కాయ్.. రాజా.. కాయ్..
విజయనగరం క్రైం: పట్టణానికి చెందిన ఓ వైద్యుడు క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడి సుమారు కోటి రూపాయల వరకు నష్టపోవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. చివరకు వైద్యుడి తండ్రి కూడా వైద్యుడు కావడంతో కొడుకు చేసిన అప్పులను తీర్చినట్లు తెలిసింది. అలాగే పట్టణానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడి సుమారు లక్ష రూపాయల వరకు నష్టపోవడంతో తల్లిదండ్రులకు తెలియకుండా రూ.70వేలవరకు అప్పులుచేసి పెద్దలద్వారా సమస్యను పరిష్కరించుకున్నట్లు సమాచారం. ఇవి కొంతవరకు తెలిసిన ఉదాహరణలు మాత్రమే. వీరిద్దరే కాకుండా జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ బాధితులు వేలల్లో ఉన్నట్టు తెలుస్తోంది.
హైదరాబాద్,విశాఖపట్నం ప్రధాన కేంద్రాలుగా జిల్లాకు ఒక బెట్టింగ్ ముఠా ఏర్పడినట్లు తెలుస్తోంది. ఆ ముఠా నియోజకవర్గకేంద్రంలో ఏజెంట్లద్వారా బెట్టింగ్‌లు జరుపుతున్నట్లు సమాచారం. ముందుగా ముఠా సభ్యులు వారిలో వారే డమ్మీ బెట్టింగ్‌లు నిర్వహించి, వేలల్లో డబ్బులు వచ్చినట్టు నటిస్తున్నారు. వారిని చూసి అమాకులు క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు సమాచారం. జిల్లా కేంద్రంతోపాటు నియోజవర్గకేంద్రాల్లో క్రికెట్ బెట్టింగ్‌లకు ప్రధానంగా లాడ్జిలు, హోటళ్లు,అపార్ట్మెంట్లను వేదికగా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంత జరుగుతున్నా పోలీసులు ఇంతవరకూ వీటిపై దృష్టి సారించలేదు.
నష్టపోయేది సామాన్యులే
ఏజెంట్ల ద్వారా క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న వారు ఏజెంట్లకు కొంత కమీషన్ కేటాయిస్తారని సమాచారం. దీంతో ఓడినా...గెలిచినా అమాయకులే ఎక్కువగా నష్టపోతున్నారు. క్రికెట్ బెట్టింగ్ ఏజెంట్లు వారికి రావాల్సిన కమీషన్‌ను ముందుగానే తీసుకుంటారని, అదీ కాకుండా వారికి అధికార పార్టీకి చెందిన రాజకీయ నాయకుల అండ ఉండడంతో యథేచ్ఛగా బెట్టింగ్‌లు కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇటీవల గజపతినగరంలో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడిన సభ్యులనుఅరెస్ట్‌చేసిన సమయంలో టీడీపీ నాయకులు పోలీసులపై ఒత్తిడి తెచ్చి కొందరిని తప్పించినట్లు సమాచారం.
తస్మాస్ జాగ్రత్త..
డిసెంబర్ 7నుంచి 50రోజులపాటు ప్రపంచ జట్లతో బిగ్‌బాస్ ట్వంటీ,ట్వంటీ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈనేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్‌ల ముఠా మరింత రెచ్చిపోయే ఆస్కారం ఉంది. ఇప్పటికే జిల్లా కేంద్రంతోపాటు నియోజకవర్గ కేంద్రాల్లో బెట్టింగ్‌లకు పాల్పడే ముఠా మండలాలకూ పాకే అవకాశం ఉంది. జిల్లా పోలీసు యంత్రాంగం క్రికెట్ బెట్టింగ్‌లపై ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి వాటిని నివారించాలని ప్రజలు కోరుతున్నారు. లేదంటే మరింత మంది తమ పిల్లలు నష్టపోయి తాము రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో బయటపడిన కొన్ని సంఘటనలు..
పార్వతీపురం పట్టణంలోని లాడ్జిల్లో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకోగా,అందులో కొందరిని విచారించి 150మందికి పైగా అరెస్ట్‌చేశారు విజయనగరం మండలం జమ్ము ప్రాంతంలో ఓ ఇంట్లో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఏడుగురిని పట్టుకుని రూ.రెండు లక్షల యాబైవేలు, రెండుకార్లు,రెండు బై కులు, 14సెల్ఫోన్లను రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈనెల 14న గజపతినగరం మండల కేంద్రంలో క్రికెట్‌బెట్టింగ్‌లకు పాల్పడుతున్న నలుగురిని అరెస్ట్‌చేసి వారివద్దనున్న రూ.10,500, డైరీ, టీవీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మాకు సమాచారం లేదు
జిల్లాలోక్రికెట్ బెట్టింగ్‌ల ముఠా ఉన్నట్లు సమాచారం లేదు. క్రైంపార్టీ సిబ్బంది, పోలీసులు నిరంతరం తనిఖీలు చేస్తున్నారు. సమాచారం ఉంటే ఇవ్వండి దాడులు చేసి పట్టుకుంటాం.
ఎస్.శ్రీనివాస్, విజయనగరం డీఎస్పీ