మైసూరు రాచరికంలో ప్రతిష్టంభన
రాజులే పోయినా...రాజ్యాలు కూలినా... చిరస్మరణీయంగా ఉండేది మాత్రం వారు చేసిన మంచి పనులే. మిగతా రాజుల విషయంలో ఏమో కానీ, మైసూరు రాజులు మాత్రం నిత్యం ప్రజా క్షేమాన్నే ఆకాంక్షించారు. ప్రస్తుతం వారసులు లేక మైసూరు రాజ వంశం అంతమైనట్లేనని అందరూ భావిస్తున్న తరుణంలో రూ. కోట్లు విలువ చేసే వారి ఆస్తులు ఎవరికి దక్కుతాయనే విషయమై సర్వత్రా చర్చ జరుగుతోంది. చివరి రాజ వారసుడు శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడయార్ ఈ నెల 10న పరమపదించినప్పటి నుంచీ దీనిపై విస్తృతంగా చర్చ సాగుతోంది.
ఒడయార్ ఆస్తులకు ఉత్తరాధికారి?
శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడయార్ పరమపదించిన తర్వాత ఆస్తులకు సంబంధించి ఆయన సతీమణి ప్రమోదాదేవి యజమానిగా వ్యవహరిస్తారా... లేదా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా అనే విషయమై ఆసక్తి నెలకొంది. ఒడయార్కు సంతానం లేనందున, సహజంగా ఆయన ఆస్తంతా ప్రమోదా దేవికే చెందాలి. ఒడయార్ అంత్యక్రియలను ఆయన అక్క కుమారుడు కాంతరాజ అర్స్ నిర్వహించారు.
అయితే కర్మకాండలను నెరవేర్చడానికి మాత్రమే ఆయనకు ప్రైవేట్ దర్బారులో తాత్కాలికంగా పట్టాభిషేకం చేశారు. ఒడయార్ వారసుడుగా ఆయనను ప్రకటించడానికి ప్రమోదా దేవి ఇప్పటికీ సుముఖత వ్యక్తం చేయడం లేదు. అంతేకాక మైసూరులోని అంబా విలాస్ రాజప్రాసాదం చుట్టూ ఉన్న భూములు, బెంగళూరు రాజప్రాసాదం మినహా దాని చుట్టూ ఉన్న భూములపై 1996 నుంచి రాష్ర్ట ప్రభుత్వం, ఒడయార్ల మధ్య కోర్టుల్లో వ్యాజ్యాలు నడుస్తున్నాయి.
సుప్రీం కోర్టులో నడుస్తున్న వ్యాజ్యాలు
మైసూరు అంబా విలాస్ రాజ ప్రాసాదం మినహా చుట్టూ ఉన్న 60 ఎకరాల భూమి.
బెంగళూరులోని రాజ ప్రాసాదం మినహా, దాని చుట్టూ ఉన్న 460 ఎకరాల భూమి హక్కులపై కూడా...
1996లో చట్టం..
ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య 1996లో జనతా దళ్ హయాంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైసూరు రాజ వంశస్తుల ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి చట్టాన్ని తెచ్చారు. దీనిపై కూడా కోర్టులో వ్యాజ్యం నడుస్తోంది. ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నందున ఏ విధంగా వ్యవహరిస్తారనే విషయమై కుతూహలం నెలకొంది. ఒడయార్ అంత్యక్రియలకు హాజరైనప్పుడు విలేకరులు దీనిపై ప్రశ్నించినప్పుడు ఆయన చాలా ఇబ్బందికి గురయ్యారు. 1999లో జనతా దళ్ ఓడిపోయి అధికారాన్ని కోల్పోయినప్పుడు ‘చాముండి మాత ఆగ్రహం వల్ల జనతా దళ్ ఓడిపోయింది’ అని ఒడయార్ వ్యాఖ్యానించడం గమనార్హం.
కాకతాళీయమే అయిన
మైసూరు రాజులైనా... ముగ్గురు సంస్థానాధీశులు బెంగళూరులోని రాజ ప్రాసాదంలోనే కన్నుమూశారు. ముగ్గురూ గుండెపోటుతోనే తుది శ్వాసను విడవడం గమనార్హం. జయచామరాజేంద్ర ఒడయార్, నాల్వడి కృష్ణరాజ ఒడయార్, శ్రీకంఠదత్త నరసింహ రాజ ఒడయార్లు సొంత పనులపై బెంగళూరుకు వచ్చినప్పుడు రాజ ప్రాసాదంలోనే మృత్యువాత పడ్డారు. ఆధునిక మైసూరు శిల్పిగా పేరు గడించిన నాల్వడి కృష్ణరాజ ఒడయార్ తండ్రి పదవ చామరాజేంద్ర ఒడయార్ 1894లో, నాల్వడి 1940లో కన్నుమూశారు.
ఒడయార్ కుటుంబానికి చెందిన ఆస్తులు
మైసూరులోని లోక్ రంజన్ రాజ ప్రాసాదం
చాముండి కొండపై ఉన్న రాజేంద్ర విలాస్ రాజ ప్రాసాదం
ఊటీలోని ఫర్న్హిల్ ప్యాలెస్
మైసూరులోని గన్ హౌస్
మైసూరులోని సురభి డెయిరీ
మైసూరులోని చైతన్య హాలు
మంజునాథ్ ప్యాకింగ్స్ అండ్ ప్రాడక్ట్ రీజెన్సీ గ్రూపు
మైసూరులోని జగన్మోహన రాజ ప్రాసాదం
మైసూరులోని పెద్ద చెరువు మైదానం