్
మొన్న ‘క్వీన్’గా..., నిన్న ‘రివాల్వర్ రాణీ’గా ప్రేక్షకుల ముందుకొచ్చి అలరించిన ‘ఫ్యాషన్ డాల్’ కంగనా రనౌత్ మరో ప్రత్యేక చిత్రంతో అభిమానులకు కనువిందు చేయనుంది. కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలతో దూసుకుపోతున్న కంగనా ఈసారి మాత్రం నటుడు ఇర్ఫాన్‌ఖాన్‌తో జతకడుతోంది. తాను తెరకెక్కిస్తున్న ‘డివైన్ లవర్స్’ సినిమాలో వీరిద్దరు నటిస్తున్నట్లు ప్రముఖ దర్శకుడు సాయి కబీర్ మంగళవారం మీడియాకు తెలిపారు. ఈ విషయమై దర్శకుడు సాయి కబీర్ మాట్లాడుతూ... ‘కంగనా రనౌత్, ఇర్ఫాన్‌ఖాన్‌లతో కలిసి ‘డివైన్ లవర్స్’ పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్నాను. ఇప్పటికే ఈ పేరుతో వచ్చిన సినిమాలు మంచి ప్రేక్షకాదరణను సంపాదించుకున్నాయి. ‘క్వీన్’ సినిమా తర్వాత దాదాపుగా కథానాయిక ప్రధాన్యమున్న చిత్రం ‘రివాల్వర్ రాణీ’లోనే కంగనా నటించింది.
మరోసారి అటువంటి చిత్రంతోనే ప్రేక్షకుల ముందుకొస్తుందని అందరూ భావించారు. అయితే కంగనా మాత్రం అటువంటి కట్టుబాట్లతో గిరిగీసుకోకుండా ఇర్ఫాన్‌తో కలిసి తెరను పంచుకోవడానికి పచ్చజెండా ఊపింది. కంగనా నటించిన మిగతా చిత్రాలకు ఇది భిన్నంగా ఉంటుంది. భారతీయ కళకు అద్దం పట్టేలా చిత్రాన్ని నిర్మిస్తాం. ముంబై, అలీగఢ్ వంటి ప్రదేశాల్లో సినిమాను తెరకెక్కించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. మధ్యతరగతి జీవితాల్లోని నీతి, నిజాయతీలను కథావస్తువుగా తీసుకున్నామ’ని చెప్పారు. కంగనాతో భవిష్యత్తులో భారీ చిత్రాలు నిర్మిస్తానని చెప్పిన కబీర్ అంతవరకు వచ్చిన ఈ గ్యాప్‌లో ‘డివైన్ లవర్స్’ పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. సయీద్ మీర్జా, కుందన్ షాల తాను ఎంతో స్ఫూర్తిని పొందానని, అదే స్ఫూర్తితో సినిమాలను తెరకెక్కిస్తున్నానని చెప్పాడు.