గజ్జెల చప్పుడు.. చెవిలో గుసగుసలు | an abandoned, hanuted village in rajasthan | Sakshi
Sakshi News home page

గజ్జెల చప్పుడు.. చెవిలో గుసగుసలు

Published Fri, Jan 13 2017 4:46 PM | Last Updated on Tue, Sep 5 2017 1:11 AM

an abandoned, hanuted village in rajasthan

 
► మనిషి కనిపించరు.. ఒంటికి చల్లగా తగిలే స్పర్శలు
► గుసగుసలాడుతూ మనుషులతో మాట్లాడే చీకటి శక్తులు
► దుప్పట్లు తొలగించి ముఖాలు చూసే మసక రూపాలు
► గ్రామం మొత్తం నిర్మానుష్యం
► రాజస్థాన్‌లోని కుల్ధార గ్రామం వింత గాధ
 
జైపూర్‌: ఆ గ్రామంలో 200 ఏళ్ల క్రితం చక్కగా ఇటుకలతో కట్టిన రెండంతస్తుల ఇళ్లలో ఇప్పటికి కొన్ని చెక్కు చెదరకుండా చక్కగా ఉన్నాయి. కొన్ని కప్పులు కూలిపోయి మొండిగోడలే మిగిలాయి. మరికొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇళ్ల మధ్య సందులు, గొందులు తీర్చిదిద్దినట్లుగా కనిపిస్తున్నాయి. ప్రజల మంచినీటి అవసరాల కోసం తవ్వించిన బావులు ఇప్పటికీ మన నీడలను నిర్మలంగా ప్రతిఫలిస్తున్నాయి. అయినా గ్రామంలో ఒక్క పురుగు కూడా కనిపించదు. రాజస్థాన్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన జైసల్మీర్‌ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్మానుష్యమైన ఈ గ్రామం ఇప్పుడు పురాతత్వ శాఖ పరిరక్షణలోకి వెళ్లింది. కుల్ధారగా చరిత్రలో నిలిచిపోయిన ఈ గ్రామానికి సంబంధించిన ఆసక్తికర కథలెన్నో ఇప్పుడు ప్రచారంలోకి వచ్చాయి.
 
‘రాత్రిపూట ఈ గ్రామంలో దెయ్యాల లాంటి ముసుగేసుకున్న రూపాలు తిరుగుతుంటాయి. అడుగుల శబ్దం  వినిపించడం తప్ప కనిపించని అతీత శక్తులు కదలాడుతుంటాయి. మన చెవుల పక్క నోరుపెట్టి గుసగుసలాడుతున్న చీకటి శక్తులేవో మనతో మాట్లాడుతుంటాయి. మనం అక్కడ మొండి గోడల్లో భయం భయంగా నిండా కప్పుకొని నిద్రపోతే మసక రూపాలేవో వచ్చి మన దుప్పట్లను తొలగించి ముఖాలను చూసి పోతుంటాయి. మనిషి కనిపించని స్పర్శలేవో ఒంటికి చల్లగా తగులుతుంటాయి. ఇది నా బృందానికి ఎదురైన అనుభవాలు’ అని ‘ఇండియన్‌ పారానార్మల్‌ సొసైటీ (అతీత శక్తులపై పరిశోధనలు జరిపే సంస్థ)’ వ్యవస్థాపకులు గౌరవ్‌ తివారీ కొంత కాలం క్రితం చెప్పారు. 
అతీత శక్తుల ఆచూకీ కోసం....
అతీత శక్తుల చుట్టూ అల్లుకునే భ్రమలను తొలగించేందుకే తమ సొసైటీ ఏర్పాటైందని, కుల్దార గ్రామంలో మాత్రం ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి అందని వింత శబ్దాలు, అంతుచిక్కని అంశాలు ఎన్నో ఉన్నాయని గౌరవ్‌ తివారీ తెలిపారు. తాను అనేక బృందాలను అనేకసార్లు తీసుకొని వెళ్లి రాత్రిపూట కుల్దారా గ్రామంలో బస చేశానని, ఎప్పుడూ తమకు వింతైన అనుభవాలే కలిగేవని, ఒక్కోసారి అరుపులు. కేకలు కూడా వినిపించేవని, మనుషులు మాత్రం కనిపించేవారు కాదని ఆయన తెలిపారు. ఓసారి తాము తీసుకెళ్లిన వాహనాలన్నింటిపై తాము చూస్తుండగానే చిన్న పిల్ల అరచేతి ముద్రలు ప్రత్యక్షమయ్యాయని ఆయన చెప్పారు. అక్కడ తమకు కనిపించిన దృశ్యాలను, వినిపించిన శబ్దాలను, కనిపించీ కనిపించని, వినిపించీ వినిపించని దృశ్యాలను, ధ్వనులను పూర్తిస్థాయి స్పెక్ట్రమ్‌ కెమేరాలు, సీసీటీవీ కెమెరాలు, ఈఎంఎఫ్‌ మీటర్లు, ఈవీపీ రికార్డర్లు, థర్మల్‌ ఇమేజర్లు, మోషన్‌ సెన్సర్లు, రెమ్‌ పాడ్స్‌, స్టాటిక్‌ డిటెక్టర్లను ఉపయోగించి రికార్డు చేశామని తివారీ తెలిపారు. 
తివారీ ఆకస్మిక మరణం...
తివారీ పరిశోధనలపై కొన్ని ఆంగ్ల పత్రికల్లో ప్రత్యేక కథనాలు వెలువడ్డాయి. కానీ దురదృష్టవశాత్తు ఇటీవల అనుమానాస్పద పరిస్థితుల్లో ఆయన మరణించారు. ఆయన మృతిపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఆయన వెల్లడించిన కథనం ప్రకారం: అది 1825వ సంవత్సరం. రక్షాబంధన్‌ రోజు, నాటి రాత్రి పున్నమి వెన్నల పుస్కలంగా విరగకాసింది. ప్రజలంతా ఆనందంగా పండుగ జరుపుకొనే సందర్భం. కానీ చుట్టుపక్కల 85 గ్రామాల్లో నివసిస్తున్న పాలివాల్‌ బ్రాహ్మణులు దాదాపు 1500 మంది కుల్ధార కూడలిలో సమావేశమయ్యారు. జైసల్మీర్‌ రాజ్యానికి చెందిన సలీమ్‌ సింగ్‌ అనే మంత్రి కుల్ధార గ్రామ పెద్ద కుమార్తెను ప్రేమించాడు. తనకు ఇచ్చి పెళ్లి చేయాలని గ్రామ పెద్దయిన పాలివాల్‌ బ్రాహ్మణ పెద్దను బెదిరించారు. లేకపోతే వ్యవసాయంపై బతికే పాలివాల్‌ బ్రాహ్మణులపై భారీగా సుంకాలు విధిస్తానని, రెండు రోజుల్లో నిర్ణయం తెలియజేయాలని హెచ్చరించారు. ఆ అంశాన్నే చర్చించేందుకే బ్రాహ్మణులంతా సమావేశమయ్యారు. వారి తెగకు చెందిన వారికి తప్ప మరో తెగ లేదా కులానికిచ్చే ఆనవాయితీ అప్పటికీ వారికి లేదు. 
1500 మంది బ్రాహ్మణుల అదృశ్యం..
వారు ఆ రోజు అర్థరాత్రి వరకు చర్చించి ఏం నిర్ణయం తీసుకున్నారో తెలియదుగానీ, ఆ రోజు రాత్రి నుంచి వారిలో ఒక్కరు కూడా కనిపించకుండా అదృశ్యమయ్యారు. వారితోపాటు వారి కుటుంబసభ్యులు కూడా కట్టుబట్టలతో కనిపించకుండా పోయారు. ఇది చరిత్రలో ఇప్పటికీ అంతుచిక్కని విషయం. తివారీ వివరించిన ఈ చారిత్రక కథనాన్ని ‘ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా’ స్థానిక అధికారులు ధ్రువీకరించారు. అయితే రాత్రి పూట అతీంద్రియ శక్తులు తిరుగుతాయన్న అంశాన్ని మాత్రం వారు ఖండించారు. ప్రజల్లో అలాంటి విశ్వాసాలు ఉన్నాయని, తమకు మాత్రం అలాంటి అనుభవాలు ఎదురుకాలేదని వారు చెప్పారు. తాము పర్యాటకులను మాత్రం సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని చెప్పారు. 
 
అవన్నీ కట్టుకథలే కావచ్చు..
కుల్ధారలో అతీంద్రియ శక్తులు ఉన్నాయన్న విషయాన్ని ‘జైసల్మీర్‌ వికాస్‌ సమితి’ కార్యదర్శి చంద్ర ప్రకాష్‌ వ్యాస్‌ దృష్టికి తీసుకెళ్లగా ఆయన కూడా ఖండించారు. తివారీ బృందం పరిశోధనల గురించి ప్రస్తావించగా ఆయనతోపాటు తాను కూడా కొన్ని రోజులు కుల్ధార గ్రామంలో రాత్రిపూట బస చేశానని, తనకు మాత్రం ఎలాంటి వింత శబ్దాలు వినిపించలేదని, వికృత రూపాలు కనిపించలేదని చెప్పారు. ఆరోజు అద్యశ్యమైన బ్రాహ్మణ కుటుంబాలు ఎక్కుడికి వెళ్లి ఉంటాయని ప్రశ్నించగా, కొన్ని కుటుంబాలు చెల్లాచెదురుగా రాజస్థాన్‌ ఇతర ప్రాంతాల్లో స్థిరపడి ఉండొచ్చని, మరికొన్ని కుటుంబాలు ఉత్తరప్రదేశ్, ఉత్తరఖండ్, బిహార్‌ రాష్ట్రాలకు వలసపోయి ఉంటాయని ఆయన చెప్పారు. పర్యాటకులను ఆకర్షించడం కోసం కొంత మంది ఉద్దేశపూర్వకంగా ఇలాంటి కథనాలను ప్రచారం చేసి ఉంటారని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 
 
అంతుచిక్కని రహస్యమే..
ఎడారి ప్రాంతమైన రాజస్థాన్‌లో అతి తక్కువ నీటిని ఉపయోగించి వ్యవసాయం చేయడంలో పాలివాల్‌ బ్రాహ్మణులు అనుభవజ్ఞులు. వారు గోధుమ పంటను ఎక్కువగా పండించేవారు. పాలి ప్రాంతం నుంచి వారి పూర్వీకులు రావడం వల్ల వారి పాలివాల్‌ బ్రాహ్మణులని పేరు వచ్చి ఉంటుందన్న చారిత్రక అంచనాలు కూడా ఉన్నాయి. వారు నేర్పిన వ్యవసాయం గురించి రాజస్థాన్‌ విద్యాలయాల్లో ఇప్పటికీ పాఠాలు చెబుతారు. వారు ఇక్కడి నుంచి ఏ ప్రాంతానికి వలస వెళ్లారో, వారి ఆనవాళ్లు ఎక్కడున్నాయో మాత్రం ఎప్పటికీ చరిత్రకందని రహస్యమే! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement