పింక్ సిటీ ఆఫ్ ఇండియా’గా గుర్తింపు పొందిన రాజస్థాన్ రాజధాని జైపూర్.. రాజప్రసాదాలకు, చారిత్రక కట్టడాలకు ఆలవాలం. అయితే ఇక్కడ హాంటెడ్ ప్లేసెస్ కూడా బాగానే హడలెత్తిస్తాయి. జైపూర్ విమానాశ్రయానికి 56 కి.మీ దూరంలో.. భాన్‌గఢ్‌కు సమీపంలో ఉన్న కోట పుకార్లతో భయపెడుతుంది.
ఇక్కడుండే నెగటివ్ ఎనర్జీ గురించి.. ఆత్మల గురించి.. చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా.. ‘సూర్యాస్తమయానికి, సూర్యోదయానికి మధ్య సమయంలో ఈ కోటలోకి అనుమతి లేదు’ అని బోర్డులు పెట్టిదంటే.. ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 17వ శతాబ్దంలో నిర్మించిన ఈ కోట.. పలు కార్యకలాపాలకు కేంద్రంగా నిలిచింది. ఈ కోట అందచందాల గురించి అద్భుతమైన వర్ణనలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
ఈ కథల్లో కొన్ని ఎంత ఆసక్తికరంగా ఉంటాయో.. అంతే వణికించేలా ఉంటాయి. ఇక్కడ ఈ కోటను కట్టడానికి ముందు ఆ దగ్గర్లో నివసించే ఓ సన్యాసి.. ‘కోట నీడ నా ఇంటిపై పడకూడదు’ అని ఓ షరతు పెట్టాడట. కానీ అలా జరగకపోవడంతో ఆ సన్యాసి దుష్టశక్తులను కోటలోకి ఆహ్వానిస్తూ శపించాడని చాలామంది చెబుతారు. ఒకనాటి భాన్‌గఢ్ యువరాణితో ప్రేమలో పడిన ఓ మాంత్రికుడి దుష్ట ఆత్మకు ఈ కోట నిలయంగా మారిందని మరికొందరు చెబుతారు.
ఈ కోట సమీపంలో ఏవో క్రూరమైన హత్యలు జరిగాయని.. ఆ హత్యకు గురైన బాధితులే ఆత్మలుగా మారి ఇక్కడ సంచరిస్తున్నాయని ఇంకొందరు అభిప్రాయం. ఒక స్నేహబృందం రహస్యంగా ఈ కోటలోకి ప్రవేశించి.. ఇక తిరిగి రాలేదనే ప్రచారం బాగా వినిపిస్తోంది. రాత్రి పూట మహిళల అరుపులు, ఏడుపులు, వింత వింత శబ్దాలు వినిపిస్తాయని స్థానికులు చెబుతుంటారు.
ఈ పుకార్లు వేటికీ ఆధారం లేకపోయినా పర్యాటకులకు మాత్రం ఈ ప్రాంగణంలో అసౌకర్య భావన కలుగుతూ ఉంటుంది. ఈ కోటలోకి వెళ్లిన చాలా మంది తమ వింత అనుభవాలను పంచుకుంటూ ఉంటారు. కోటలోంచి తిరిగి వచ్చినవారు.. ఏదో నీడ వెంటాడుతున్నట్లు, ఎవరో లాగినట్లు అనిపించిందని చెబుతుంటారు. ఏళ్లు గడిచినా.. ఈ కోటలోని మిస్టరీ ఏంటన్నది మాత్రం ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు.
∙సంహిత నిమ్మన
(చదవండి: జీవిత భాగస్వామి విషయంలో ఆ తప్పిదమే ఆ సైనికుడి జీవితాన్ని..!)
Comments
Please login to add a commentAdd a comment