DK Jain
-
విరాట్ కోహ్లికి సరికొత్త తలపోటు
న్యూఢిల్లీ:: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్(పరస్పర విరుద్ధ ప్రయోజనాలు) అంశం సరికొత్త తలపోటుగా మారింది. కోహ్లి ఒకేసారి రెండు వ్యాపార సంస్థల్లో కీలక స్థానాల్లో ఉన్నాడంటూ మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుడు సంజీవ్ గుప్తా ఫిర్యాదు చేశాడు. దీనిపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఎథిక్స్ అధికారి, అంబుడ్స్‌మన్ జస్టిన్ డీకే జైన్‌కు ఫిర్యాదు చేశాడు. ‘ బీసీసీఐలోని 38(4) నిబంధనను కోహ్లి అతిక్రమించాడు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధం. ఒక సమయంలో ఒక పోస్ట్‌లో ఉండాలనేది నిబంధనల్లో భాగం. దీన్ని కోహ్లి ఉల్లంఘించాడు’ అని ఫిర్యాదులో పేర్కొన్నాడు. (హార్దిక్-కృనాల్‌ల ‘తొలి’ ఇంటర్వ్యూ చూశారా?) దీనిపై డీకే జైన్ మాట్లాడుతూ.. ఒకేసారి రెండు పదవులు అనుభవిస్తూ బీసీసీఐ నిబంధనను కోహ్లి అతిక్రమించినట్లు ఫిర్యాదు అందింది. దీనిపై విచారించిన తర్వాత విరాట్‌కు పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కల్గి ఉంటే నోటీసులిస్తామని అన్నారు. లోధా కమిటీ సంస్కరణల్లో భాగంగా ప్రస్తుత ఆటగాళ్లు, సెలెక్టర్లు, కామెంటేటర్లు, ఆఫీస్ బేరర్లు, మ్యాచ్ అధికారులు ఏకకాలంలో రెండు పదవుల్లో కొనసాగడానికి వీల్లేకుండా గతంలోనే బీసీసీఐ రాజ్యాంగ సవరణ చేసింది. కాగా, కోహ్లి స్పోర్ట్స్, కార్నర్‌స్టోన్ వెంచర్ పార్ట్‌నర్స్‌లలో కో-డైరెక్టర్‌గా ఉండడంతో పాటు కార్నర్‌స్టోన్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిడెడ్‌లో డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నాడని గుప్తా ఫిర్యాదు చేశాడు. ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటూ అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరాడు. అయితే మరి కోహ్లి నిజంగానే రెండింటిలోనూ కీలక పదవుల్లో ఉన్నాడా.. లేదా అనే అంశాన్ని డీకే జైన్ నేతృత్వంలోని కమిటీ పరిశీలించనుంది. ఒకవేళ ఇది రుజువైతే కోహ్లిపై చర్యలు తప్పవు. (‘ఐపీఎల్‌తో పెద్దగా ఒరిగిందేమీ లేదు’) -
ద్రవిడ్ వీడని కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్!
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌ను కాన్ఫ్టిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్(పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం) సెగ వీడటం లేదు. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి బీసీసీఐ అంబుడ్స్‌మన్ ఎథిక్స్ ఆఫీసర్ రిటైర్డ్ జస్టిస్ డీకే జైన్ ముందు హాజరైన ద్రవిడ్.. మరోసారి హాజరు కావాలంటూ తాజాగా నోటీసులు అందాయి. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) డైరక్టర్‌గా ఉన్న ద్రవిడ్.. గత నెల 26వ తేదీన పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంపై డీకే జైన్ ముందు హాజరయ్యారు. ద్రవిడ్ పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం కిందకు వస్తాడంటూ మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుడు సంజీవ్ గుప్తా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన డీకే జైన్.. ద్రవిడ్ అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఐపీఎల్ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన ఇండియా సిమెంట్స్ వైఎస్ ప్రెసిడెంట్‌గా ద్రవిడ్ ఉండటమే సంజీవ్ గుప్తా ఫిర్యాదుకు కారణం. కాగా, తాను ఇండియా సిమెంట్స్‌ను విరామం తీసుకున్నానని ద్రవిడ్ స్పష్టం చేసినప్పటికీ డీకే జైన్ మాత్రం మళ్లీ హాజరు కావాలంటూ నోటీసులు అందజేశారు. దాంతో నవంబర్ 12వ తేదీన మరొకసారి జైన్ ముందు ద్రవిడ్ హాజరు కానున్నాడు. ఇదిలా ఉంచితే, పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశాన్ని ఇటీవల బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సౌరవ్ గంగూలీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ‘ఎన్సీఏ డైరెక్టర్ పదవో, మరేదైన క్రికెట్ జాబ్‌లేవీ శాశ్వతమైన ఉద్యోగాలు కావు. దీనికి ఓ శాస్త్రీయ పరిష్కారాన్ని కనుగొనాలి. టీవీ వ్యాఖ్యానం, కోచింగ్ ఎలా పరస్పర విరుద్ధ ప్రయోజనాలవుతాయో నాకైతే అర్థం కావట్లేదు’ అంటూ గంగూలీ వ్యతిరేకించారు. ఇప్పుడు అధ్యక్ష హోదాలో గంగూలీ ఆ అంశాన్ని ఎలా డీల్ చేస్తోడో చూడాలి. -
ఎథిక్స్ అధికారి ఎదుట హాజరైన ద్రవిడ్
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెపె్టన్ రాహుల్ ద్రవిడ్ గురువారం బీసీసీఐ ఎథిక్స్ అధికారి జస్టిస్ డీకే జైన్ ఎదుట హాజరయ్యాడు. ద్రవిడ్ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్‌గా, ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యంలోని ఇండియా సిమెంట్స్ సంస్థ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశమై వివరణ ఇచ్చేందుకు జస్టిస్ జైన్ ముందుకు వచ్చాడు. విచారణ సందర్భంగా అతడిని ఇండియా సిమెంట్స్ పదవి నుంచి తప్పుకోమని కోరే వీలున్నట్లు ముందుగా భావించారు. అయితే, దీనికి ముందే ఓ వ్యక్తి ఒక సంస్థ ఉద్యోగానికి సెలవు పెట్టి మరో పదవిని చేపట్టడం విరుద్ధ ప్రయోజనాల పరిధిలోకి రాదని పేర్కొంటూ ఎథిక్స్ అధికారికి క్రికెట్ పాలకుల కమిటీ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ నోట్ పంపారు. -
నేడు ఎథిక్స్ ఆఫీసర్ ముందుకు ద్రవిడ్
ముంబై: ‘పరస్పర విరుద్ధ ప్రయోజనాల’ అంశంపై భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ గురువారం బోర్డు ఎథిక్స్ ఆఫీసర్ డీకే జైన్ ముందు హాజరుకానున్నాడు. ద్రవిడ్‌ను ఇటీవల జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్‌గా నియమించారు. అంతకుముందే చెన్నై సూపర్ కింగ్స్ యాజమన్యంలోని ఇండియా సిమెంట్స్ సంస్థలో అతడు ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. ఇది పరస్పర విరుద్ధ ప్రయోజనాల పరిధిలోకి వస్తుందని మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం సభ్యుడు సంజీవ్ గుప్తా ఎథిక్స్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఉన్నతాధికారుల సూచన మేరకు ద్రవిడ్ ఇండియా సిమెంట్స్ ఉద్యోగానికి దీర్ఘకాలిక సెలవు పెట్టాడు. దీంతో దిగ్గజ బ్యాట్స్‌మన్ ఎన్సీఏ డైరెక్టర్ పదవికే పరిమితమైనట్లు గురువారం వాదన వినిపించనున్నాడు. అనంతరం డీకే జైన్ తుది నిర్ణయాన్ని వెలువరిస్తారు. -
శ్రీశాంత్‌పై నిషేధం కుదింపు
న్యూఢిల్లీ: వివాదాస్పద పేసర్ శంతకుమరన్ శ్రీశాంత్‌కు ఊరట. ఈ కేరళ క్రికెటర్‌పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) గతంలో విధించిన జీవితకాల నిషేధాన్ని ఏడేళ్లకు తగ్గిస్తూ బోర్డు అంబుడ్స్‌మన్ డీకే జైన్ ఆదేశాలిచ్చారు. 2013 ఐపీఎల్ సందర్భంగా రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగాలపై శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్లపై బోర్డు క్రమశిక్షణ కమిటీ జీవిత కాలం నిషేధం విధించింది. అయితే, ఈ ఏడాది మార్చి 15న సుప్రీంకోర్టు దానిని పక్కన పెట్టింది. ఈ కేసు గత ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు బెంచ్ ముందుకు వెళ్లింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన బెంచ్... మూడు నెలల్లో డీకే జైన్ సమీక్ష చేపడతారని పేర్కొంది. తాజాగా ఆగస్టు 7న జారీ చేసిన ఆదేశాల్లో జైన్... శ్రీశాంత్‌పై నిషేధాన్ని ఏడేళ్లకు పరిమితం చేశారు. వచ్చే ఏడాది ఆగస్టుతో ఆ వ్యవధి ముగియనుంది. శ్రీశాంత్ 36 ఏళ్ల వయసుకు రావడం, అది ఒక పేసర్ కెరీర్ ముగింపు దశ కావడమే తన నిర్ణయానికి కారణమని ఉత్తర్వుల్లో జైన్ పేర్కొన్నారు. స్పాట్ ఫిక్సింగ్‌ను ప్రోత్సహించిన రీత్యా శ్రీశాంత్‌పై విధించిన నిషేధాన్ని బోర్డు గతంలో కోర్టు ఎదుట గట్టిగా సమర్థించుకుంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తన రెండో ఓవర్లో 14 పరుగులు ఇచ్చేలా శ్రీశాంత్ ఫిక్సింగ్‌కు ఒప్పుకొన్నాడని, రూ.10 లక్షలు కూడా తీసుకున్నాడని బోర్డు న్యాయవాది పరాగ్ త్రిపాఠి కోర్టుకు టెలిఫోన్ సంభాషణల రికార్డును అందజేశారు. అయితే, ఇందుకు బలమైన ఆధారాలేమీ లేవంటూ క్రికెటర్ తరఫు న్యాయవాది ఖండించారు. శ్రీశాంత్ భారత్‌కు 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టి20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. 2007 టి20, 2011 వన్డే ప్రపంచ కప్‌లు గెలిచిన జట్టులో అతడు సభ్యుడు. -
శ్రీశాంత్‌కు భారీ ఊరట
న్యూఢిల్లీ: స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని తగ్గించాలని సుదీర్ఘ పోరాటం చేస్తున్న భారత పేసర్ శ్రీశాంత్‌కు భారీ ఊరట లభించింది. అతనిపై ఉన్న జీవిత కాల నిషేధాన్ని ఏడేళ్లకు కుదిస్తూ బీసీసీఐ అంబుడ్స్‌మన్ డీకే జైన్ నిర్ణయం తీసుకున్నారు. ఆరేళ్లుగా నిషేధం ఎదుర్కొంటున్న శ్రీశాంత్ ప్రవర్తన బాగుందని భావించిన అంబుడ్స్‌మన్ అతనిపై ఉన్న జీవిత కాల నిషేధాన్ని రద్దు చేశారు. ఈ క్రమంలోనే ఏడేళ్ల నిషేధం సరిపోతుందని స్పష్టం చేశారు. ఫలితంగా వచ్చే ఏడాది ఆగస్టు నెలకు శ్రీశాంత్‌పై ఉన్న నిషేధం తొలగిపోనుంది. ‘నిషేధ కాలంలో శ్రీశాంత్ ఎటువంటి క్రికెట్ పరమైన కార్యక్రమాల్లో పాల్గొనలేదు. దాంతో పాటు బీసీసీఐ యాక్టివిటీలకు కూడా దూరంగా ఉన్నాడు. దాంతో అతనిపై నిషేధాన్ని ఏడేళ్లకు పరిమితం చేశాం. ఇది 2013 సెప్టెంబర్ట్ 13వ తేదీ నుంచి వర్తిస్తుంది’ అని డీకే జైన్ తెలిపారు. ప్రస్తుతం 36వ ఒడిలో ఉన్న శ్రీశాంత్ తనపై అన్యాయంగా ఫిక్సింగ్ ఆరోపణలు మోపి ఇరికించారని పోరాడుతూనే ఉన్నాడు. దీనిపై పలుమార్లు సుప్రీంకోర్టుకు వెళ్లి తనపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరాడు. దానిలో భాగంగానే శ్రీశాంత్‌కు శిక్ష తగ్గించే విషయంపై ఆలోచించాలని బీసీసీఐకి సూచించిన సుప్రీం కోర్టు ఆ అధికారాన్ని అంబుడ్స్‌మన్‌కు అప్పగించింది. ఎట్టకేలకు తనపై ఉన్న నిషేధం తగ్గడంతో శ్రీశాంత్‌కు భారీ ఊరట లభించినట్లయ్యింది. 2013 ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవిత కాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే.