dolls island
-
అమ్మాయి శవాన్ని తీస్తానంటూ..వికృత బొమ్మల్ని తీశాడు అంతే...
నిశ్శబ్దం మాటున ఊహించని అలజడులు, నిర్మానుష్యం చాటున నిరాధార ఆనవాళ్లు.. ధీరులకు సైతం నిస్సందేహంగా ప్రాణభయాన్ని సృష్టిస్తాయి. అలాంటిదే ఆ దీవి. ఆక్కడ ఒంటరిగా అడుగు పెడితే తిరిగి రావడం కష్టమే అంటారు మెక్సికన్స్. సుమారు అరవై మూడేళ్ల క్రితమే.. గగుర్పొడిచే ఆ భీతికి బీజం పడింది. దాని సృష్టికర్త డాన్ జూలియన్ బరేరా! మెక్సికో నగరానికి దక్షిణంగా 17 మైళ్ల దూరంలో షోచిమిల్కో సమీపాన భార్యపిల్లలతో సంతోషంగా జీవించేవాడు బరేరా. తన నలభయ్యో ఏట.. ఒకరోజు దగ్గర్లోని ‘ఇస్లా డి లాస్ మునెకాస్’ అనే ద్వీపానికి ఒంటరిగా వెళ్లాడు. తిరిగి రాగానే.. ‘ఆ ద్వీపంలోని సరస్సులో ఒక అమ్మాయి మునిగిపోవడం చూశా. కాపాడటానికి ప్రయత్నించా. కానీ కాపాడలేకపోయా’నని చెప్పాడు. మరునాడే కొందరు స్థానికుల్ని వెంటతీసుకెళ్లి.. ఆ సరసులోకి దిగి ‘అమ్మాయి శవాన్ని తీస్తా’ అంటూ అందులోంచి కొన్ని భయంకరమైన బొమ్మల్ని బయటికి తీశాడు. అవన్నీ దుష్ట ఆత్మ నుంచి వచ్చిన సంకేతాలని ప్రకటించాడు. ఆ చెడు నుంచి తనను తాను రక్షించుకోవడానికి, చనిపోయిన అమ్మాయి ఆత్మను శాంతింపజేయడానికి వాటిని చెట్లకు వేలాడదీయడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి అక్కడికి క్రమం తప్పకుండా వెళ్లేవాడు. అలా సుమారు నలభై ఏళ్ల పాటు అదే ద్వీపంలో ఒంటరిగా జీవిస్తూ.. భయానకమైన బొమ్మల్ని పోగుచేసి.. మొక్కలకు, చెట్లకు, షెడ్లకు వేలాడదీశాడు. అప్పుడప్పుడు మనుషుల ఆవాసాలకు వచ్చిపోతూ ఉండేవాడు. అయితే తన 80వ ఏట 2001లో అదే సరస్సులో శవమై తేలాడు బరేరా. దాంతో ఆ ద్వీపం మిస్టీరియస్ హాంటింగ్ ప్లేస్‌లా ప్రపంచానికి పరిచయమైంది. ఇక్కడ కొన్ని వందల వికృతమైన బొమ్మలు భీకరమైన ముఖాలతో, హడలెత్తించే చూపులతో అటూ ఇటూ ఊగుతూ చెట్లకు దెయ్యాల్లా వేలాడుతూ ఉంటాయి. కొన్నింటికి చేతులు, కాళ్లు, మొండెం, తలలు ఊడిపోయి మరింత వణికిస్తుంటాయి. కొన్ని చెట్లు, మొక్కలు చనిపోయి ఎండు మోడుల్లా ఆ వాతావరణాన్ని ఇంకా హడలెత్తిస్తుంటాయి. ఈ బొమ్మలలో ఆత్మలు నివసిస్తాయని అక్కడ స్థానికులు బలంగా నమ్ముతారు. రాత్రిపూట వింత వింత శబ్దాలు వినిపిస్తుంటాయని సమీప వాసులు చెబుతుంటారు. దాంతో అంతా ఈ దీవిని ‘డెడ్ డాల్స్ ఐఆలాండ్’ అని పిలవడం మొదలుపెట్టారు. అయితే ఇది ప్రస్తుతం పర్యాటక కేంద్రంగా మారింది. దాంతో ఔత్సాహికులు ఈ ద్వీపాన్ని సందర్శించి, ఈ బొమ్మలతో సెల్ఫీలు దిగుతుంటారు. ఏదేమైనా సరస్సులో చనిపోయిన ఆ అమ్మాయి ఎవరు? బరేరా ఎలా చనిపోయాడు? అసలు అమ్మాయి మరణం గురించి అతడు నిజం చెప్పాడా? లేక కల్పించి చెప్పాడా? లేదంటే ఏదైనా దుష్టశక్తి మాయలో అతడు చిక్కాడా? నిజంగానే ఆ బొమ్మల్లో ఆత్మలు ఉన్నాయా? ఇలా అన్నీ మిస్టరీలే! --సంహిత నిమ్మన (చదవండి: ఓ అమాయకురాలి విషాద గాథ! చంపింది స్నేహితుడా?.. ప్రేమికుడా?..ఆ రోజు ఏం జరిగింది?) -
పక్షుల ఆత్మహత్య స్పాట్ ఇదే!
-
ఆ ఐదు వింత లోకాలివేనట..!
ఈ ప్రపంచం ఎన్నో వింతలకు, మరెన్నో అద్భుతాలకు నిలయం. ఈ భూమిపై మనిషి ఊహకందని ఎన్నో ప్రదేశాలున్నాయి. ఇప్పుడు మీరు చదవబోయే ప్రదేశాలు కూడా అలాంటివే . మీకు నమ్మకం కలిగినా.. లేకపోయినా.. వి మాత్రం అక్షరాల సత్యం. మిమ్మల్ని మరోలోకానికి తీసుకెళ్లే అలాంటి ఐదు వింతలోకాల విశేషాలు ఈ రోజు తెలుసుకుందాం. -సాక్షి, స్కూల్ ఎడిషన్ పక్షుల ఆత్మహత్య స్థలం..! భారతదేశంలోని అస్సాంలో జటింగా అనే ఒక గ్రామం ఉంది. ఇక్కడ ప్రతీ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు వందలాది పక్షులు ఈ ప్రాంతానికి వచ్చి ఆత్మహత్య చేసుకుంటాయి. దాదాపు 30 జాతులకు చెందిన పక్షులు ఇక్కడ మరణిస్తాయని స్థానికులు చెబుతున్నారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుందనడానికి ఎలాంటి శాస్త్రీయ కారణాలు లేవు. కానీ అక్కడి స్థానికులు మాత్రం ఆకాశంలో ఉండే ఆత్మలే దీనికి కారణమని బలంగా నమ్ముతున్నారు. అఓకిగహారా (ఆత్మహత్యల అడవి) జపాన్‌లోని మౌంట్ ఫ్యూజీ సమీపంలో అఓకిగహారా అనే అడవి ఉంది. ‘ఆత్మహత్యల ఫారెస్ట్’గా ఈ అడవి పేరుపొందింది. ఎందుకంటే ఈ అడవిలో జరిగే ఆత్మహత్యలే దీనికి నిదర్శనం. ప్రతీ ఏడాది ఈ అడవిలో సుమారు 100 మంది ఆత్మహత్య చేసుకుంటారని గణంకాలు చెబుతున్నాయి. ఆత్మహత్య చేసుకునే వారిలో ఎక్కువ శాతం డ్రగ్స్‌కి బానిసలైనవారు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఉంటారు. కొంతమంది సందర్శకులు ఈ మృత దేహాలను చూడడానికి రావడం ఇక్కడ ఆసక్తికరమైన అంశం. ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా దుమారం లేపడంతో అక్కడి ప్రభుత్వం పత్రికల్లో, టీవీల్లో ఈ అడవికి సంబంధించిన కథనాలను టెలికాస్ట్ చేయకూడదనే షరతులు విధించింది. ది ఐలాండ్ ఆఫ్ డాల్స్ (బొమ్మల దీవి) మెక్సికోలోని ఒక దీవిలో డాన్జులియన్ సంటానా అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చూస్తుండగానే ఓ 12 ఏళ్ల బాలిక నీళ్లల్లో మునిగి చనిపోయింది. తర్వాత రోజు ఆ అమ్మాయి చనిపోయిన చోట ఒక చిన్న పిల్లలాంటి బొమ్మ తేలుతూ కనిపించిందట. జులియన్ ఆ బొమ్మని తీసుకొచ్చి దీవిలోని ఒక చెట్టుకు వేలాడదీశాడు. ఆ తర్వాతి రోజు నుంచి నీటిలో రోజుకో బొమ్మ తేలుతూ కనిపించడం మొదలైంది. జులియన్ ఇలా కనిపించిన ప్రతి బొమ్మని దీవిలో వేలాడదీయడం మొదలు పెట్టాడు. తను చనిపోయేంత వరకు బొమ్మలను చెట్లకు వేలాడదీశాడు. ఇప్పుడు ఆ దీవిలో కొన్ని వేల బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మల్లో చనిపోయిన ఆత్మ ఉందని అక్కడి స్థానికులు నమ్ముతున్నారు. అంతేకాదు బొమ్మలు అప్పుడప్పుడు కదులుతాయని, కళ్లు తెరుస్తాయని వారు చెబుతున్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే 12 ఏళ్ల అమ్మాయి చనిపోయిన చోటే డాన్జులియస్ మరణించాడు. ఇప్పుడు ఈ ప్రదేశం పర్యాటక ప్రదేశంగా మారింది. జులియన్ మరణాంతరం ఈ ప్రదేశంపై ప్రపంచ వ్యాప్తంగా చాలా వార్త సంస్థలు కథనాలు ప్రచురిస్తున్నాయి. సెడ్లిక్ అస్వేరి ( పుర్రెల చర్చి) చెక్‌రిపబ్లిక్ అనే దేశంలో ఒక రోమన్ క్యాథలిక్ చర్చి ఉంది. ఈ చర్చి ప్రాంగణంలో సమాధి చేసిన వారు నేరుగా స్వర్గానికి వెళ్తారని ప్రజల నమ్మకం. దీంతో ఇప్పటివరకు అక్కడ సుమారు 70 వేల మందిని సమాధి చేశారు. అనంతరం ఆ చర్చిని పునర్నిర్మించే క్రమంలో ఆ సమాధులను తవ్వి అందులోని పుర్రెలతో చర్చిని డెకరేట్ చేశారు. చర్చిలో ఉన్న ప్రతి ఆకర్షణీయ వస్తువు ఎముకలతో తయారుచేసినవే. చెక్‌రిపబ్లిక్‌లో ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే ప్రదేశం ఇదే అవ్వడం విశేషం. లేక్ నాట్రాన్ టాంజానియా అనే దేశంలో లేక్ నాట్రాన్ అనే నది ఉంది. ఈ నదిని ‘సాల్ట్ అండ్ సోడా లేక్’ అని పిలుస్తారు. దీనిలో ఉండే నీటి ఉష్ణోగ్రత సుమారు 40 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. ఇంత వేడిగా ఉండడం వల్ల ఆ నదిలోని నీరంత ఆవిరైపోయి ‘సోడియం కార్బోనేట్ డెకా హైడ్రేట్’ అనే రసాయనం తయారవుతుంది. ఈ రసాయనాన్ని ఈజిప్టియన్లు మమ్మీలు తయారుచేయడానికి ఉపయోగించారని పరిశోధకులు చెబుతున్నారు. ఆ నదిపై నుంచి ఏదైనా పక్షి వెళ్లినా, నీరు తాగడానికి ఏ జంతువు వచ్చినా అవి వెంటనే చనిపోతాయి.