బీజేపీకి కెప్టెన్ రాంరాం
* కమలనాథుల కూటమితో కటీఫ్
* డీఎంకే దిశగా అడుగులు
చెన్నై, సాక్షి ప్రతినిధి : డీఎండీకే అధినేత కెప్టెన్ విజయకాంత్‌కు కోపమొచ్చింది. సీఎం అభ్యర్థిగా రంగంలోకి దిగాలన్న తన ఆశలపై కమలనాథులు నీళ్లు చల్లడమే ఈ కోపానికి కారణం. బీజేపీ కూటమికి గుడ్‌బై చెప్పేయాలని నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీవర్గాల సమాచారం. భారతీయ జనతాపార్టీ దేశంలో ఒక మహాశక్తిగా అవతరించిన విషయం తెల్సిందే. కాంగ్రెస్ పార్టీని కాలగర్భంలో కలిపడమే ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాల తదుపరి లక్ష్యంగా ఉంది. ఉత్తరాదిలో మంచి ఊపుమీదున్న బీజేపీ దక్షిణాదిలో సైతం దూసుకుపోయేందుకు పావులు కదుపుతోంది.
ఇందులో భాగంగా తమిళనాడుపై కూడా దృష్టి సారించింది. పార్లమెంటు ఎన్నికల సమయంలో ప్రాంతీయ పార్టీలతో జతకట్టిన బీజేపీ కూటమికి ఇప్పుడు బీటలు వారుతున్నారుు. సీఎం అభ్యర్థిగా తన పేరును ప్రకటిస్తేనే కూటమిలో కొనసాగుతానని కెప్టెన్ అల్లిమేటం ఇచ్చారు. అయితే బీజేపీ ఎంతమాత్రం స్పందించలేదు. దీనిని నివారించేందుకు అమిత్‌షా ఇటీవలే తమిళగడ్డపై తొలిసారిగా అడుగుపెట్టారు. రెండురోజుల పాటు చెన్నైలో తిష్టవేసి రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారు.
2016 ఎన్నికల్లో జార్జికోటపై బీజేపీ జెండా ఎగురవేయడమే ఏకైక అజెండాగా పనిచేయాలని నూరిపోశారు. అయితే కూటమిలోని ప్రాంతీయ పార్టీల్లో బీజేపీపై అనేక ఆశలు ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో సీఎం అభ్యర్థి తానేనని, కూటమి నాయకత్వం తనదేనని ఎవరికి వారు ఆశలు పెట్టుకున్నారు. వీటన్నింటినీ లెక్కపెట్టని కమలనాతులు కేంద్రమంత్రి, తమిళనాడు ఆడపడుచు నిర్మలాసీతారామన్‌ను రంగంలోకి దించే ప్రయత్నాలు ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం అభ్యర్థినిగా ప్రకటిస్తామని అమిత్‌షా చెన్నైలో చెప్పారు.
ఈ నిర్ణయమే కెప్టెన్‌కు చిర్రెత్తుకొచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి పోటీచేసి డీఎంకేను సైతం వెనకకు నెట్టేసిన తనకు సీఎం అభ్యర్థిత్వాన్ని కట్టబెట్టకుండా కొత్త వ్యక్తిని తీసుకురావడం ఏమిటని ఆయన ఆగ్రహంతో ఊగిపోతున్నారు. చెన్నైకి వచ్చిన అమిత్‌షాను కలవకుండా విజయకాంత్ ముఖం చాటేశారు. రాష్ట్రంలో బీజేపీ కంటే తమకు బలం ఉన్నందున తమ నేతను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని కెప్టెన్ అనుచురుడు పేర్కొన్నాడు. గురువారం జరిగిన క్రిస్మస్ ప్రార్థనా కూటమిలో విజయకాంత్‌కు డీఎంకే నుంచి పరోక్షంగా ఆహ్వానం అందడంతో, కమలనాథుల కూటమి నుంచి వైదొలగడం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది.