ఇదేదో హారర్ సినిమా పేరు కాదు. ఇటలీలో ఉన్న ఈ దీవి నిజంగానే దయ్యాల దీవిగా పేరు మోసింది. దాదాపు అర్ధశతాబ్దంగా ఇక్కడ నరమానవులెవరూ నివాసం ఉండటం లేదు. ఈ దీవిలోని నేల కింద 1.60 లక్షలకు పైగా శవాలు సమాధి అయి ఉన్నాయి. ఇటలీ ఉత్తర ప్రాంతంలో వెనిస్–లిడో నగరాల మధ్య ఉన్న ఈ దీవి పేరు పోవెగ్లియా. ప్రత్యేక అనుమతి ఉంటేనే తప్ప ఈ దీవిలో సందర్శకులెవరూ అడుగు పెట్టలేరు. ఒకప్పుడు ఈ దీవి మానసిక రోగుల చికిత్స స్థావరంగా ఉండేది. ఇక్కడి మానసిక చికిత్స కేంద్రంలో పనిచేసే ఒక డాక్టర్ రోగులపై క్రూరాతి క్రూరమైన ప్రయోగాలు చేసేవాడు. అప్పట్లో ఇక్కడ మరణించిన రోగులను ఇక్కడే పాతిపెట్టేశారు.
ఇక్కడి మానసిక చికిత్స కేంద్రం 1968లో మూతబడిన తర్వాత ఈ దీవి పూర్తిగా ఖాళీ అయిపోయింది. మూతబడిన కొత్తలో కొందరు సాహసికులు ఈ దీవిలోకి వచ్చి, అంతా కలియదిరిగి వెళ్లిపోయేవారు. కొంతకాలానికి ఈ దీవిలోకి జనాల ప్రవేశాన్ని నిషేధించారు. ఇప్పటికీ ఈ నిషేధం అమలులో ఉంది. పరిశోధనల వంటి కారణాల కోసమైతే ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి పొంది మాత్రమే ఇక్కడకు చేరుకోవాల్సి ఉంటుంది. ఇటీవల బ్రిటిష్ పరిశోధకులు మ్యాట్ నాడిన్, ఆండీ థామ్సన్ ఇటలీ ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి పొంది, ఈ దీవిలోకి అడుగుపెట్టారు.
శిథిలావస్థకు చేరుకున్న మానసిక రోగుల ఆస్పత్రి, చుట్టుపక్కల ఉన్న ఇతర శిథిల నిర్మాణాలు, చుట్టూ కీకారణ్యంలా పెరిగిన చెట్లు, మొక్కలు, కట్టడాల మధ్యలో మొలిచిన ఊడల మర్రిచెట్లు వంటివాటిని వీడియో తీసి తమ యూట్యూబ్ చానల్‌లో పెట్టడంతో ఈ దీవి కథ వైరల్‌గా మారింది. ఈ దీవిలో 1922లో మానసిక చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
అంతకు ముందు 1793లో ఒకసారి, 1814లో మరోసారి ప్లేగు మహమ్మారి విజృంభించినప్పుడు ఈ దీవిని క్వారంటైన్ కేంద్రంగా నిర్వహించేవారు. ప్లేగుతో చనిపోయినవారిని, ఆ తర్వాత మానసిక చికిత్స కేంద్రంలో డాక్టర్ ప్రయోగాలకు ప్రాణాలు కోల్పోయినవారిని ఇక్కడి నేలలోనే పూడ్చిపెట్టేశారు. వారి ఆత్మలు ఇక్కడ సంచరిస్తుంటాయని ప్రచారం జరగడంతో ఇక్కడి మానసిక చికిత్స కేంద్రం మూతబడిన తర్వాత ఈ దీవి పూర్తిగా నిరుపయోగంగానే మిగిలిపోయింది.
(చదవండి: బ్లాక్ యాపిల్ గురించి విన్నారా? ఒక్కొక్కటి ఏకంగా..)
Comments
Please login to add a commentAdd a comment