వైద్యుల రిటైర్మెంట్పై ఏం చేద్దాం?
ఉద్యోగ విరమణ వయసు పెంపుపై తర్జనభర్జన
కేంద్ర విన్నపంపై తెలంగాణలో ఎటూతేలని వ్యవహారం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైద్యుల ఉద్యోగ విరమణ వయసు పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ఎటూ నిర్ణయం తీసుకోలేకపోతోంది. ఇప్పటికే అనేక రాష్ట్రాలు వైద్యుల విరమణ వయసును పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వ వైద్యులు కూడా అదే డిమాండ్‌ను ముందుకు తెస్తున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసి యేట్ ప్రొఫెసర్లు సహా ఇతర వైద్య అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయసును 70 ఏళ్ల వరకు పెంచాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించింది. వైద్య విద్యకు సంబంధించి వివిధ అంశాలపై కేంద్రం ఇటీవల కాలంలో ప్రతిపాద నలు తయారు చేసింది.
వాటిపై అభిప్రాయాలు కోరుతూ రాష్ట్రాలకు ఇప్పటికే లేఖ రాసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్యులు, మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల విరమణ వయసు కేవలం 58 ఏళ్లు మాత్రమే ఉంది. నిమ్స్‌లో 60 ఏళ్లుంది. కొన్ని రాష్ట్రాల్లో ఇది 62 ఏళ్లు కూడా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో విరమణ వయసు 70 ఏళ్లు ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వ వైద్య అధ్యాపకుల విరమణ వయసు 58 ఉండటంపై వైద్య వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
వైద్యులు, అధ్యాపకుల కొరత...
రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 300 వరకు ప్రొఫెసర్, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అంచనా. అలాగే ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో దాదాపు వందల్లో ఖాళీలున్నాయి. ఇటీవల బోధనాసుపత్రుల్లో కొందరికి పదోన్నతులు ఇచ్చినా ఖాళీల భర్తీ మాత్రం జరగలేదు. ప్రభుత్వం ఖాళీల భర్తీపై నిర్ణయం తీసుకున్నా కూడా భర్తీలో ఆలస్యం జరుగుతోంది. దీంతో వైద్యుల కొరత వేధిస్తోంది.
62 ఏళ్లకు పెంచాలని కోరిన ఐఎంఏ...
రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల ఉద్యోగ విరమణ వయసును 58 నుంచి 62 ఏళ్లకు పెంచాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఇప్పటికే తెలంగాణ సర్కారుకు విన్నవించింది. విరమణ వయసు పెంచడం వల్ల అనేక మంది యువ డాక్టర్లు ప్రభుత్వ సర్వీసులోకి రావడానికి ఆసక్తి కనబర్చుతారని ఐఎంఏ వివరించింది. కానీ ప్రభుత్వం మాత్రం విరమణ వయసు పెంచడానికి వెనుకా ముందు ఆలోచిస్తోంది. ఇతర ఉద్యోగులు కూడా విరమణ వయసును 60 ఏళ్లకు పెంచాలని కోరుతారని, దీనివల్ల నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తారన్నదే ప్రభుత్వ భయంగా కనిపిస్తోంది.