ఇంతటితో ఆగిపోం
మా మజిలీ ఇంకా ఉంటుంది.. కోదండరాం స్పష్టీకరణ
జేఏసీ నేతలకు హైదరాబాద్‌లో ఘనస్వాగతం
చీడ పురుగుల్ని ఏరిపారేస్తాం: శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఏర్పాటుతో తమ ప్రయాణం ఆగిపోలేదని, తమ మజిలీ ఇంకా ఉంటుందని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం వెల్లడించారు. ఆయనతో పాటు శ్రీనివాస్‌గౌడ్, దేవీప్రసాద్, విఠల్, అద్దంకి దయాకర్, కత్తి వెంకటస్వామి, రఘు, గడ్డం జ్ఞానేశ్వర్ తదితర జేఏసీ నేతలు శనివారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో పెద్ద సంఖ్యలో జేఏసీ కార్యకర్తలు, తెలంగాణవాదులు వారికి స్వాగతం పలికారు. అనంతరం నేతలు భారీ ర్యాలీగా అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం వరకు చేరుకొని నివాళులు అర్పించారు. సమాజాన్ని బంగారు నందనవనంగా మార్చేదాకా, అందరికీ న్యాయం జరిగేదాకా, తెలంగాణ పునర్నిర్మాణం పూర్తయ్యేదాకా తమ ప్రయాణం కొనసాగుతుందని ఈ సందర్భంగా కోదండరాం మీడియాతో అన్నారు. ‘‘మేమెంచుకున్న ప్రజాస్వామ్యీకరణలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక అడుగే. తెలంగాణ రాష్ట్రం మేం కోరుకుంటున్న తీరున అభివృద్ధి సాధించే దిశగా మా కార్యాచరణ ఉంటుంది. రాష్ట్ర సాధన కోసం మేం నిప్పుల మీద నడవాల్సి వచ్చింది. కత్తుల వంతెన దాటాల్సి వచ్చింది. ఎన్ని దాడులు జరిగినా ధైర్యంగా సాగాం గనుకే విజయం పొందగలిగాం’’ అన్నారు.
హైదరాబాద్‌లో ఉంటున్న సీమాంధ్ర ప్రజలు ఇప్పటికైనా తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించాలని శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికీ కోర్టులకు వెళ్లి తెలంగాణను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న సమైక్యాంధ్ర నేతలను కట్టడి చేయాలని సూచించారు. కొందరు నేతలు ఆ వైఖరి మార్చుకోకుంటే హైదరాబాద్‌లో ఉంటూ సమైక్యమంటున్న చీడ పురుగులను ఏరిపారేయాల్సి వస్తుందని హెచ్చరించారు. సీమాంధ్రకు చెందిన సామాన్య ప్రజలలో ఎవరిపై దాడులు జరిగినా వారికి తాము అండగా ఉంటామన్నారు.
అనంతరం కోదండరాం తదితరులు గన్‌పార్క్ నుంచి విద్యుత్ సౌధకు వచ్చి ప్రొఫెసర్ జయశంకర్ భారీ కటౌట్‌కు నివాళులర్పించారు. ఉద్యోగులతో పాటు కోదండరాం, దేవీప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, విఠల్, అద్దంకి దయాకర్ కూడా స్టెప్పులేశారు. రంగులు చల్లుకుని, టపాసులు కాలుస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. మరోవైపు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డిలకు కూడా శంషాబాద్ విమానాశ్రయం వద్ద పార్టీ అనుచరులు ఘనస్వాగతం పలికారు.