ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్‌కు ప్రతిష్టాత్మక గుర్తింపు
హైదరాబాద్: ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ మరోసారి బెస్ట్ పెర్ఫార్మెన్స్ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఈ పురస్కార ప్రదానం జరిగింది. రాజమండ్రి అసెట్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్- అసెట్ మేనేజర్ పాసల కృష్ణారావుకు సంస్థ సీఎండీ డీకే షరాఫ్ ట్రోఫీని, ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
2011-12లో ఈ అవార్డును నెలకొల్పారు. ఆ సంవత్సరమే రాజమండ్రి అసెట్ దీన్ని దక్కించుకుంది. 2012-13లో రన్నరప్‌గా నిలిచింది. తాజాగా 2013-14 ఏడాదికి గాను తిరిగి అవార్డు అందుకుంది. అధిక ఒత్తిడి, ఉష్ణోగ్రత తదితర ప్రతికూల పరిస్థితుల్లో సైతం కంపెనీ గణనీయమైన స్థాయిలో ఆయిల్, గ్యాస్, విలువ ఆధారిత ప్రోడక్టుల ఉత్పత్తి సాధించింది.