చైనా సరిహద్దులో మౌలిక వసతులు: ఆర్మీ
న్యూఢిల్లీ/బీజింగ్: చైనాతో డోక్లామ్ ఉద్రిక్తత నేపథ్యంలో భారత ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది.అత్యవసర సమయాల్లో భద్రతా బలగాలను సరిహద్దుకు వేగంగా తరలించేందుకు వీలుగా రోడ్లు, ఇతర మౌలిక వసతుల్ని మెరుగుపర్చాలని తమ ఇంజినీరింగ్ విభాగం కోర్ ఆఫ్ ఇంజినీర్స్ (సీవోఈ)ను ఆదేశించింది. ఆర్మీ సూచనల మేరకు మౌలిక వసతుల మెరుగుదలకు కొండల్ని ధ్వంసం చేసే యంత్రాలు, పరికరాలతో పాటు బలగాలను యుద్ధ రంగానికి వేగంగా తరలించేందుకు అవసరమైన ట్రాకుల కోసం సీవోఈ ఆర్డర్లు ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కోర్ ఆఫ్ ఇంజినీర్స్ మందుపాతరలను గుర్తించే సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఆర్మీ ప్రధాన కార్యాలయం ఇప్పటికే 1,000 డ్యూయెల్ ట్రాక్ మైన్ డిటెక్టర్ల కోసం ఆర్డర్ ఇచ్చిందని వెల్లడించాయి.
డ్యామ్‌లు నిర్మించడం లేదు: చైనా
టిబెట్‌లోని యార్లుంగ్ జాంగ్పో (బ్రహ్మపుత్ర) నదిపై జల విద్యుత్ కోసం ఎలాంటి డ్యామ్‌లు నిర్మించట్లేదని చైనా అధికారిక వార్తాసంస్థ గ్లోబల్ టైమ్స్ చెప్పింది. టిబెట్ లో చైనా ప్రావిన్స్‌లకు సమీపంలోని నదులపైనే ప్రాజెక్టులను చేపట్టామంది.