కేంద్రంపై ఇద్దరు సీఎంలు ఒత్తిడితేవాలి
హైకోర్టు విభజనపై జస్టిస్ చంద్రకుమార్, హరగోపాల్
హైదరాబాద్: హైకోర్టు విభజన కోసం తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని జస్టిస్ చంద్రకుమార్, పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని హైదర్‌గూడ ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. న్యాయమూర్తులు రోడ్డెక్కారంటే రాష్ట్ర న్యాయవ్యవస్థ ఎలా ఉందో అర్ధం చేసుకోవాలని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తా అనడం సరైంది కాదని, ఇది ప్రజల దృష్టిని మళ్లిం చేందుకు ఆయన చేస్తున్న కుట్ర అని అన్నా రు. కేంద్రం సెక్షన్ 30ని సవరణ చేయాలని డిమాండ్ చేశారు.
ఏపీలో హైకోర్టు పెట్టుకునేంత వరకు కొనసాగుతామని ఆంధ్రా న్యాయవాదులు ప్రకటించాలన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ ఏపీ పునర్విభజనలో హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్లు చేశారని, అయితే ఎపీ సీఎం చంద్రబాబు తాను తెలంగాణలో ఉంటే వేరే దేశంలో ఉన్నట్టుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నారు. అమరావతిలో హైకోర్టు నిర్మించుకుని అక్కడి ప్రజలకు న్యాయవ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. న్యాయమూర్తుల, న్యాయవాదుల సమస్యలను ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ సమస్యగా పరిగణించవద్దని సూచించారు. పౌరహక్కుల అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీలు ఉన్నా తెలంగాణకు ఆప్షన్లు ఇవ్వడం పెద్ద కుట్ర అన్నారు. న్యాయంగా పోరాడుతున్న 12 న్యాయమూర్తులను సస్పెండ్ చేయడాన్ని పౌర హక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు.