డీఎంకే ఎమ్మెల్యేకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
స్పీకర్ ధనపాల్తో తీవ్ర వాగ్వాదం సందర్భంగా డీఎంకేకు చెందిన అత్యంత సీనియర్ ఎమ్మెల్యే దొరై మురుగన్ అస్వస్థత పాలయ్యారు. ఆయనను వెంటనే అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. దాదాపు 30 ఏళ్లుగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చిన దొరై మురుగన్ వయసులో కూడా చాలా పెద్దవారు. ఆయన స్పీకర్ తీరు మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి గట్టిగా మాట్లాడారు. ఆ సమయంలోనే ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. వెంటనే మార్షల్స్ ఆయనను బయటకు తీసుకొచ్చారు.
అప్పటికే సిద్ధంగా ఉన్న అంబులెన్సులో వైద్యులు ఆయనకు ప్రాథమిక చికిత్స చేసి, వెంటనే అక్కడినుంచి ఆస్పత్రికి కూడా తరలించారు. అసెంబ్లీలో బల నిరూపణకు గవర్నర్ ఎటూ 15 రోజుల గడువు ఇవ్వడం, తమ సభ్యుడు ఇప్పుడు ఆస్పత్రిలో ఉండటం తదితర కారణాలతో ఓటింగును, సభను కూడా వాయిదా వేయాలని డీఎంకే సభ్యులు పట్టుబడుతున్నారు. అయితే దీనిపై స్పీకర్ ధనపాల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది.