ఆదాయానికి సెగ
సాక్షి, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీ ఆదాయ వనరుల్లో ఆస్తిపన్ను అనంతరం అత్యంత కీలకమైనది టౌన్‌ప్లానింగ్. ఈ విభాగం ద్వారా గడచిన ఆర్థిక సంవత్సరం జీహెచ్ఎంసీకి రూ. 515 కోట్ల ఆదాయం లభించింది. అందులో దాదాపు రూ.360 కోట్లు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి అనుమతి పొందిన స్టిల్ట్ ప్లస్ ఐదంతస్తులకు మించిన భవన నిర్మాణ అనుమతుల ఫీజుల ద్వారా లభించినవే. మిగతావి సర్కిళ్లు, జోన్ల పరిధిలోనివి, బీపీఎస్ ఫీజులు, బెటర్మెంట్ ఫీజులు, ఇతరత్రా రూపాల్లో వచ్చినవి. దీన్ని ఆసరా చేసుకున్న టౌన్‌ప్లానింగ్ అధికారులు ఈ ఆర్థిక సంవత్సరం సైతం స్టిల్ట్ ప్లస్ ఫైవ్ అంతకుమించిన బహుళ అంతస్తుల భవనాల అనుమతుల ఫీజుల ద్వారా భారీ ఆదాయం రాగలదని అంచనా వేశారు.
కానీ.. తెలంగాణ రాష్ట్ర ప్రకటన నేపథ్యంలో ఇటీవలి కాలంలో దాదాపు గడచిన నెల రోజులుగా భవన నిర్మాణ అనుమతుల కోసం వస్తున్న దరఖాస్తుల సంఖ్య భారీగా తగ్గింది. కేంద్రం తెలంగాణ ప్రకటన చేయడం.. సమైక్యాంధ్ర కోసం సాగుతున్న ఉద్యమం.. తదితరమైన వాటి ప్రభావం జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. గతంలో.. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఐదో అంతస్తులో ఉన్న టౌన్‌ప్లానింగ్ విభాగం సాయంత్ర వేళల్లో కిటకిటలాడుతూ కనిపించేది. వచ్చిపోయే బిల్డర్లు, మధ్యవర్తులతో రద్దీగా కనిపించేది. ప్రస్తుతం ఆ హడావుడి తగ్గింది. భవననిర్మాణాలకు అనుమతులిచ్చేందుకు ప్రతి మంగళవారం జరిగే బిల్డింగ్ కమిటీ సమావేశానికి దాదాపు యాభై ఫైళ్లు వచ్చేవి. ఈ సంఖ్య వంద దాటిన సందర్భాలు సైతం ఉన్నాయి.
కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. వారం వారం జరగాల్సిన బిల్డింగ్కమిటీ సమావేశం గత 2 వారాలుగా వాయిదా పడుతూ వస్తున్నా.. మంగళవారం స్థానే గురువారం జరిగిన బిల్డింగ్ కమిటీ సమావేశంలో 2 వారాలకు 50 ఫైళ్లు కూడా అనుమతుల కోసం రాలేదు. తెలంగాణ ఏర్పాటు ప్రకటన నేపథ్యంలో.. బిల్డర్లు వెనుకంజ వేస్తున్నారని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు. గతంలో నెలకు సగటున 160 ఫైళ్లు బిల్డింగ్ కమిటీ సమావేశంలో అనుమతుల కోసం వచ్చేవని.. ఇప్పుడా సంఖ్య దాదాపు 105కు తగ్గిందని అడిషనల్ చీఫ్ సిటీప్లానర్ రాముడు ‘సాక్షి’కి తెలి పారు. తద్వారా గతంలో నెలకు సగటున జీహెచ్ఎంసీకి రూ. 30 కోట్ల మేర వీటి ఫీజుల రూపేణా రాగా, ఇప్పుడు సగటున దాదాపు రూ. 20 కోట్లు మేర మాత్రమే రాగలవని అంచనా.