50 ఏళ్ల తర్వాత తన ఫస్ట్ లవ్‌ని కలవబోతున్న తాత (ఫోటో కర్టెసీ: ఇండియా టుడే)
జైపూర్: ప్రేమ గుడ్డిది.. సరిహద్దులు లేవు.. కులం, మతం లేదు అంటే.. ఆ.. అవన్ని పుస్తకాల్లోనే.. రియల్‌గా కాదు అనుకునే వారు చాలా మంది. కానీ పై వాఖ్యాలను నిజం చేసే ఘటనలు కోకొల్లలు మన సమాజంలో. దీనికి నిదర్శనంగా నిలిచే సంఘటన మరొకటి రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. 82 ఏళ్ల వయసులో ఓ వృద్ధుడు దాదాపు 50 ఏళ్ల క్రితం దూరమైన తన ప్రేమికురాలిని తిరిగి కలవబోతున్నాడు. ఈ విషయాన్ని చెబుతున్నప్పుడు ఆ తాత కళ్లల్లో సంతోషం వర్ణించడానికి మాటలు చాలవు. ఇంతకు ఆ ప్రేమ కథ వివరాలు ఏంటో చూడండి..
తొలి చూపులోనే ప్రేమలో పడ్డాను...
ప్రస్తుతం రాజస్తాన్ జైసల్మేర్‌లోని హాంటెడ్ గ్రామం కుల్ధారా గేట్ కీపర్‌గా పని చేస్తున్నాడు సదరు వృద్థుడు. తన లవ్ స్టోరి గురించి చెబుతూ.. ‘‘1970లో తొలిసారి మెరినాను చూశాను. తొలి చూపులోనే ప్రేమలో పడ్డానంటారే.. మా విషయంలో కూడా ఇదే జరిగింది. ఐదు రోజుల పర్యటన నిమిత్తం ఆస్ట్రేలియా నుంచి జైసల్మేర్ వచ్చిన మెరినాను చూడగానే నేను ప్రేమలో పడ్డాను. తను కూడా అంతే. ఇక వెళ్లిపోయే ముందు తను నాకు ప్రపోజ్ చేసింది. మెరినా ‘‘ఐ లవ్ యూ’’ అన్నప్పుడు నా ముఖం సిగ్గుతో ఎర్రబడింది’’ అంటూ ఇప్పుడు కూడా సిగ్గు పడ్డాడు తాత.
రూ. 30 వేలు అప్పు చేసి మరి...
‘‘ఆ తర్వాత కూడా మేం కాంటాక్ట్‌లోనే ఉన్నాం. ఒకరికొకరం ఉత్తరాలు రాసుకునే వాళ్లం. ఓ సారి తనను చూడాలనిపించింది. దాంతో 30 వేల రూపాయలు అప్పు చేసి మరి ఆస్ట్రేలియా వెళ్లాను. మూడు నెలల పాటు అక్కడే ఉన్నాను. నా జీవితంలో అత్యంత మధురమైన క్షణాలు అంటే అవే. తను నాకు ఇంగ్లీష్ నేర్పితే.. నేను తనకు మా భాష నేర్పాను. ఆ మూడు నెలలు చాలా సంతోషంగా గడిచిపోయాయి’’ అంటూ నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు.
అలా విడిపోవాల్సి వచ్చింది...
‘‘ఆస్ట్రేలియాలో ఉండగా ఓ రోజు మెరినా ‘‘పెళ్లి చేసుకుందాం.. ఇక్కడే ఉండిపో’’ అన్నది. కానీ అది జరిగే పని కాదు. నా కుటుంబాన్ని వదిలి అక్కడే స్థిరపడలేను. అలా అని తను నా కోసం ఆస్ట్రేలియా విడిచి రాలేదు. దాంతో తప్పని సరి పరిస్థితుల్లో మేం విడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కుటుంబ ఒత్తిడి మీద నేను పెళ్లి చేసుకున్నాను. ఈ గేట్ కీపర్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. అప్పుడప్పుడు మెరినా గురించి ఆలోచించేవాడిని. తను వివాహం చేసుకుందా.. ఎలా ఉంది.. ఒక్కసారి చూస్తే బాగుండు అనుకునే వాడిని. కాలక్రమేణా తన ఆలోచనలు కూడా తగ్గిపోయాయి’’ అన్నాడు.
అద్భుతం జరిగింది...
‘‘ఇలా కొనసాగుతన్న నా జీవితంలో ఓ అద్భుతం జరిగింది. నెల రోజుల క్రితం మెరినా నాకు ఉత్తరం రాసింది.. ఎలా ఉన్నావ్ నేస్తమా అంటూ కుశల ప్రశ్నలు వేసింది. ఆ లేఖ చూసి నేను ఎంత ఆశ్చర్యానికి గురయ్యానో మాటల్లో చెప్పలేను. ఇది కలా.. నిజమా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. దాదాపు 50 ఏళ్ల తర్వాత నేను నా తొలి ప్రేమను లేఖ రూపంలో తిరిగి కలుసుకున్నాను. ఆ తర్వాత నుంచి మేం ప్రతి రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం’’ అని చెబుతూ తాత తెగ సంబరపడ్డాడు.
తను పెళ్లి చేసుకోలేదు...
‘‘మెరినాకు వివాహం కాలేదని తెలిసింది. త్వరలోనే తను ఇండియా రాబోతుంది. ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నాకు ఎలా ఉందంటే.. దేవుడి మీద ఒట్టు నాకు నేనే 21 ఏళ్ల కుర్రాడిలా అనిపిస్తున్నాను. తనను ఎప్పుడు చూస్తానా అని మనసు ఉవ్విళ్లురూతుంది. మా భవిష్యత్ ఎలా ఉండనుందో నాకు తెలియదు. కానీ నా ఫస్ట్ లవ్‌ని తిరిగి కలుసుకోబోతున్నాను. తను తిరిగి నా జీవితంలోకి రాబోతుంది. తనతో ప్రతి రోజు మాట్లాడటం ఎంత సంతోషంగా ఉందో మాటాల్లో వర్ణించలేను’’ అని చెబుతూ తాత తెగ సంబరపడిపోతున్నాడు.
హ్యూమన్స్‌బాంబే తన ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన ఈ స్టోరి ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ట్రూ లవ్.. ఫస్ట్ లవ్ ఎఫెక్ట్ ఇదే.. తాతా నువ్వు కేక.. యూత్‌కు పోటిగా వస్తున్నావ్ కదా.. మెరినా మేడం వచ్చాక మీ ఇద్దరి ఫోటో షేర్ చేయ్ ప్లీజ్ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు.
చదవండి:
ఆమె కోసం ఇల్లు అమ్మేసి... ఆటోలోనే తిండి, నిద్ర
గుండె పగిలినట్లు అనిపిస్తుంది.. కానీ..
Comments
Please login to add a commentAdd a comment