జిల్లాల విభజన అశాస్త్రీయం: కోదండరాం
గుండాల: జిల్లాల పునర్విభజన అశాస్త్రీయంగా జరిగిందని.. నీకో జిల్లా, నాకో జిల్లా అని రాజులు పంచుకున్న సామ్రాజ్యంలా విభజన చేశారని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. ప్రజా భీష్టం మేరకే మండలాలు, జిల్లాల విభజన జరుగుతుందని ప్రగల్భాలు పలికిన పాలకులు.. ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా విభజించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనగామ జిల్లాలో ఉన్న గుండాల మండలాన్ని యాదాద్రిలో కలపాలని విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో రెండు నెలలుగా సాగుతున్న ఆందోళనలో భాగంగా గుండాలలో బుధవారం మిలీనియం మార్చ్ జరిగింది. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం 60 ఏళ్లుగా పోరాటం చేసి తెలంగాణను సాధించుకుంటే.. పాలకులు బంగారు తెలంగాణగా మారుస్తామని భ్రష్టుపట్టించారని అన్నారు. సబ్బండ జాతి ఏకమై ఉద్యమిస్తే ప్రజాభీష్టాన్ని పట్టించు కోని పాలకులు సన్నాసుల్లో కలుస్తారని ఆయన ఆవేశ పూరితంగా అన్నారు.