Division High Court
-
కేంద్రంపై ఇద్దరు సీఎంలు ఒత్తిడితేవాలి
హైకోర్టు విభజనపై జస్టిస్ చంద్రకుమార్, హరగోపాల్ హైదరాబాద్: హైకోర్టు విభజన కోసం తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని జస్టిస్ చంద్రకుమార్, పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. న్యాయమూర్తులు రోడ్డెక్కారంటే రాష్ట్ర న్యాయవ్యవస్థ ఎలా ఉందో అర్ధం చేసుకోవాలని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తా అనడం సరైంది కాదని, ఇది ప్రజల దృష్టిని మళ్లిం చేందుకు ఆయన చేస్తున్న కుట్ర అని అన్నా రు. కేంద్రం సెక్షన్ 30ని సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో హైకోర్టు పెట్టుకునేంత వరకు కొనసాగుతామని ఆంధ్రా న్యాయవాదులు ప్రకటించాలన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ ఏపీ పునర్విభజనలో హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్లు చేశారని, అయితే ఎపీ సీఎం చంద్రబాబు తాను తెలంగాణలో ఉంటే వేరే దేశంలో ఉన్నట్టుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నారు. అమరావతిలో హైకోర్టు నిర్మించుకుని అక్కడి ప్రజలకు న్యాయవ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. న్యాయమూర్తుల, న్యాయవాదుల సమస్యలను ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ సమస్యగా పరిగణించవద్దని సూచించారు. పౌరహక్కుల అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీలు ఉన్నా తెలంగాణకు ఆప్షన్లు ఇవ్వడం పెద్ద కుట్ర అన్నారు. న్యాయంగా పోరాడుతున్న 12 న్యాయమూర్తులను సస్పెండ్ చేయడాన్ని పౌర హక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. -
హైకోర్టు విభజనతోనే తెలంగాణకు న్యాయం
- కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ కాజీపేట: ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విభజనతోనే తెలంగాణ ప్రజలు సార్వభౌమత్వాన్ని అనుభవించగలుగుతారని కేంద్ర సమాచార కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. కాజీపేట తారాగార్డెన్ కాళోజీ ప్రాంగాణంలోని ఆచార్య బియాల జనార్ధన్ హాల్లో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వేదికపై ఆదివారం తెలంగాణ వికాస సమితి ప్రథమ వార్షికోత్సం జరగింది. సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నో పోరాటాల ఫలితంగా దక్కిన రాష్ట్ర ఆవిర్భా ఉత్సవం కొంతమంది కారణంగా తెలంగాణ వాసులకు దక్కకుండా పోతుందన్నారు. రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ ప్రాంతానికి ఏదో నష్టం జరిగిపోతుందని సీమాంధ్ర పాలకులు చేసిన వ్యాఖ్యలు తప్పని ఏడాది టీఆర్ఎస్ పాలన నిరూపించిందని అన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రజల ఉద్యమ స్ఫూర్తికి నిదర్శనమని, హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం కాకుండా చూడడం తెలంగాణ వాదులకు నైతికవిజమని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగిన హైకోర్టు విభజన జరుపకపోవడంతో రెండు రాష్ట్రాల ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు వ్యక్తమవుతున్నాయని.. దీన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని కోరారు. హైకోర్టులు స్థానికంగా ఉండాలని ప్రజలు కోరుకోవడం ఒక హక్కు అని అన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ ఎన్నో ఉద్యమాల ఫలితంగా ఏర్పడిన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి సీఎం కేసిఆర్ చేస్తున్న కృషికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. జిల్లా పరిషత్ చెర్మైన్ గద్దెల పద్మ మాట్లాడుతు అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన నూతన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్య అందరిపై ఉందన్నారు. సభ అధ్యక్షుడు, వికాస సమితి రాష్ట్ర అధ్యక్షుడు దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ రెండు రాష్ట్రాలు భౌతికంగా విడిపోయాయే తప్ప మనుసులు ఎప్పటికి కలిసి ఉంటాయని అన్నారు. కవి, రచయిత నందిని సీదారెడ్డి మాట్లాడుతూ సీమాంధ్ర పాలకులు కుట్రలు, కుతంత్రాలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రముఖ కవి, ఒంగోలు జిల్లా వాసి డాక్టర్ కోయి కోటేశ్వర్రావు తెలంగాణ ఉద్యమం ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టిందని అన్నారు. కార్యక్రమంలో వికాస సమితి జిల్లా అధ్యక్షుడు జి.చంద్రశేఖర్, రాష్ట్ర టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, సమన్వయకర్త డాక్టర్ ఎ.శ్రీధర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్, డాక్టర్ బ్రహ్మం, ప్రొఫెసర్ వినయ్‌బాబు, పరాంకుషం, వేణుగోపాలస్వామి పాల్గొన్నారు. సమావేశంలో తెలంగాణ కవులు, కళాకారులు వేదికపై చేసిన ఆట, పాటలు సభికులను ఆకట్టుకున్నాయి. -
హైకోర్టును విభజించాల్సిందే
ముక్తకంఠంతో అఖిలపక్షం డిమాండ్ దీనిపై ప్రధాని, సీజేఐ తదితరులకు విజ్ఞప్తి చేయాలని తీర్మానం సాక్షి, హైదరాబాద్: హైకోర్టును వెంటనే విభజించాలని అన్ని రాజకీయ పార్టీలతో కూడిన అఖిలపక్షం ముక్తకంఠంతో డిమాండ్ చేసింది. తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం టీఎన్జీవో భవన్లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, సీపీఐ నేతలు పాల్గొన్నారు. ఇక నుంచి న్యాయవాదులు చేపట్టే ఆందోళనల్లో పాల్గొంటామని, హైకోర్టు విభజన జరిగే వరకూ కలసికట్టుగా ఉద్యమిస్తామన్నారు. విభజన జరిగే వరకూ న్యాయవ్యవస్థలో నియామకాలు చేపట్టరాదని డిమాండ్ చేశారు. హైకోర్టు విభజన కోసం ప్రధాని మోదీతోపాటు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ (సీజేఐ) హెచ్ఎల్.దత్తు, హైకోర్టు చీఫ్ జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా, గవర్నర్ నరసింహన్, ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబులను కలసి విజ్ఞప్తి చేయాలని అఖిలపక్షం తీర్మానించింది. ఈ సందర్భంగా టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ న్యాయవ్యవస్థ నియామకాల్లో తెలంగాణకు ఇప్పటికే తీవ్ర అన్యాయం జరిగిందని.. తెలంగాణ ఏర్పడ్డాక కూడా ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయకుండా న్యాయమూర్తుల నియామకాలు చేపడితే మరోసారి అన్యా యం జరుగుతుందన్నారు. హైకోర్టు విభజన కోసం ప్రజలు, ప్రజాసంఘాల నేతలు ఆందోళనల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు విభజన విషయంలో సీఎం కేసీఆర్ చొరవ తీసుకొని ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ కోరారు. అనంతరం బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ హైకోర్టు ఏర్పాటు విషయంలో గవర్నర్ నరసింహన్ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా, హైకోర్టు విభజన కోసం న్యాయవాదులు చేస్తున్న డిమాండ్‌కు తమ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని టీడీపీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి తెలిపారు. సమావేశంలో న్యాయవాదుల జేఏసీ చైర్మన్ ఎం.రాజేందర్‌రెడ్డి, జేఏసీ నేతలు గండ్ర మోహన్‌రావు, శ్రీరంగారావు, కొండారెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, సీపీఐ మాజీ ఎంపీ అజీజ్ పాషా, సీపీఎం నేత మల్లారెడ్డి, టీఎన్జీవోల సంఘం ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, న్యాయశాఖ ఉద్యోగుల సంఘం నేతలు రాజశేఖర్‌రెడ్డి, నాయక్ తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు విభజనతోనే సంపూర్ణ తెలంగాణ హైకోర్టు విభజనతోనే సంపూర్ణ తెలంగాణ సాధ్యమవుతుందని న్యాయశాఖ ఉద్యోగుల సంఘం జాతీయ కార్యదర్శి బి.లక్ష్మారెడ్డి అన్నారు. హైకోర్టు విభజన జరగకపోవడంతో న్యాయశాఖకు చెందిన వేలాది మంది ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని, నియామకాల్లోనూ అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు విభజనలో ఆలస్యం జరిగితే న్యాయశాఖ ఉద్యోగులు సమ్మెకు దిగేందుకు కూడా వెనుకాడరని స్పష్టం చేశారు.