haunted village
-
Rajasthan Haunted Places: రాజస్థాన్‌లోని అత్యంత హాంటెడ్ ప్లేసెస్.. ఇవే! (ఫోటోలు)
-
మిస్టీరియస్ కోట!..ఆ సమయంలో గానీ కోటలోకి అడుగుపెట్టారో అంతే..!
పింక్ సిటీ ఆఫ్ ఇండియా’గా గుర్తింపు పొందిన రాజస్థాన్ రాజధాని జైపూర్.. రాజప్రసాదాలకు, చారిత్రక కట్టడాలకు ఆలవాలం. అయితే ఇక్కడ హాంటెడ్ ప్లేసెస్ కూడా బాగానే హడలెత్తిస్తాయి. జైపూర్ విమానాశ్రయానికి 56 కి.మీ దూరంలో.. భాన్గఢ్కు సమీపంలో ఉన్న కోట పుకార్లతో భయపెడుతుంది. ఇక్కడుండే నెగటివ్ ఎనర్జీ గురించి.. ఆత్మల గురించి.. చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా.. ‘సూర్యాస్తమయానికి, సూర్యోదయానికి మధ్య సమయంలో ఈ కోటలోకి అనుమతి లేదు’ అని బోర్డులు పెట్టిదంటే.. ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 17వ శతాబ్దంలో నిర్మించిన ఈ కోట.. పలు కార్యకలాపాలకు కేంద్రంగా నిలిచింది. ఈ కోట అందచందాల గురించి అద్భుతమైన వర్ణనలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ కథల్లో కొన్ని ఎంత ఆసక్తికరంగా ఉంటాయో.. అంతే వణికించేలా ఉంటాయి. ఇక్కడ ఈ కోటను కట్టడానికి ముందు ఆ దగ్గర్లో నివసించే ఓ సన్యాసి.. ‘కోట నీడ నా ఇంటిపై పడకూడదు’ అని ఓ షరతు పెట్టాడట. కానీ అలా జరగకపోవడంతో ఆ సన్యాసి దుష్టశక్తులను కోటలోకి ఆహ్వానిస్తూ శపించాడని చాలామంది చెబుతారు. ఒకనాటి భాన్‌గఢ్ యువరాణితో ప్రేమలో పడిన ఓ మాంత్రికుడి దుష్ట ఆత్మకు ఈ కోట నిలయంగా మారిందని మరికొందరు చెబుతారు. ఈ కోట సమీపంలో ఏవో క్రూరమైన హత్యలు జరిగాయని.. ఆ హత్యకు గురైన బాధితులే ఆత్మలుగా మారి ఇక్కడ సంచరిస్తున్నాయని ఇంకొందరు అభిప్రాయం. ఒక స్నేహబృందం రహస్యంగా ఈ కోటలోకి ప్రవేశించి.. ఇక తిరిగి రాలేదనే ప్రచారం బాగా వినిపిస్తోంది. రాత్రి పూట మహిళల అరుపులు, ఏడుపులు, వింత వింత శబ్దాలు వినిపిస్తాయని స్థానికులు చెబుతుంటారు. ఈ పుకార్లు వేటికీ ఆధారం లేకపోయినా పర్యాటకులకు మాత్రం ఈ ప్రాంగణంలో అసౌకర్య భావన కలుగుతూ ఉంటుంది. ఈ కోటలోకి వెళ్లిన చాలా మంది తమ వింత అనుభవాలను పంచుకుంటూ ఉంటారు. కోటలోంచి తిరిగి వచ్చినవారు.. ఏదో నీడ వెంటాడుతున్నట్లు, ఎవరో లాగినట్లు అనిపించిందని చెబుతుంటారు. ఏళ్లు గడిచినా.. ఈ కోటలోని మిస్టరీ ఏంటన్నది మాత్రం ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. ∙సంహిత నిమ్మన (చదవండి: జీవిత భాగస్వామి విషయంలో ఆ తప్పిదమే ఆ సైనికుడి జీవితాన్ని..!) -
దెయ్యాల దీవి..అక్కడ నేల కింద ఏకంగా లక్షలకు పైగా
ఇదేదో హారర్ సినిమా పేరు కాదు. ఇటలీలో ఉన్న ఈ దీవి నిజంగానే దయ్యాల దీవిగా పేరు మోసింది. దాదాపు అర్ధశతాబ్దంగా ఇక్కడ నరమానవులెవరూ నివాసం ఉండటం లేదు. ఈ దీవిలోని నేల కింద 1.60 లక్షలకు పైగా శవాలు సమాధి అయి ఉన్నాయి. ఇటలీ ఉత్తర ప్రాంతంలో వెనిస్–లిడో నగరాల మధ్య ఉన్న ఈ దీవి పేరు పోవెగ్లియా. ప్రత్యేక అనుమతి ఉంటేనే తప్ప ఈ దీవిలో సందర్శకులెవరూ అడుగు పెట్టలేరు. ఒకప్పుడు ఈ దీవి మానసిక రోగుల చికిత్స స్థావరంగా ఉండేది. ఇక్కడి మానసిక చికిత్స కేంద్రంలో పనిచేసే ఒక డాక్టర్ రోగులపై క్రూరాతి క్రూరమైన ప్రయోగాలు చేసేవాడు. అప్పట్లో ఇక్కడ మరణించిన రోగులను ఇక్కడే పాతిపెట్టేశారు. ఇక్కడి మానసిక చికిత్స కేంద్రం 1968లో మూతబడిన తర్వాత ఈ దీవి పూర్తిగా ఖాళీ అయిపోయింది. మూతబడిన కొత్తలో కొందరు సాహసికులు ఈ దీవిలోకి వచ్చి, అంతా కలియదిరిగి వెళ్లిపోయేవారు. కొంతకాలానికి ఈ దీవిలోకి జనాల ప్రవేశాన్ని నిషేధించారు. ఇప్పటికీ ఈ నిషేధం అమలులో ఉంది. పరిశోధనల వంటి కారణాల కోసమైతే ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి పొంది మాత్రమే ఇక్కడకు చేరుకోవాల్సి ఉంటుంది. ఇటీవల బ్రిటిష్ పరిశోధకులు మ్యాట్ నాడిన్, ఆండీ థామ్సన్ ఇటలీ ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి పొంది, ఈ దీవిలోకి అడుగుపెట్టారు. శిథిలావస్థకు చేరుకున్న మానసిక రోగుల ఆస్పత్రి, చుట్టుపక్కల ఉన్న ఇతర శిథిల నిర్మాణాలు, చుట్టూ కీకారణ్యంలా పెరిగిన చెట్లు, మొక్కలు, కట్టడాల మధ్యలో మొలిచిన ఊడల మర్రిచెట్లు వంటివాటిని వీడియో తీసి తమ యూట్యూబ్ చానల్లో పెట్టడంతో ఈ దీవి కథ వైరల్‌గా మారింది. ఈ దీవిలో 1922లో మానసిక చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అంతకు ముందు 1793లో ఒకసారి, 1814లో మరోసారి ప్లేగు మహమ్మారి విజృంభించినప్పుడు ఈ దీవిని క్వారంటైన్ కేంద్రంగా నిర్వహించేవారు. ప్లేగుతో చనిపోయినవారిని, ఆ తర్వాత మానసిక చికిత్స కేంద్రంలో డాక్టర్ ప్రయోగాలకు ప్రాణాలు కోల్పోయినవారిని ఇక్కడి నేలలోనే పూడ్చిపెట్టేశారు. వారి ఆత్మలు ఇక్కడ సంచరిస్తుంటాయని ప్రచారం జరగడంతో ఇక్కడి మానసిక చికిత్స కేంద్రం మూతబడిన తర్వాత ఈ దీవి పూర్తిగా నిరుపయోగంగానే మిగిలిపోయింది. (చదవండి: బ్లాక్ యాపిల్ గురించి విన్నారా? ఒక్కొక్కటి ఏకంగా..) -
అమ్మాయి శవాన్ని తీస్తానంటూ..వికృత బొమ్మల్ని తీశాడు అంతే...
నిశ్శబ్దం మాటున ఊహించని అలజడులు, నిర్మానుష్యం చాటున నిరాధార ఆనవాళ్లు.. ధీరులకు సైతం నిస్సందేహంగా ప్రాణభయాన్ని సృష్టిస్తాయి. అలాంటిదే ఆ దీవి. ఆక్కడ ఒంటరిగా అడుగు పెడితే తిరిగి రావడం కష్టమే అంటారు మెక్సికన్స్. సుమారు అరవై మూడేళ్ల క్రితమే.. గగుర్పొడిచే ఆ భీతికి బీజం పడింది. దాని సృష్టికర్త డాన్ జూలియన్ బరేరా! మెక్సికో నగరానికి దక్షిణంగా 17 మైళ్ల దూరంలో షోచిమిల్కో సమీపాన భార్యపిల్లలతో సంతోషంగా జీవించేవాడు బరేరా. తన నలభయ్యో ఏట.. ఒకరోజు దగ్గర్లోని ‘ఇస్లా డి లాస్ మునెకాస్’ అనే ద్వీపానికి ఒంటరిగా వెళ్లాడు. తిరిగి రాగానే.. ‘ఆ ద్వీపంలోని సరస్సులో ఒక అమ్మాయి మునిగిపోవడం చూశా. కాపాడటానికి ప్రయత్నించా. కానీ కాపాడలేకపోయా’నని చెప్పాడు. మరునాడే కొందరు స్థానికుల్ని వెంటతీసుకెళ్లి.. ఆ సరసులోకి దిగి ‘అమ్మాయి శవాన్ని తీస్తా’ అంటూ అందులోంచి కొన్ని భయంకరమైన బొమ్మల్ని బయటికి తీశాడు. అవన్నీ దుష్ట ఆత్మ నుంచి వచ్చిన సంకేతాలని ప్రకటించాడు. ఆ చెడు నుంచి తనను తాను రక్షించుకోవడానికి, చనిపోయిన అమ్మాయి ఆత్మను శాంతింపజేయడానికి వాటిని చెట్లకు వేలాడదీయడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి అక్కడికి క్రమం తప్పకుండా వెళ్లేవాడు. అలా సుమారు నలభై ఏళ్ల పాటు అదే ద్వీపంలో ఒంటరిగా జీవిస్తూ.. భయానకమైన బొమ్మల్ని పోగుచేసి.. మొక్కలకు, చెట్లకు, షెడ్లకు వేలాడదీశాడు. అప్పుడప్పుడు మనుషుల ఆవాసాలకు వచ్చిపోతూ ఉండేవాడు. అయితే తన 80వ ఏట 2001లో అదే సరస్సులో శవమై తేలాడు బరేరా. దాంతో ఆ ద్వీపం మిస్టీరియస్ హాంటింగ్ ప్లేస్‌లా ప్రపంచానికి పరిచయమైంది. ఇక్కడ కొన్ని వందల వికృతమైన బొమ్మలు భీకరమైన ముఖాలతో, హడలెత్తించే చూపులతో అటూ ఇటూ ఊగుతూ చెట్లకు దెయ్యాల్లా వేలాడుతూ ఉంటాయి. కొన్నింటికి చేతులు, కాళ్లు, మొండెం, తలలు ఊడిపోయి మరింత వణికిస్తుంటాయి. కొన్ని చెట్లు, మొక్కలు చనిపోయి ఎండు మోడుల్లా ఆ వాతావరణాన్ని ఇంకా హడలెత్తిస్తుంటాయి. ఈ బొమ్మలలో ఆత్మలు నివసిస్తాయని అక్కడ స్థానికులు బలంగా నమ్ముతారు. రాత్రిపూట వింత వింత శబ్దాలు వినిపిస్తుంటాయని సమీప వాసులు చెబుతుంటారు. దాంతో అంతా ఈ దీవిని ‘డెడ్ డాల్స్ ఐఆలాండ్’ అని పిలవడం మొదలుపెట్టారు. అయితే ఇది ప్రస్తుతం పర్యాటక కేంద్రంగా మారింది. దాంతో ఔత్సాహికులు ఈ ద్వీపాన్ని సందర్శించి, ఈ బొమ్మలతో సెల్ఫీలు దిగుతుంటారు. ఏదేమైనా సరస్సులో చనిపోయిన ఆ అమ్మాయి ఎవరు? బరేరా ఎలా చనిపోయాడు? అసలు అమ్మాయి మరణం గురించి అతడు నిజం చెప్పాడా? లేక కల్పించి చెప్పాడా? లేదంటే ఏదైనా దుష్టశక్తి మాయలో అతడు చిక్కాడా? నిజంగానే ఆ బొమ్మల్లో ఆత్మలు ఉన్నాయా? ఇలా అన్నీ మిస్టరీలే! --సంహిత నిమ్మన (చదవండి: ఓ అమాయకురాలి విషాద గాథ! చంపింది స్నేహితుడా?.. ప్రేమికుడా?..ఆ రోజు ఏం జరిగింది?) -
ప్రపంచంలోని టాప్ 10 హాంటెడ్ నగరాలు
-
ఇల్లు కాదు పాముల పుట్ట, సామాను సర్దేలోగా.. సంతోషం ఆవిరి
ఒకటి కాదు, రెండు కాదు.. పదేళ్లు పైసా పైసా కూడబెట్టి ఇల్లు కొనుక్కొంది ఓ మహిళ. తన కలల సౌధం ఎలా ఉండాలన్నదానిపై అన్ని జాగ్రత్తలు చెప్పింది. తీరా ఇంట్లోకి వెళ్లిన తర్వాత సీన్ రివర్సయింది. అమెరికాలోని కొలరాడోలో ఉండే ఓ మహిళ పేరు అంబర్ హాల్. ఆమెకు ఇద్దరు పిల్లలు. సింగిల్ మదర్ కావడంతో ఖర్చులన్నీ తగ్గించుకుని ఇంటి కోసం ప్రయత్నించింది. నాలుగు బెడ్ రూంలు, ఓ చిన్న లాన్, అవసరాలకు సరిపడా కాసింత చోటు.. వీటి కోసం గాలించగా.. చివరికి ఓ ఇల్లు దొరికింది. ఏప్రిల్‌లో దీనికి సంబంధించిన డబ్బంతా కట్టి నాలుగు రోజుల కింద లగేజీ తీసుకుని వచ్చింది. తన వెంట రెండు లాబ్రాడార్ కుక్కలు కూడా ఉన్నాయి. ఇంకా ఫర్నీచర్ కూడా సెట్ చేయలేదు. అంతలోనే కుక్కలు మొరగడంతో అనుమానం వచ్చింది అంబర్ హాల్‌కు. క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే.. ఓ పాము కనిపించింది. ఇంకొంచెం ముందుకు వెళ్లి చూస్తే మరికొన్ని పాములు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏ గోడ తవ్వినా పామే. ఏ మూల చూసినా పామే. చిన్నవి కొన్ని, పెద్దవి కొన్ని. కొంత ధైర్యం చేసి స్నేక్ క్యాచర్లను పిలవగా ఇప్పటివరకు దాదాపు 40 పాములను పట్టుకెళ్లారు. ఇంకో చోటికి వెళదామంటే ఖర్చులు భరించలేని పరిస్థితి. అందుకే ఎన్ని కష్టాలు ఎదురయినా అదే ఇంట్లో ఉంటోంది అంబర్ హాల్. A first-time homeowner was shocked when she found as many as 30 snakes "coming out of every hole and crevice" of her new house. pic.twitter.com/dthRHno5n6 — CNN (@CNN) May 14, 2023 ఇప్పటికీ రోజూ ఏదో ఓ చోట పాము కనబడుతూనే ఉంది. ఇంట్లో రోజూ పాములను పట్టడం దగ్గరున్న అడవిలో వదిలేయడం జరుగుతోంది. ఈ ఇంటికి సమీపంలో ఒకప్పుడు చిన్నపాటి మడుగు ఉండేదట. అక్కడ బోలెడు పాములుండేవట. బహుశా అవే పాములు ఈ ఇంటికి వరుస కట్టి ఉంటాయని అంచనా వేస్తున్నారు. తన దీనస్థితిని అర్థం చేసుకుని సాయం చేసేందుకు ముందుకు రావాలని అంబర్ హాల్ కోరుతున్నారు. కనీసం ఆ మడుగుపై కాంక్రీట్ స్లాబ్ వేయగలిగితే పాముల బెడద తప్పుతుందన్నది అంబర్ ఆశ. -
దెయ్యం మెసేజ్‌లు పంపుతోంది!!
ఇదొక చిత్రమైన కేసు. కాలిఫోర్నియా స్టాక్టన్కు చెందిన ఓ వ్యక్తి.. దెయ్యం తన మొబైల్ నుంచి మెసేజ్‌లు పంపుతోందని, రిప్లయ్‌లు కూడా ఇస్తోందని వాదిస్తున్నాడు. నలభై ఏళ్ల ఆ వ్యక్తి తన ప్రియురాలితో ఇంగ్లండ్‌లోని యార్క్ నగరానికి టూర్‌కి వెళ్లాడు. అయితే అది హాంటెడ్ సిటీ అని, అక్కడ ఒక పబ్ దగ్గర ఫొటో తీస్తే.. దెయ్యం కనిపించిందని, అప్పటి నుంచి తనకు పారానార్మల్ యాక్టివిటీస్ (విచిత్రమైన అనుభవాలు) ఎదురవుతున్నాయని చెప్తున్నాడు. అంతేకాదు.. ఆనాటి నుంచి తన ఫోన్ నుంచి తనకు తెలియకుండానే ప్రియురాలికి సందేశాలు వెళ్తున్నాయని, ఇదంతా దెయ్యం పనే అని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఈ మేరకు పోలీసులనూ ఆశ్రయించాడు. ప్రస్తుతం అతగాడిని మానసిక వైద్యుల పర్యవేక్షణలో విచారిస్తున్నారు పోలీసులు. అయితే పారానార్మల్ యాక్టివిస్ట్‌లు ఈ కేసును ఆసక్తికరంగా గమనిస్తున్నారు. మార్చి 21వ తేదీ నుంచి ఆ వ్యక్తికి ఇలాంటి అనుభవాలు మొదలయ్యాయని ‘టీసిడె లైవ్ రిపోర్ట్స్’ ఒక కథనం ప్రచురించింది. -
50 ఏళ్ల తర్వాత ప్రియురాలిని కలవనున్న తాత..
జైపూర్: ప్రేమ గుడ్డిది.. సరిహద్దులు లేవు.. కులం, మతం లేదు అంటే.. ఆ.. అవన్ని పుస్తకాల్లోనే.. రియల్‌గా కాదు అనుకునే వారు చాలా మంది. కానీ పై వాఖ్యాలను నిజం చేసే ఘటనలు కోకొల్లలు మన సమాజంలో. దీనికి నిదర్శనంగా నిలిచే సంఘటన మరొకటి రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. 82 ఏళ్ల వయసులో ఓ వృద్ధుడు దాదాపు 50 ఏళ్ల క్రితం దూరమైన తన ప్రేమికురాలిని తిరిగి కలవబోతున్నాడు. ఈ విషయాన్ని చెబుతున్నప్పుడు ఆ తాత కళ్లల్లో సంతోషం వర్ణించడానికి మాటలు చాలవు. ఇంతకు ఆ ప్రేమ కథ వివరాలు ఏంటో చూడండి.. తొలి చూపులోనే ప్రేమలో పడ్డాను... ప్రస్తుతం రాజస్తాన్ జైసల్మేర్‌లోని హాంటెడ్ గ్రామం కుల్ధారా గేట్ కీపర్‌గా పని చేస్తున్నాడు సదరు వృద్థుడు. తన లవ్ స్టోరి గురించి చెబుతూ.. ‘‘1970లో తొలిసారి మెరినాను చూశాను. తొలి చూపులోనే ప్రేమలో పడ్డానంటారే.. మా విషయంలో కూడా ఇదే జరిగింది. ఐదు రోజుల పర్యటన నిమిత్తం ఆస్ట్రేలియా నుంచి జైసల్మేర్ వచ్చిన మెరినాను చూడగానే నేను ప్రేమలో పడ్డాను. తను కూడా అంతే. ఇక వెళ్లిపోయే ముందు తను నాకు ప్రపోజ్ చేసింది. మెరినా ‘‘ఐ లవ్ యూ’’ అన్నప్పుడు నా ముఖం సిగ్గుతో ఎర్రబడింది’’ అంటూ ఇప్పుడు కూడా సిగ్గు పడ్డాడు తాత. రూ. 30 వేలు అప్పు చేసి మరి... ‘‘ఆ తర్వాత కూడా మేం కాంటాక్ట్‌లోనే ఉన్నాం. ఒకరికొకరం ఉత్తరాలు రాసుకునే వాళ్లం. ఓ సారి తనను చూడాలనిపించింది. దాంతో 30 వేల రూపాయలు అప్పు చేసి మరి ఆస్ట్రేలియా వెళ్లాను. మూడు నెలల పాటు అక్కడే ఉన్నాను. నా జీవితంలో అత్యంత మధురమైన క్షణాలు అంటే అవే. తను నాకు ఇంగ్లీష్ నేర్పితే.. నేను తనకు మా భాష నేర్పాను. ఆ మూడు నెలలు చాలా సంతోషంగా గడిచిపోయాయి’’ అంటూ నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. అలా విడిపోవాల్సి వచ్చింది... ‘‘ఆస్ట్రేలియాలో ఉండగా ఓ రోజు మెరినా ‘‘పెళ్లి చేసుకుందాం.. ఇక్కడే ఉండిపో’’ అన్నది. కానీ అది జరిగే పని కాదు. నా కుటుంబాన్ని వదిలి అక్కడే స్థిరపడలేను. అలా అని తను నా కోసం ఆస్ట్రేలియా విడిచి రాలేదు. దాంతో తప్పని సరి పరిస్థితుల్లో మేం విడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కుటుంబ ఒత్తిడి మీద నేను పెళ్లి చేసుకున్నాను. ఈ గేట్ కీపర్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. అప్పుడప్పుడు మెరినా గురించి ఆలోచించేవాడిని. తను వివాహం చేసుకుందా.. ఎలా ఉంది.. ఒక్కసారి చూస్తే బాగుండు అనుకునే వాడిని. కాలక్రమేణా తన ఆలోచనలు కూడా తగ్గిపోయాయి’’ అన్నాడు. అద్భుతం జరిగింది... ‘‘ఇలా కొనసాగుతన్న నా జీవితంలో ఓ అద్భుతం జరిగింది. నెల రోజుల క్రితం మెరినా నాకు ఉత్తరం రాసింది.. ఎలా ఉన్నావ్ నేస్తమా అంటూ కుశల ప్రశ్నలు వేసింది. ఆ లేఖ చూసి నేను ఎంత ఆశ్చర్యానికి గురయ్యానో మాటల్లో చెప్పలేను. ఇది కలా.. నిజమా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. దాదాపు 50 ఏళ్ల తర్వాత నేను నా తొలి ప్రేమను లేఖ రూపంలో తిరిగి కలుసుకున్నాను. ఆ తర్వాత నుంచి మేం ప్రతి రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం’’ అని చెబుతూ తాత తెగ సంబరపడ్డాడు. తను పెళ్లి చేసుకోలేదు... ‘‘మెరినాకు వివాహం కాలేదని తెలిసింది. త్వరలోనే తను ఇండియా రాబోతుంది. ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నాకు ఎలా ఉందంటే.. దేవుడి మీద ఒట్టు నాకు నేనే 21 ఏళ్ల కుర్రాడిలా అనిపిస్తున్నాను. తనను ఎప్పుడు చూస్తానా అని మనసు ఉవ్విళ్లురూతుంది. మా భవిష్యత్ ఎలా ఉండనుందో నాకు తెలియదు. కానీ నా ఫస్ట్ లవ్‌ని తిరిగి కలుసుకోబోతున్నాను. తను తిరిగి నా జీవితంలోకి రాబోతుంది. తనతో ప్రతి రోజు మాట్లాడటం ఎంత సంతోషంగా ఉందో మాటాల్లో వర్ణించలేను’’ అని చెబుతూ తాత తెగ సంబరపడిపోతున్నాడు. హ్యూమన్స్బాంబే తన ఫేస్బుక్లో షేర్ చేసిన ఈ స్టోరి ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ట్రూ లవ్.. ఫస్ట్ లవ్ ఎఫెక్ట్ ఇదే.. తాతా నువ్వు కేక.. యూత్‌కు పోటిగా వస్తున్నావ్ కదా.. మెరినా మేడం వచ్చాక మీ ఇద్దరి ఫోటో షేర్ చేయ్ ప్లీజ్ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: ఆమె కోసం ఇల్లు అమ్మేసి... ఆటోలోనే తిండి, నిద్ర గుండె పగిలినట్లు అనిపిస్తుంది.. కానీ.. -
గజ్జెల చప్పుడు.. చెవిలో గుసగుసలు
► మనిషి కనిపించరు.. ఒంటికి చల్లగా తగిలే స్పర్శలు ► గుసగుసలాడుతూ మనుషులతో మాట్లాడే చీకటి శక్తులు ► దుప్పట్లు తొలగించి ముఖాలు చూసే మసక రూపాలు ► గ్రామం మొత్తం నిర్మానుష్యం ► రాజస్థాన్‌లోని కుల్ధార గ్రామం వింత గాధ జైపూర్: ఆ గ్రామంలో 200 ఏళ్ల క్రితం చక్కగా ఇటుకలతో కట్టిన రెండంతస్తుల ఇళ్లలో ఇప్పటికి కొన్ని చెక్కు చెదరకుండా చక్కగా ఉన్నాయి. కొన్ని కప్పులు కూలిపోయి మొండిగోడలే మిగిలాయి. మరికొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇళ్ల మధ్య సందులు, గొందులు తీర్చిదిద్దినట్లుగా కనిపిస్తున్నాయి. ప్రజల మంచినీటి అవసరాల కోసం తవ్వించిన బావులు ఇప్పటికీ మన నీడలను నిర్మలంగా ప్రతిఫలిస్తున్నాయి. అయినా గ్రామంలో ఒక్క పురుగు కూడా కనిపించదు. రాజస్థాన్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన జైసల్మీర్ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్మానుష్యమైన ఈ గ్రామం ఇప్పుడు పురాతత్వ శాఖ పరిరక్షణలోకి వెళ్లింది. కుల్ధారగా చరిత్రలో నిలిచిపోయిన ఈ గ్రామానికి సంబంధించిన ఆసక్తికర కథలెన్నో ఇప్పుడు ప్రచారంలోకి వచ్చాయి. ‘రాత్రిపూట ఈ గ్రామంలో దెయ్యాల లాంటి ముసుగేసుకున్న రూపాలు తిరుగుతుంటాయి. అడుగుల శబ్దం వినిపించడం తప్ప కనిపించని అతీత శక్తులు కదలాడుతుంటాయి. మన చెవుల పక్క నోరుపెట్టి గుసగుసలాడుతున్న చీకటి శక్తులేవో మనతో మాట్లాడుతుంటాయి. మనం అక్కడ మొండి గోడల్లో భయం భయంగా నిండా కప్పుకొని నిద్రపోతే మసక రూపాలేవో వచ్చి మన దుప్పట్లను తొలగించి ముఖాలను చూసి పోతుంటాయి. మనిషి కనిపించని స్పర్శలేవో ఒంటికి చల్లగా తగులుతుంటాయి. ఇది నా బృందానికి ఎదురైన అనుభవాలు’ అని ‘ఇండియన్ పారానార్మల్ సొసైటీ (అతీత శక్తులపై పరిశోధనలు జరిపే సంస్థ)’ వ్యవస్థాపకులు గౌరవ్ తివారీ కొంత కాలం క్రితం చెప్పారు. అతీత శక్తుల ఆచూకీ కోసం.... అతీత శక్తుల చుట్టూ అల్లుకునే భ్రమలను తొలగించేందుకే తమ సొసైటీ ఏర్పాటైందని, కుల్దార గ్రామంలో మాత్రం ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి అందని వింత శబ్దాలు, అంతుచిక్కని అంశాలు ఎన్నో ఉన్నాయని గౌరవ్ తివారీ తెలిపారు. తాను అనేక బృందాలను అనేకసార్లు తీసుకొని వెళ్లి రాత్రిపూట కుల్దారా గ్రామంలో బస చేశానని, ఎప్పుడూ తమకు వింతైన అనుభవాలే కలిగేవని, ఒక్కోసారి అరుపులు. కేకలు కూడా వినిపించేవని, మనుషులు మాత్రం కనిపించేవారు కాదని ఆయన తెలిపారు. ఓసారి తాము తీసుకెళ్లిన వాహనాలన్నింటిపై తాము చూస్తుండగానే చిన్న పిల్ల అరచేతి ముద్రలు ప్రత్యక్షమయ్యాయని ఆయన చెప్పారు. అక్కడ తమకు కనిపించిన దృశ్యాలను, వినిపించిన శబ్దాలను, కనిపించీ కనిపించని, వినిపించీ వినిపించని దృశ్యాలను, ధ్వనులను పూర్తిస్థాయి స్పెక్ట్రమ్ కెమేరాలు, సీసీటీవీ కెమెరాలు, ఈఎంఎఫ్ మీటర్లు, ఈవీపీ రికార్డర్లు, థర్మల్ ఇమేజర్లు, మోషన్ సెన్సర్లు, రెమ్ పాడ్స్, స్టాటిక్ డిటెక్టర్లను ఉపయోగించి రికార్డు చేశామని తివారీ తెలిపారు. తివారీ ఆకస్మిక మరణం... తివారీ పరిశోధనలపై కొన్ని ఆంగ్ల పత్రికల్లో ప్రత్యేక కథనాలు వెలువడ్డాయి. కానీ దురదృష్టవశాత్తు ఇటీవల అనుమానాస్పద పరిస్థితుల్లో ఆయన మరణించారు. ఆయన మృతిపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఆయన వెల్లడించిన కథనం ప్రకారం: అది 1825వ సంవత్సరం. రక్షాబంధన్ రోజు, నాటి రాత్రి పున్నమి వెన్నల పుస్కలంగా విరగకాసింది. ప్రజలంతా ఆనందంగా పండుగ జరుపుకొనే సందర్భం. కానీ చుట్టుపక్కల 85 గ్రామాల్లో నివసిస్తున్న పాలివాల్ బ్రాహ్మణులు దాదాపు 1500 మంది కుల్ధార కూడలిలో సమావేశమయ్యారు. జైసల్మీర్ రాజ్యానికి చెందిన సలీమ్ సింగ్ అనే మంత్రి కుల్ధార గ్రామ పెద్ద కుమార్తెను ప్రేమించాడు. తనకు ఇచ్చి పెళ్లి చేయాలని గ్రామ పెద్దయిన పాలివాల్ బ్రాహ్మణ పెద్దను బెదిరించారు. లేకపోతే వ్యవసాయంపై బతికే పాలివాల్ బ్రాహ్మణులపై భారీగా సుంకాలు విధిస్తానని, రెండు రోజుల్లో నిర్ణయం తెలియజేయాలని హెచ్చరించారు. ఆ అంశాన్నే చర్చించేందుకే బ్రాహ్మణులంతా సమావేశమయ్యారు. వారి తెగకు చెందిన వారికి తప్ప మరో తెగ లేదా కులానికిచ్చే ఆనవాయితీ అప్పటికీ వారికి లేదు. 1500 మంది బ్రాహ్మణుల అదృశ్యం.. వారు ఆ రోజు అర్థరాత్రి వరకు చర్చించి ఏం నిర్ణయం తీసుకున్నారో తెలియదుగానీ, ఆ రోజు రాత్రి నుంచి వారిలో ఒక్కరు కూడా కనిపించకుండా అదృశ్యమయ్యారు. వారితోపాటు వారి కుటుంబసభ్యులు కూడా కట్టుబట్టలతో కనిపించకుండా పోయారు. ఇది చరిత్రలో ఇప్పటికీ అంతుచిక్కని విషయం. తివారీ వివరించిన ఈ చారిత్రక కథనాన్ని ‘ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా’ స్థానిక అధికారులు ధ్రువీకరించారు. అయితే రాత్రి పూట అతీంద్రియ శక్తులు తిరుగుతాయన్న అంశాన్ని మాత్రం వారు ఖండించారు. ప్రజల్లో అలాంటి విశ్వాసాలు ఉన్నాయని, తమకు మాత్రం అలాంటి అనుభవాలు ఎదురుకాలేదని వారు చెప్పారు. తాము పర్యాటకులను మాత్రం సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని చెప్పారు. అవన్నీ కట్టుకథలే కావచ్చు.. కుల్ధారలో అతీంద్రియ శక్తులు ఉన్నాయన్న విషయాన్ని ‘జైసల్మీర్ వికాస్ సమితి’ కార్యదర్శి చంద్ర ప్రకాష్ వ్యాస్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన కూడా ఖండించారు. తివారీ బృందం పరిశోధనల గురించి ప్రస్తావించగా ఆయనతోపాటు తాను కూడా కొన్ని రోజులు కుల్ధార గ్రామంలో రాత్రిపూట బస చేశానని, తనకు మాత్రం ఎలాంటి వింత శబ్దాలు వినిపించలేదని, వికృత రూపాలు కనిపించలేదని చెప్పారు. ఆరోజు అద్యశ్యమైన బ్రాహ్మణ కుటుంబాలు ఎక్కుడికి వెళ్లి ఉంటాయని ప్రశ్నించగా, కొన్ని కుటుంబాలు చెల్లాచెదురుగా రాజస్థాన్ ఇతర ప్రాంతాల్లో స్థిరపడి ఉండొచ్చని, మరికొన్ని కుటుంబాలు ఉత్తరప్రదేశ్, ఉత్తరఖండ్, బిహార్ రాష్ట్రాలకు వలసపోయి ఉంటాయని ఆయన చెప్పారు. పర్యాటకులను ఆకర్షించడం కోసం కొంత మంది ఉద్దేశపూర్వకంగా ఇలాంటి కథనాలను ప్రచారం చేసి ఉంటారని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అంతుచిక్కని రహస్యమే.. ఎడారి ప్రాంతమైన రాజస్థాన్‌లో అతి తక్కువ నీటిని ఉపయోగించి వ్యవసాయం చేయడంలో పాలివాల్ బ్రాహ్మణులు అనుభవజ్ఞులు. వారు గోధుమ పంటను ఎక్కువగా పండించేవారు. పాలి ప్రాంతం నుంచి వారి పూర్వీకులు రావడం వల్ల వారి పాలివాల్ బ్రాహ్మణులని పేరు వచ్చి ఉంటుందన్న చారిత్రక అంచనాలు కూడా ఉన్నాయి. వారు నేర్పిన వ్యవసాయం గురించి రాజస్థాన్ విద్యాలయాల్లో ఇప్పటికీ పాఠాలు చెబుతారు. వారు ఇక్కడి నుంచి ఏ ప్రాంతానికి వలస వెళ్లారో, వారి ఆనవాళ్లు ఎక్కడున్నాయో మాత్రం ఎప్పటికీ చరిత్రకందని రహస్యమే!