అందులో నా పాత్ర లేదు
న్యూఢిల్లీ: ఢిల్లీ జల్ బోర్డు కాంట్రాక్ట్‌లలో తన ప్రమేయమేమీ లేదని ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ వ్యాఖ్యానించారు. డీజేబీ అధికారులు, సాంకేతిక నిపుణులు షరతులు, నిబంధనలతో టెండర్లకు రూపకల్పన చేశారని, అయితే ఆ సంస్థ చైర్మన్‌గా అందులో తన పాత్రేమీ లేదని అన్నారు. ప్లానింగ్ కమిషన్ మోడల్ డాక్యుమెంట్ల ఆధారంగానే డీజేబీ ఈ ప్రాజెక్టుల విషయంలో వ్యవహరించిందని గుర్తు చేశారు. అంతర్జాతీయంగా బిడ్డింగ్ నిర్వహించిన డీజేబీ ఈ-టెండరింగ్ విధానంలో పారదర్శకంగా వ్యవహరించిందన్నారు.నంగ్లోయి, మల్వియా నగర్, మెహ్రౌలీ ప్రాంతాలకు నిరంతర నీటి సరఫరాకు సంబంధించి యూరోపియన్ కంపెనీ చేపట్టిన ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యం ప్రాజెక్టుకు సంబంధించి మూడు వేర్వేరు ప్రాథమిక విచారణలను సీబీఐ చేపట్టడంపై ఆమె స్పందించారు.
ఈ ప్రాజెక్టుపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు సంబంధింత డాక్యుమెంట్లను సమర్పించాలని సీబీఐ కోరిందన్నారు. విచారణకు ఏ విషయాన్నైనా తీసుకునేముందు ఈ విధంగానే వ్యవహరిస్తుందని చెప్పారు. ఢిల్లీ జల్ బోర్డు అక్రమాలలో ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను కూడా విచారించాలని భారతీయ జనతా పార్టీ శుక్రవారం డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తామేమీ తప్పు చేయలేదని డీజేబీ తమపై వచ్చిన ఆరోపణలను ఖండించింది.కాగా, బిడ్డర్లకు లాభం కలిగించే విధంగా డీజేబీ వ్యవహరించిందని సీబీఐ ఆరోపించింది. మౌలికవసతుల మేజర్ ప్రైవేట్ కంపెనీ నుంచి కొనుగోలు చేసిన నీటి సరఫరా మీటర్ల నాణ్యత పరీక్షలో అక్రమాలు జరిగాయని మరో కేసును నమోదుచేసింది. ఈ కేసుల్లో గుర్తు తెలియని వ్యక్తులపై అభియోగాలు మోపింది.