ఏసీబీ వలలో ప్రభుత్వ వైద్యుడు
రిటైర్డ్ మహిళా ఉద్యోగి నుంచి రూ.7 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన రవిచంద్
మధిర : రిటైర్డ్ ఉద్యోగి నుంచి లంచం తీసుకుంటూ ఓ ప్రభుత్వ వైద్యుడు అవినీతి నిరోధకశాఖ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ ఘటన మధిర మండల పరిధిలోని మాటూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని మాటూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న నాగమణి గత ఏప్రిల్ నెలలో పదవీవిరమణ పొందారు. ఉద్యోగ సమయంలో ప్రభుత్వం నుంచి తనకు రావాల్సిన బకాయిల కోసం ఫైళ్లపై మండల వైద్యాధికారి మూడ్ రవిచంద్‌ను సంతకాలు పెట్టమని కోరారు. ఆయన 5 నెలలుగా సంతకాలు చేయకుండా తిప్పుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. రెండు రోజుల కిందట ఆయన సంతకం చేయగా మరికొన్ని ఫైళ్లకు సంబంధించి సంతకాలు చేయాల్సి రావడంతో రవిచంద్ డబ్బులు డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో నాగమణి డాక్టర్ రవిచంద్‌కు రూ.7 వేలు ఇచ్చేందుకు అంగీకారం కుదుర్చుకుని, ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. మంగళవారం మాటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రవిచంద్‌కు డబ్బులు ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. దాడిలో ఏసీబీ డీఎస్పీ సాయిబాబా, సీఐలు రమణమూర్తి, పద్మ, వెంకటేశ్వర్లు, రాఘవేంద్రరావు ఉన్నారు.