న్యూఢిల్లీ: రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లులో తాము కోరుతున్న మార్పులు చేర్పులు చేసి ఆంక్షలులేని సంపూర్ణ తెలంగాణను కేంద్ర కేబినెట్ ఆమోదించాలని కోరుతూ తెలంగాణ జేఏసీ నేతలు శుక్రవారం ఏపీభవన్‌లోని బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మౌనదీక్ష చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణ బిల్లుపై వెనుకడుగువేసే పార్టీల పునాదులు ఉండవని హెచ్చరించారు. కేబినెట్ సమావేశానికి రెండుగంటల ముందు దీక్షకు దిగిన నేతలు హైదరాబాద్‌పై ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
దేశంలోని మిగతా రాష్ట్రాల మాదిరే తెలంగాణకు అన్ని అధికారాలు ఇవ్వాలని కోరారు. వీటితోపాటే భద్రచాలం డివిజన్‌ను తెలంగాణలోనే ఉంచాలని, అవసరమైతే పోలవరం ప్రాజెక్టు డిజైన్‌ను మార్చాలని డిమాండ్ చేశారు. జేఏసీ ఛైర్మన్ కోదండరాం, టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్, టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌ల నేతృత్వంలో జరిగిన ఈ దీక్షలో విఠల్, రఘు, అద్దంకి దయాకర్, మల్లేపల్లి లక్ష్మయ్యతో పాటు ఓయూ జేఏసీ నేతలు పున్నా కైలాశ్, జగన్, రమేశ్‌లు, పెద్ద సంఖ్యలో తెలంగాణవాదులు పాల్గొన్నారు. ఈసందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.
ముఖ్యాంశాలు...
* మెజారిటీ పార్టీలు వ్యతిరేకించినా అమెరికాతో అణుఒప్పందాన్ని ఆమోదించినట్టుగానే ప్రభుత్వం తెలంగాణ బిల్లును ఆమోదింపచేసుకోవాలి.
* డబ్బు, అహంకారంతోనే సీమాంధ్ర నేతలు తెలంగాణను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణ.
* విభజన విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినా సీమాంధ్రనేతల వైఖరి మారకపోవడం దారుణం.
బిల్లుపై వెనుకడుగువేస్తే పునాదులుండవు
Published Fri, Feb 7 2014 10:07 PM | Last Updated on Tue, Aug 28 2018 5:36 PM
Advertisement
Advertisement