నిశ్శబ్దం మాటున ఊహించని అలజడులు, నిర్మానుష్యం చాటున నిరాధార ఆనవాళ్లు.. ధీరులకు సైతం నిస్సందేహంగా ప్రాణభయాన్ని సృష్టిస్తాయి. అలాంటిదే ఆ దీవి. ఆక్కడ ఒంటరిగా అడుగు పెడితే తిరిగి రావడం కష్టమే అంటారు మెక్సికన్స్. సుమారు అరవై మూడేళ్ల క్రితమే.. గగుర్పొడిచే ఆ భీతికి బీజం పడింది. దాని సృష్టికర్త డాన్ జూలియన్ బరేరా!
మెక్సికో నగరానికి దక్షిణంగా 17 మైళ్ల దూరంలో షోచిమిల్కో సమీపాన భార్యపిల్లలతో సంతోషంగా జీవించేవాడు బరేరా. తన నలభయ్యో ఏట.. ఒకరోజు దగ్గర్లోని ‘ఇస్లా డి లాస్ మునెకాస్’ అనే ద్వీపానికి ఒంటరిగా వెళ్లాడు. తిరిగి రాగానే.. ‘ఆ ద్వీపంలోని సరస్సులో ఒక అమ్మాయి మునిగిపోవడం చూశా. కాపాడటానికి ప్రయత్నించా. కానీ కాపాడలేకపోయా’నని చెప్పాడు. మరునాడే కొందరు స్థానికుల్ని వెంటతీసుకెళ్లి.. ఆ సరసులోకి దిగి ‘అమ్మాయి శవాన్ని తీస్తా’ అంటూ అందులోంచి కొన్ని భయంకరమైన బొమ్మల్ని బయటికి తీశాడు. అవన్నీ దుష్ట ఆత్మ నుంచి వచ్చిన సంకేతాలని ప్రకటించాడు.
ఆ చెడు నుంచి తనను తాను రక్షించుకోవడానికి, చనిపోయిన అమ్మాయి ఆత్మను శాంతింపజేయడానికి వాటిని చెట్లకు వేలాడదీయడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి అక్కడికి క్రమం తప్పకుండా వెళ్లేవాడు. అలా సుమారు నలభై ఏళ్ల పాటు అదే ద్వీపంలో ఒంటరిగా జీవిస్తూ.. భయానకమైన బొమ్మల్ని పోగుచేసి.. మొక్కలకు, చెట్లకు, షెడ్‌లకు వేలాడదీశాడు. అప్పుడప్పుడు మనుషుల ఆవాసాలకు వచ్చిపోతూ ఉండేవాడు. అయితే తన 80వ ఏట 2001లో అదే సరస్సులో శవమై తేలాడు బరేరా. దాంతో ఆ ద్వీపం మిస్టీరియస్ హాంటింగ్ ప్లేస్‌లా ప్రపంచానికి పరిచయమైంది.
ఇక్కడ కొన్ని వందల వికృతమైన బొమ్మలు భీకరమైన ముఖాలతో, హడలెత్తించే చూపులతో అటూ ఇటూ ఊగుతూ చెట్లకు దెయ్యాల్లా వేలాడుతూ ఉంటాయి. కొన్నింటికి చేతులు, కాళ్లు, మొండెం, తలలు ఊడిపోయి మరింత వణికిస్తుంటాయి. కొన్ని చెట్లు, మొక్కలు చనిపోయి ఎండు మోడుల్లా ఆ వాతావరణాన్ని ఇంకా హడలెత్తిస్తుంటాయి.
ఈ బొమ్మలలో ఆత్మలు నివసిస్తాయని అక్కడ స్థానికులు బలంగా నమ్ముతారు. రాత్రిపూట వింత వింత శబ్దాలు వినిపిస్తుంటాయని సమీప వాసులు చెబుతుంటారు. దాంతో అంతా ఈ దీవిని ‘డెడ్ డాల్స్ ఐఆలాండ్’ అని పిలవడం మొదలుపెట్టారు.
అయితే ఇది ప్రస్తుతం పర్యాటక కేంద్రంగా మారింది. దాంతో ఔత్సాహికులు ఈ ద్వీపాన్ని సందర్శించి, ఈ బొమ్మలతో సెల్ఫీలు దిగుతుంటారు. ఏదేమైనా సరస్సులో చనిపోయిన ఆ అమ్మాయి ఎవరు? బరేరా ఎలా చనిపోయాడు? అసలు అమ్మాయి మరణం గురించి అతడు నిజం చెప్పాడా? లేక కల్పించి చెప్పాడా? లేదంటే ఏదైనా దుష్టశక్తి మాయలో అతడు చిక్కాడా? నిజంగానే ఆ బొమ్మల్లో ఆత్మలు ఉన్నాయా? ఇలా అన్నీ మిస్టరీలే!
--సంహిత నిమ్మన
(చదవండి: ఓ అమాయకురాలి విషాద గాథ! చంపింది స్నేహితుడా?.. ప్రేమికుడా?..ఆ రోజు ఏం జరిగింది?)
Comments
Please login to add a commentAdd a comment