ఉమ్మడి సదస్సును విజయవంతం చేయాలి
భానుపురి, న్యూస్‌లైన్: జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సెప్టెంబర్ 1వ తేదీన సరిహద్దులు తాత్కాలికం..ఆత్మీయతలు శాశ్వతం అనే నినాదంతో మూడు ప్రాంతాల ఉద్యమనేతలతో నిర్వహించే ఉమ్మడి సదస్సును జయప్రదం చేయాలని జనచైతన్య వేదిక అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పశ్య ఇంద్రసేనారెడ్డి, బద్దం అశోక్‌రెడ్డిలు కోరారు. బుధవారం పట్టణంలోని డాక్టర్ ఎ.రామయ్య నివాసంలో సదస్సు కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వెల్లువెత్తిన ప్రజా ఉద్యమాలను.. ప్రజల అసంతృప్తిని అర్థం చేసుకొని ప్రజల మధ్యన ఐక్యతను సాధించడం కోసం జనచైతన్య వేదిక పాటుపడుతుందన్నారు. అం దుకోసం మూడు ప్రాంతాలకు చెం దిన ఉద్యమ నేతలతో ఉమ్మడి చర్చావేదికను నిర్వహించి ఆయా ప్రాం తాల ప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికి మార్గాలు కనుగొని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసేం దుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
ఈ సదస్సుకు తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, రిటైర్డ్ కేంద్ర జలవనరుల సంఘం సభ్యులు ఆర్.విద్యాసాగర్‌రావు, జై ఆంధ్ర ఉద్యమ నాయకులు వసంతనాగేశ్వరరావు, బహుజన ఆంధ్ర జేఏసీ కన్వీనర్ పల్నాటి శ్రీరాములు, రాయలసీమ జేఏసీ అధ్యక్షుడు ఎంవీ రమణారెడ్డి, రాయల సీమ అధ్యయనాల వేదిక అధ్యక్షుడు డాక్టర్ భూమన్లు హాజరవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జనచైతన్యవేదిక సభ్యులు డాక్టర్ ఎ.రామయ్య, కుంట్ల ధర్మార్జున్, పెద్దిరెడ్డి గణేష్, డాక్టర్ సంపత్‌కుమార్, చింతలపాటి చినశ్రీరాములు, దామెర శ్రీనివాస్, పుప్పాల రవికుమార్, హనుమంతరావు, మంచాల రంగయ్య పాల్గొన్నారు.