మాతాశిశు మరణాలు తగ్గించేందుకు చర్యలు
– చాపిరేవుల పీహెచ్సీని తనిఖీ చేసిన డీఎం అండ్హెచ్ఓ
– పీహెచ్సీ వైద్యుడు నటరాజ్పై ఆగ్రహం
నంద్యాలరూరల్: జిల్లాలో మాతాశిశు మరణాలు తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని డీఎం అండ్ హెచ్ఓ ఎం.స్వరాజ్యలక్ష్మి చెప్పారు. శుక్రవారం మండల పరిధిలోని చాపిరేవుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీలకు నిధుల కొరత, మందుల కొరత లేదని, కొందరు వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే పేద రోగులకు వైద్యం అందడం లేదన్నారు. చాపిరేవుల పీహెచ్సీ అపరిశుభంగా ఉండటంతో వైద్యుడు నటరాజ్పై డీఎంఅండ్ హెచ్ఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే పేద రోగులకు ఎలా వైద్యం అందిస్తారని, పద్ధతి మార్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. మూడు నెలలకు ఒకసారి పీహెచ్సీ సలహా కమిటీ సమావేశం ఏర్పాటు చేసి తక్షణమే తాత్కాలిక మరమ్మతులు చేపట్టి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు విధులు నిర్వహించలేరా అంటూ వైద్యుడిని నిలదీశారు. ఓపీ లేకపోవడాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎంపీహెచ్ఈఓ జయశంక్రెడ్డి నాలుగు రోజులుగా విధులకు హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వేతనాన్ని నిలుపుదల చేస్తున్నట్లు చెప్పారు. ఇక నుంచి హాజరును రోజువారీగా బయోమెట్రిక్ ద్వారా జిల్లా కేంద్రానికి అందించాలని ఆదేశించారు. మళ్లీ రెండు వారాల్లో తనిఖీ వస్తానని ఆలోగా ఆసుపత్రిలో మార్పు కనిపించకపోతే ఇంటికి పంపుతానని డాక్టర్ను డీఎంహెచ్ఓ హెచ్చరించారు.