హడావుడి వద్దు.. శాస్త్రీయంగా చేయండి
♦ కొత్త జిల్లాలపై అఖిలపక్షాన్ని సమావేశపరచి
♦ అన్ని ప్రతిపాదనలపై చర్చించండి: సీఎల్పీ నేత జానారెడ్డి
♦ ప్రజలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల వాదనలూ వినండి
♦ నియోజకవర్గాల విభజన తర్వాతే.. జిల్లాలను విభజిస్తే బాగుంటుంది
♦ జిల్లా పరిషత్‌ల విషయంలోనూ సమస్యలు వస్తాయి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన జిల్లాల విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు కార్యక్రమాన్ని హడావుడిగా కాకుండా శాస్త్రీయంగా చేపట్టాలని కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత కుందూరు జానారెడ్డి సీఎం కేసీఆర్‌కు సూచించారు. జిల్లాల విభజన విషయంలో ప్రజల డిమాండ్లను, పార్టీల అభిప్రాయాలను తీసుకుని సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని, హడావుడిగా నిర్ణయాలు తీసుకుని ప్రజల్ని ఇబ్బంది పెట్టవద్దని అన్నారు. శనివారం నల్లగొండలో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావులతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా జిల్లాల విభజనను పరిశీ లిస్తే.. పాలనా సౌలభ్యం కోసం ఒక రాష్ట్రం లోని కొన్ని జిల్లాలనే విభజించిన సందర్భాలున్నాయి కానీ, రాష్ట్రం మొత్తాన్ని విభజించిన సందర్భాలు లేవని అన్నారు.
‘ప్రజ లు, ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోండి. అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ ప్రతిపాదనల్ని సమగ్రంగా చర్చించండి. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు కానీ, 2009 ఎన్నికలకు ముందు నియోజకవర్గాలను పునర్విభజించినప్పుడు కానీ అందరితో చర్చించిన తర్వాతే అప్పటి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ ప్రభుత్వం కూడా కొత్త జిల్లాల విషయంలో అలాగే చేయాలి’ అని జానా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల విభజన అంశాన్నీ దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో మరో 34 అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు చేసుకునే వీలుంది. పార్లమెంటు స్థానాలకు అనుగుణంగా ఆ నియోజకవర్గాలను విభజించాలి.
ఆ విభజన పూర్తయితేనే ఏ మండలం ఏ నియోజకవర్గంలో ఉంటుందో తేలుతుంది. అప్పుడే జిల్లాల విభజనకు శ్రీకారం చుట్టా లి. అలాకాక ఫలానా మండలం ఫలానా నియోజకవర్గంలో ఉంటుందని, ఫలానా నియోజకవర్గం ఫలానా పార్లమెంటు స్థానంలో ఉంటుందని ఊహించుకుని చేయడం ద్వారా భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి’ అని ఆయన అన్నారు. అదే విధం గా జిల్లా పరిషత్‌ల ఏర్పాటు విషయంలో రిజర్వేషన్ల సమస్య వస్తుందని, అన్ని విషయాలపై న్యాయకోవిదులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని జానారెడ్డి కోరారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడకుంటే చేతికి చిప్పే గతి: ఎంపీ గుత్తా
జిల్లాల విభజన విషయంలో సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకూ అసంతృప్తి ఉందని, వారు బయటకు చెప్పడం లేదని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికైనా మాట్లాడకపోతే.. ప్రజలు వారి చేతికి చిప్ప ఇస్తారని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేయాలన్న దురాలోచనతో టీఆర్ఎస్ ప్రభుత్వం వెళుతోందని, ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదన్నారు. అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు చేస్తే అది మెడలో పామై పడుతుందని ఆయన హెచ్చరించారు.