తెలంగాణ స్వతంత్రతను తగ్గించొద్దు | TJAC Send Alternative reports to GOM on Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణ స్వతంత్రతను తగ్గించొద్దు

Published Sat, Oct 19 2013 3:53 AM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM

TJAC Send Alternative reports to GOM on Telangana

* కేంద్ర మంత్రుల బృందానికి టీ-జేఏసీ ప్రత్యామ్నాయ నివేదికలు
* తెలంగాణలోని సీమాంధ్రులకు భారత రాజ్యాంగమే రక్ష
* ఆస్తులు, అప్పులను జనాభా ప్రాతిపదికన పంచకూడదు
* జీఓఎంకు నివేదికలు ఈ-మెయిల్ చేసిన తెలంగాణ జేఏసీ
 
సాక్షి, హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్ర అధికారాలను కుదించకుండా, స్వతంత్రతకు భంగం కలగకుండా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర మంత్రుల బృందానికి (జీఓఎం) తెలంగాణ జేఏసీ ప్రత్యామ్నాయ నివేదికను పంపింది. టీ-జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అధ్యక్షతన శుక్రవారం హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్‌లో జేఏసీ స్టీరింగ్ కమిటీ ముఖ్యులు సమావేశమై సుదీర్ఘ సమాలోచనల అనంతరం తుది నివేదికను ఈ-మెయిల్ ద్వారా జీవోఎంకు పంపించారు. మూడు రోజుల పాటు కొనసాగిన సమాలోచనల్లో.. హైదరాబాద్, నీరు, విద్యుత్, విద్య, బొగ్గు, వైద్యవిద్య, ఆర్టికల్ 371(డి), వెనుకబాటుతనం వంటి ఇతర అంశాలపై ఆయా రంగాలకు చెందిన జేఏసీ నిపుణులు అందించిన నివేదికలపై చర్చించి తుది నివేదికను రూపొందించారు.

ఒక్కొక్క అంశంపై సంక్షిప్త నోటు, పూర్తి వివరణాత్మక నోటు, వాటికి సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలు, సమాచారం పూర్తిగా ఈ నివేదికల్లో పొందుపరిచారు. మొత్తం 125 పేజీల నివేదికను జేఏసీలోని 44 భాగస్వామ్య సంఘాల పేరుతో 14 ఫైళ్లుగా జీఓఎంకు శుక్రవారం రాత్రి ఈ-మెయిల్ చేశారు. తెలంగాణ విభజనపై కే బినెట్ నోట్‌కు కేంద్రం ఆమోదముద్ర వేసిన తర్వాత విభజనలో ఎదురయ్యే ఆయా అంశాలను పరిశీలించటానికి జీఓఎంను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ఆ జీఓఎం సంబంధిత అంశాలపై అభిప్రాయాలను పంపించాలంటూ ఒక ఈ-మెయిల్ ఐడీ ఇవ్వటంతో పాటు సమాచారాన్ని ఇవ్వాలని కోరింది. ఆ మేరకు రాష్ట్ర విభజన ప్రక్రియ సాఫీగా పూర్తి చేయడంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి ఉన్న సానుకూల అంశాలన్నింటినీ చర్చించి టీ-జేఏసీ ఈ నివేదికను పంపించింది. ఈ సమావేశంలో జేఏసీ ముఖ్యనేతలు మల్లేపల్లి లక్ష్మయ్య, కత్తి వెంకటస్వామి, సి.విఠల్, అద్దంకి దయాకర్, వెంకటరెడ్డి, దేవీప్రసాద్, రఘు, పిట్టల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. జేఏసీ పంపిన ప్రత్యామ్నాయ నివేదికలోని ముఖ్యాంశాలివీ...
 
మూడేళ్లు ‘తాత్కాలిక’ ఉమ్మడి రాజధాని
హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్లు అవసరం లేదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ఈ సమయంలో మూడేళ్లు సరిపోతుంది. ఈ మూడేళ్ల లోపే సీమాంధ్రలో కొత్త రాజధానిని అన్ని హంగులతో నిర్మించుకోవచ్చు. ఆ మూడేళ్లు కూడా ‘ఉమ్మడి’ అని కాకుండా ‘తాత్కాలిక’ రాజధానిగానే పేర్కొనాలి. హైదరాబాద్ మధ్యలో కాకుండా శివార్లలోని రామోజీ ఫిలిం సిటీ, కంటోన్మెంట్, హైటెక్ సిటీ వంటి వాటిలో సీమాంధ్రకు పరిపాలనా కేంద్రాలుగా చేసి, ఒక ప్రాంతానికే పరిమితం చేయాలి. దీనివల్ల ఇరుప్రాంతాల ప్రజల మధ్య ఘర్షణ, వైషమ్యాలు పెరగకుండా ఉంటాయి.
 
ప్రత్యేక రక్షణలు అవసరం లేదు...
తెలంగాణ రాష్ట్ర అధికారాలను కుదిస్తే ప్రజల్లో అశాంతి పెరిగి, మళ్లీ ఉద్యమాలు ఊపందుకుంటాయి. తెలంగాణ రాష్ట్ర అధికారాలను కేంద్ర ప్రభుత్వానికి లేదా గవర్నర్ పరిధిలో ఉంచాలనే యోచన వద్దు. భారతదేశంలో ఎవరికైనా, ఎక్కడైనా స్వేచ్ఛగా జీవించటానికి ప్రాథమిక హక్కులున్నాయి. సీమాంధ్రులతో సహా ఎవరికైనా రాజ్యాంగ రక్షణలు పటిష్టంగా ఉన్నాయి. ఇంకా ప్రత్యేకమైన రక్షణలు ఎవరికీ అవసరం లేదు. సీమాంధ్రుల్లో భయాలు, ఆందోళనలు ఉంటే వాటిపై చర్చకు పెట్టి, పరిష్కార మార్గాలను అన్వేషించుకుందాం. అంతకుమించి శాంతిభద్రతలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేకుండా చేస్తామంటే అంగీకరించే ప్రసక్తి లేదు. (ఈ నివేదికను రిటైర్డు అదనపు డీజీ నందన్ రూపొందించారు).
 
 ప్రాజెక్టుల వారీగా అప్పులు పంచాలి...
 రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న రూ. 1.70 లక్షల కోట్ల అప్పులను, ఆస్తులను నిర్దిష్టంగా విభజన చేయాలి. అప్పులను ప్రాజెక్టుల వారీగా పరిశీలించాలి. ఏ ప్రాజెక్టు కోసం అప్పు తెస్తే ఆ ప్రాజె క్టు ప్రాంతం ఉన్న రాష్ట్రానికే అప్పులను పంచాలి. జనాభా ప్రాతిపదికన అప్పులు పంచితే ఏదో ఒక ప్రాంతానికి నష్టం జరుగుతుంది. ప్రాజెక్టు కోసం చేసిన అప్పు  ఆ ప్రాజెక్టు ఉన్న రాష్ట్రానికే చెందాలి.
 
కేంద్ర ప్రభుత్వ గ్రిడ్‌ల నుంచి విద్యుత్ ఇవ్వాలి
తెలంగాణలో ఇప్పటికిప్పుడు సుమారు 2 వేల మెగావాట్ల విద్యుత్ కొరత ఉండే అవకాశముంది. ఈ కొరత వేసవిలో అయితే 5వేల మెగావాట్ల దాకా చేరుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం సొంత ప్రణాళికలు రూపొందించుకునే దాకా కేంద్ర ప్రభుత్వ గ్రిడ్‌ల నుండి విద్యుత్‌ను సరఫరా చేయాలి. దీనికి కేంద్రం ప్యాకేజీ ఇవ్వాలి. సింగరేణిని కోల్ ఇండియాలో విలీనం చేయాలనే యోచన, ప్రయత్నాలు విరమించాలి.
 
బచావత్, బ్రిజేష్ ప్రకారమే నీటి కేటాయింపులు
నీటి కేటాయింపులు..: నదీ జలాల పంపకానికి ఇప్పటికే బచావత్, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్స్ సూచనలు ఉన్నాయి. వాటి ప్రకారం ప్రాంతాల వారీగా కేటాయింపుల ప్రకారమే రెండు రాష్ట్రాలు నడుచుకోవాలి. చట్టబద్ధ నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల వారీగా పంపిణీ కోసం ప్రత్యేక కమిటీ లేదా వ్యవస్థను ఏర్పాటు చేసి వివాదాలను పరిష్కరించుకోవాలి.
 
ఆర్టికల్ 371(డి) ఉండాల్సిందే...
తెలంగాణ ప్రాంత ఉద్యోగుల రక్షణ కోసం 371 (డి) ఆర్టికల్ ఉండాల్సిందే. ఇది లేకుంటే తెలంగాణ ప్రాంతానికి ఇతర ప్రాంతాల వలసలు కొనసాగే ప్రమాదం ఉంది. జిల్లాల మధ్య కూడా అసమానతలు పెరిగి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. వీటికోసం రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగుల స్థానికతను బట్టి అవకాశాలుంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement