Gate keeper
-
82 ఏళ్ల తాత ఎగిరి గంతేశాడు.. కారణం ఏంటంటే!
యాభై ఏళ్ల తరువాత ఫస్ట్ లవ్ ను కలుసుకోబోతున్నందుకు 82 ఏళ్ల తాత ఎగిరి గంతేస్తున్నాడు. రాజస్థాన్‌లోని కులధార గ్రామంలో గేట్ కీపర్ గా పనిచేస్తోన్న తాత 30 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియా నుంచి వచ్చిన మరీనాతో ప్రేమలో పడ్డాడు. ఆమె కూడా తాతను ప్రేమించింది. వాళ్ల ప్రేమకు పెద్దవాళ్లు అడ్డుచెప్పలేదు, కానీ ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరక పోవడంతో విడిపోయారు. ఇది జరిగి 50 ఏళ్లు అయింది. తాజాగా మరీనా తాతకు ‘హౌ ఆర్ యూ, మై ఫ్రెండ్’ అని లెటర్ రాస్తూ...‘త్వరలో ఇండియా వచ్చి నిన్ను కలుస్తాను’ అని చెప్పడంతో తాత ఆనందానికి అవధులు లేకుండా పోయాయ్. పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ 82 ఏళ్ల వ్యక్తి రాజస్థాన్‌లోని కులధార గ్రామంలో గేట్ కీపర్‌గా పనిచేస్తున్నాడు. 30 లలో ఉన్నప్పుడు అతను ప్రేమలో పడ్డాడు. అది 1970. ఓ ఐదురోజుల పర్యటనలో భాగంగా మరీనా అనే అమ్మాయి ఆస్ట్రేలియా నుంచి జైసల్మీర్‌ను చూసేందుకు వచ్చింది. తాతా, మరీనా అనుకోకుండా ఎదురు పడ్డారు. కళ్లూ కళ్లూ కలిశాయి. అంతే! తొలిచూపులోనే ఒకరితో ఒకరు పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయారు. అయితే ఇద్దరూ ఇష్టపడినప్పటికీ ..ఐదురోజులు ఒకరినొకరు చూసుకుంటూ గడిపారు. మరీనా పర్యటన ముగియడంతో ఆస్ట్రేలియా తిరిగి వెళ్తూ.. తాతకు ‘ఐ లవ్ యూ’ అని చెప్పి, తన అడ్రస్ ఇచ్చింది. ఆ తరువాత ఇద్దరూ ఒకరికొకరు ఉత్తరాలు రాసుకుంటూ ఉండేవారు. ఉత్తరాలతో వారి ప్రేమ మరింత బలపడడంతో.. మరీ నా తాతను ఆస్ట్రేలియా రమ్మని పిలిచింది మరీ నా. పిలిచిన వెంటనే తాత రెక్కలు కట్టుకుని మరీ ఆస్ట్రేలియాలో వాలిపోయాడు.అక్కడ ఓ మూడు నెలలపాటు ఎంతో ఆనందంగా గడిపారు ఇద్దరూ. ఆ తరువాత మరీనా తాతను పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండమని అడిగినప్పుడు పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. తాత ఇండియా వదిలివెళ్లడానికి ఇష్టపడలేదు, మరీనా కూడా ఆస్ట్రేలియా వదిలి ఇండియాలో ఉండడానికి ఇష్టపడలేదు. దీంతో ఇద్దరూ దీర్ఘకాలం కలిసి ఉండడం కుదరదని నిశ్చయించుకుని విడిపోయారు.విడిపోవడం ఇద్దరికీ ఇష్టంలేకపోయినా తమ తమ దేశాలను వదిలి వెళ్లలేక ఇద్దరూ ప్రేమకు దూరమయ్యారు. ఆ తరువాత ఇద్దరూ తనకి పెళ్లి అయ్యిందా? నేను గుర్తుంటానా? అని అనుకునేవారు. ఇది ఇలా కొనసాగుతుండగానే కులధారలో తాతకు గేట్‌కీపర్ ఉద్యోగం దొరికింది. దీంతో ఇంట్లో వాళ్లు పెళ్లిచేసుకోమని ఒత్తిడి చేయడంతో తాత మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు కలగడంతో వారికి మంచి భవిష్యత్ అందించే క్రమంలో మునిగిపోయారు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలూ పెద్దయ్యారు. రెండేళ్ల క్రితం తాత భార్య మరణించింది. సంసార సాగరంలో తాత పడిపోయినప్పటికీ మరీనా పెళ్లి అయి ఉంటుందా? తనని నేను మళ్లీ కలుసుకోగలనా? అనుకుంటూ ఉండేవాడు. అయితే ఇక్కడితో తాత ఫస్ట్ లవ్‌స్టోరీ ముగిసిపోలేదు. రెండు నెలల క్రితం తాతకు మరీనా నుంచి ఒక ఉత్తరం వచ్చింది. దానిలో ‘‘హౌ ఆర్ యూ, మై ఫ్రెండ్? నేను ఇప్పటిదాకా ఎవర్నీ పెళ్లి చేసుకోలేదు. త్వరలోనే ఇండియా వస్తున్నాను’’ అని చెప్పింది. యాభై ఏళ్ల తరువాత కూడా మరీనా తనని గుర్తుపెట్టుకోవడంతో.. తాత ఆశ్చర్యానందాలలో మునిగి తేలాడు. ఉత్తరం వచ్చినప్పటి నుంచి ఇద్దరూ లవ్ బర్డ్స్‌లా రోజూ ఫోన్లో మాట్లాడుకుంటూ తమ బంధాన్ని మరింత దృఢపరుచుకున్నారు. తాత ఈ విషయాన్నీ ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ వారితో పంచుకోవడంతో 50 ఏళ్ల నాటి ప్రేమ వెలుగులోకి వచ్చింది. తాత మాట్లాడుతూ..‘‘మరీనా మళ్లీ నా దగ్గరకొస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు నా మనసు 21 ఏళ్ల కుర్రాడిలా పరుగులు పెడుతోంది. అయితే భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ ఇప్పటికీ నా ఫస్ట్ లవ్ ఆరోగ్యంగా, సజీవంగా ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది’’ అని తాత ఆనందం వ్యక్తం చేశాడు. ఈ విషయం సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతుండడంతో నువ్వు గ్రేట్ తాత! అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. -
50 ఏళ్ల తర్వాత ప్రియురాలిని కలవనున్న తాత..
జైపూర్: ప్రేమ గుడ్డిది.. సరిహద్దులు లేవు.. కులం, మతం లేదు అంటే.. ఆ.. అవన్ని పుస్తకాల్లోనే.. రియల్‌గా కాదు అనుకునే వారు చాలా మంది. కానీ పై వాఖ్యాలను నిజం చేసే ఘటనలు కోకొల్లలు మన సమాజంలో. దీనికి నిదర్శనంగా నిలిచే సంఘటన మరొకటి రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. 82 ఏళ్ల వయసులో ఓ వృద్ధుడు దాదాపు 50 ఏళ్ల క్రితం దూరమైన తన ప్రేమికురాలిని తిరిగి కలవబోతున్నాడు. ఈ విషయాన్ని చెబుతున్నప్పుడు ఆ తాత కళ్లల్లో సంతోషం వర్ణించడానికి మాటలు చాలవు. ఇంతకు ఆ ప్రేమ కథ వివరాలు ఏంటో చూడండి.. తొలి చూపులోనే ప్రేమలో పడ్డాను... ప్రస్తుతం రాజస్తాన్ జైసల్మేర్‌లోని హాంటెడ్ గ్రామం కుల్ధారా గేట్ కీపర్‌గా పని చేస్తున్నాడు సదరు వృద్థుడు. తన లవ్ స్టోరి గురించి చెబుతూ.. ‘‘1970లో తొలిసారి మెరినాను చూశాను. తొలి చూపులోనే ప్రేమలో పడ్డానంటారే.. మా విషయంలో కూడా ఇదే జరిగింది. ఐదు రోజుల పర్యటన నిమిత్తం ఆస్ట్రేలియా నుంచి జైసల్మేర్ వచ్చిన మెరినాను చూడగానే నేను ప్రేమలో పడ్డాను. తను కూడా అంతే. ఇక వెళ్లిపోయే ముందు తను నాకు ప్రపోజ్ చేసింది. మెరినా ‘‘ఐ లవ్ యూ’’ అన్నప్పుడు నా ముఖం సిగ్గుతో ఎర్రబడింది’’ అంటూ ఇప్పుడు కూడా సిగ్గు పడ్డాడు తాత. రూ. 30 వేలు అప్పు చేసి మరి... ‘‘ఆ తర్వాత కూడా మేం కాంటాక్ట్‌లోనే ఉన్నాం. ఒకరికొకరం ఉత్తరాలు రాసుకునే వాళ్లం. ఓ సారి తనను చూడాలనిపించింది. దాంతో 30 వేల రూపాయలు అప్పు చేసి మరి ఆస్ట్రేలియా వెళ్లాను. మూడు నెలల పాటు అక్కడే ఉన్నాను. నా జీవితంలో అత్యంత మధురమైన క్షణాలు అంటే అవే. తను నాకు ఇంగ్లీష్ నేర్పితే.. నేను తనకు మా భాష నేర్పాను. ఆ మూడు నెలలు చాలా సంతోషంగా గడిచిపోయాయి’’ అంటూ నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. అలా విడిపోవాల్సి వచ్చింది... ‘‘ఆస్ట్రేలియాలో ఉండగా ఓ రోజు మెరినా ‘‘పెళ్లి చేసుకుందాం.. ఇక్కడే ఉండిపో’’ అన్నది. కానీ అది జరిగే పని కాదు. నా కుటుంబాన్ని వదిలి అక్కడే స్థిరపడలేను. అలా అని తను నా కోసం ఆస్ట్రేలియా విడిచి రాలేదు. దాంతో తప్పని సరి పరిస్థితుల్లో మేం విడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కుటుంబ ఒత్తిడి మీద నేను పెళ్లి చేసుకున్నాను. ఈ గేట్ కీపర్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. అప్పుడప్పుడు మెరినా గురించి ఆలోచించేవాడిని. తను వివాహం చేసుకుందా.. ఎలా ఉంది.. ఒక్కసారి చూస్తే బాగుండు అనుకునే వాడిని. కాలక్రమేణా తన ఆలోచనలు కూడా తగ్గిపోయాయి’’ అన్నాడు. అద్భుతం జరిగింది... ‘‘ఇలా కొనసాగుతన్న నా జీవితంలో ఓ అద్భుతం జరిగింది. నెల రోజుల క్రితం మెరినా నాకు ఉత్తరం రాసింది.. ఎలా ఉన్నావ్ నేస్తమా అంటూ కుశల ప్రశ్నలు వేసింది. ఆ లేఖ చూసి నేను ఎంత ఆశ్చర్యానికి గురయ్యానో మాటల్లో చెప్పలేను. ఇది కలా.. నిజమా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. దాదాపు 50 ఏళ్ల తర్వాత నేను నా తొలి ప్రేమను లేఖ రూపంలో తిరిగి కలుసుకున్నాను. ఆ తర్వాత నుంచి మేం ప్రతి రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం’’ అని చెబుతూ తాత తెగ సంబరపడ్డాడు. తను పెళ్లి చేసుకోలేదు... ‘‘మెరినాకు వివాహం కాలేదని తెలిసింది. త్వరలోనే తను ఇండియా రాబోతుంది. ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నాకు ఎలా ఉందంటే.. దేవుడి మీద ఒట్టు నాకు నేనే 21 ఏళ్ల కుర్రాడిలా అనిపిస్తున్నాను. తనను ఎప్పుడు చూస్తానా అని మనసు ఉవ్విళ్లురూతుంది. మా భవిష్యత్ ఎలా ఉండనుందో నాకు తెలియదు. కానీ నా ఫస్ట్ లవ్‌ని తిరిగి కలుసుకోబోతున్నాను. తను తిరిగి నా జీవితంలోకి రాబోతుంది. తనతో ప్రతి రోజు మాట్లాడటం ఎంత సంతోషంగా ఉందో మాటాల్లో వర్ణించలేను’’ అని చెబుతూ తాత తెగ సంబరపడిపోతున్నాడు. హ్యూమన్స్బాంబే తన ఫేస్బుక్లో షేర్ చేసిన ఈ స్టోరి ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ట్రూ లవ్.. ఫస్ట్ లవ్ ఎఫెక్ట్ ఇదే.. తాతా నువ్వు కేక.. యూత్‌కు పోటిగా వస్తున్నావ్ కదా.. మెరినా మేడం వచ్చాక మీ ఇద్దరి ఫోటో షేర్ చేయ్ ప్లీజ్ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: ఆమె కోసం ఇల్లు అమ్మేసి... ఆటోలోనే తిండి, నిద్ర గుండె పగిలినట్లు అనిపిస్తుంది.. కానీ.. -
‘బొమ్మ’..బోల్తా
వారిది బతుకంతా సినిమా..కాదు, కాదు సినిమానే బతుకు. బాక్సు తెచ్చిన దగ్గరనుంచి రీల్ కదిలే వరకూ..అందరికీ థియేటరే దేవాలయం. భారీ వ్యయంతో దాన్ని నిర్మించిన యజమానులు మొదటి నుంచి గేట్‌కీపర్, బుకింగ్ క్లర్, మేనేజర్, ఇలా ఎన్నో పోస్టులు. అందరికీ ‘బొమ్మే’ ఆధారం. హాలులో రీల్ గిర్రుమంటేనే వారి జీవనం సాగేది. కొన్నేళ్లు పాటు ఈ రంగాన్ని నమ్ముకున్నవారు ఇప్పుడు ఆర్థికంగా చితికి పోతున్నారు. యజమానులదో బాధ, కార్మికులదో ఇబ్బంది. ఇలా జిల్లాలోని వేలాది కుటుంబాలు ‘థియేటర్లు’ నడవక పూటగడవని స్థితికి చేరుకుంటున్నాయి. కొందరు ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. ఉన్నవారు...మొదటి ఆటనుంచి చివరి ఆటవరకూ ఆశలు పెంచుకుంటూనే రోజును గడిపేస్తున్నారు. బతుకు గడవక అవస్థలు పడుతున్నారు. ఒకప్పుడు కొత్త సినిమా వచ్చిందంటే థియేటర్లు ప్రేక్షకులతో క ళకళ లాడుతుండేవి. సినిమాహాళ్ల యజమానులకు, కార్మికులకు చేతినిండా ఉపాధి లభించేది. ప్రస్తుతం పెద్ద హీరోల సినిమాలు వరుసగా వచ్చినా వారంకూడా ఆడటంలేదు. సినిమా విడుదలైన వారంలోపే పైరసీలు ఎక్కువై ప్రతి కంప్యూటర్లో, మొబైల్లో సినిమా ప్రత్యక్ష మవడంతో కలెక్షన్లు లేక వినోద కేంద్రాలు మూతపడుతున్నాయి. బుల్లితెరపై వచ్చే వినోద కార్యక్రమాలు కట్టి పడేస్తుండటం కూడా ఓ కారణంగా చెప్పవచ్చు. దీంతో సినిమా రంగంపై ఆధారపడి జీవించే కార్మికుల పొట్ట గడవడం కష్టంగా మారింది. నిర్వాహణ లోపమూ కారణం షాద్‌నగర్ : కొన్ని థియేటర ్లలో నిర్వాహణలోపంతో ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారు. 70 ఎంఎం ఏసీ థియేటర్ అని బయట పెద్దపెద్ద బోర్డులు కనిపిసున్నా లోపలమాత్రం ఫ్యాన్లుసైతం సరిగా తిరగవు. రెండున్నర గంటలు కాలక్షేపానికి వెళ్లిన ప్రేక్షకుడు ఉక్కపోతతో బయటకు వస్తున్నాడు. షాద్‌నగర్ పట్టణంలో ఐదు సినిమా థియేటర్లు ఉండగా వాటిలో రెండు మినహా మిగతా వాటిలో సౌకర్యాలు సరిగాలేవు. రూ. 35లున్న టికెక్టుపై రూ.50లను వసూలు చేస్తున్నారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు దుర్వాసన వెదజల్లుతున్నాయి. ఇక క్యాంటీన్లోని ధరలు బయటిదానికంటే రెట్టింపుగా ఉంటున్నాయి. దానికితోడు బ్లాక్ టికెట్ల బెడద. కొత్త సినిమా విడుదలయ్యిందంటే బ్లాక్‌లో టికెట్లు ఇట్ట అమ్ముడుబోతాయి. అభిమానులకు తగ్గట్టు ధర పెంచేస్తుంటారు. ఒక్కోసారి టికెట్ ధర రూ. 500లు కూడా మించిపోతుంది. ఈ కారణాలతో ప్రేక్షకులు వినోద కేంద్రాలకు వెళ్లడానికి వెనకాడుతున్నారు. పన్నెండేళ్లుగా.. పన్నెండేళ్లుగా సినిమా థియేటర్లో ఆపరేటర్‌గా పని చేస్తున్నా. ప్రస్తుతం నాకు రూ.5వేల జీతం ఇస్తారు. కుటుంబాన్ని పోషించేందుకు నాకు ఇదే జీవనాధారం. ధరలు పెరగడంతో ఇప్పుడిచ్చే జీతాలు సరిపోవడం లేదు. థియేటర్లు నడవడం కష్టమైన రోజుల్లో యాజమానులను డిమాండ్ చేయలేకపోతున్నాం. - బాబా, ఆపరేటర్ నా పిల్లలు కూడా ఇక్కడే.. నేను 30 ఏళ్ల నుంచి సినిమా థియేటర్లో గేట్‌కీపర్‌గా పనిచేస్తున్నా. మొదట్లో సినిమాకు మంచి డిమాండ్ ఉండటంతో అప్పట్లో వచ్చే జీతంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాళ్లం. నా ఇద్దరు కుమారులు కూడా ఇక్కడే పనిచేస్తున్నారు. నాకు ఇప్పుడు రూ. 3వేల జీతం. ప్రేక్షకులు లేకున్నా డ్యూటీ చేయాల్సిందే. - పాష, గేట్ కీపర్ సినిమా రంగాన్నే నమ్ముకున్నాం.. నేను రూ.350ల జీతం నుంచి పని చేస్తున్నా. కొన్నిరోజులు మేనేజర్‌గా పనిచేశా. ఆ థియేటర్ మూతబడటంతో ఖాళీ ఉండలేక రూ.5 వేలకు క్యాటీన్ నిర్వాహకునిగా పనిచేస్తున్నా. వచ్చే జీతంతో ఇంటి అద్దె, కుటుంబ పోషణకే సరిపోతుంది. ప్రభుత్వం మా కష్టాలను గుర్తించి ఆదుకోవాలి. - కె. శ్రీనివాస్, క్యాటీన్ మెన్ లాభాలులేక మూసేశాం సినిమా పరిశ్రమ ఖరాబైంది. లాభాలు ఒకప్పటిలా రావట్లేదు. డిస్టిబ్యూటర్లు అనుకుంటే లాభాలు. లేకుంటే లాసులు. నిర్వాహణ భారమై చేసేదేమి లేక థియేటర్‌ను మూసివేశాను. - సతీష్, జగదీష్ థియేటర్ నిర్వాహకుడు శాటిలైట్ షాక్ శాటిలైట్ విధానంతో వినోదకేంద్రాల నిర్వాహకులకు ఖర్చు పెరిగింది. ప్రతి ఐదు నెలలకోమారు శాటిలైట్ బల్బు మార్పుకు రూ.45వేలు, ష్లాబింగ్ సిట్టింగ్ డబ్బింగ్ సినిమాలకు వారానికి రూ. 8 నుంచి 9 వేలు, హైబడ్జెట్ సినిమాలకు రూ.5 వేల చొప్పున నెలకు కనీసం రూ.30 వేలు అవుతాయి. వారానికి ఒక రోజు ముందు తీసుకున్నా మొత్తం డబ్బులు కట్టాల్సిందే. కరెంట్ పోయినప్పుడు డీజిల్‌కు మరో రూ.5వేలు, విద్యుత్‌బిల్లు ఎంతలేదన్నా రూ.30 వేలు, సీట్లకు తగ్గ చార్జీలు, కార్మికుల వేతనాలకు రూ.1.50 లక్షలు అవుతాయి. ప్రతి ఏడాది మున్సిపాలిటీ, ఆర్అండ్బీ, ఫైర్, ఆర్డీఓ, తహశీల్దార్, హెల్త్ ఇన్స్పెక్టర్, విద్యుత్ శాఖల అధికారులకు మంచీచెడ్డా చూడాలి. ఈ సమస్యలన్నీ ఒకపక్కనైతే కొత్తమోజులో థియేటర్లు ఎక్కడ మూతబడతాయోనని కార్మికులు, నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. రిలయన్స్ కంపెనీ ఆధ్వర్యంలో మల్టీఫెక్సీ షాపింగ్, థియేటర్లు జిల్లాలో పెట్టేందుకు బడాబాబులు ఏర్పాట్లు చేస్తున్నారు. అవిగనక వస్తే ఇప్పుడున్న థియేటర్లన్నీ మూతపడటం ఖాయంగా కనిపిస్తోంది. మూతబడిన హాళ్లు సినిమాపై పెట్టిన పెట్టుబడులు రాకపోవడంతో సినిమాహాళ్లకు తాళం వేస్తున్నారు. పట్టణ నడిబొడ్డున ఉంటే నిర్వాహకులు ఫంక్షన్ హాళ్లుగా, షాపింగ్ కాంప్లెక్సులుగా మార్చేస్తున్నారు. వనపర్తిలోని గాంధీచౌక్‌లోని జగదీష్ థియేటర్‌ను మూసివేశారు. అలాగే బృందావన్ థియేటర్ మూడేళ్లుగా మూతపడే ఉంది. నెల రోజుల కిందట శ్రీరామా థియేటర్ది అదే పరిస్థితి. నెలకు రూ. 20 వేలకు అద్దెకిస్తామన్నా ఎవరూ ముందుకురాలేని పరిస్థితి. అదేవిధంగా జిల్లా కేంద్రంలోని రాధాకృష్ణ, రామకృష్ణ, మేనక, హనుమాన్, షాద్‌నగర్‌లో వెంకటేశ్వర, రాధాకృష్ణ, మానిక్, నాగర్‌కర్నూల్ రవీంద్ర, రాఘవేంద్ర, గద్వాలల్లో విక్రమ్, కల్వకుర్తిలో లక్ష్మీనరసింహ, జడ్చర్లలో వెంకటేశ్వర, రామకృష్ణ, నారయణపేట లో సత్యనారాయణ, మక్తల్‌లో రాఘవేంద్ర, పెబ్బేర్‌లో వెంకటేశ్వర, దేవరకద్రలో వెంకటేశ్వర, కొత్తకోటలో లక్ష్మీ, తెల్కపల్లి, పెద్దకొత్తపల్లి, కోడేరు, జట ప్రోలు, అలంపూర్‌లో అన్ని థియేటర్లు మూతబడగా, మరికల్ లో ఒకటి,ఆత్మకూర్ హైటెక్, అమరచింతలో రెండు థియేటర్లను మూసేశారు. రోడ్డున పడ్డ కార్మికులు సినిమాహాళ్లలో పనిచేసే వారి బతుకులు రోడ్డున పడుతున్నాయి. ప్రతి సినిమా థియేటర్లో ఒక మేనేజర్, ఇద్దరు ఆపరేటర్లు, ముగ్గురు బుకింగ్ క్లర్క్‌లు, ముగ్గురు గేట్ కీపర్లు, పబ్లిసిటీకి మరో ఇద్దరు, ముగ్గురు వాచ్మెన్లు, పార్కింగ్‌కు ఇద్దరు, క్యాంటీన్‌కు ముగ్గురు, స్వీపర్లతో కలుపుకొని ప్రతి థియేటర్లో సగటున 20 నుంచి 30 మంది చొప్పున కార్మికులు పనిచేస్తారు. పేరుకు నాలుగు ఆటలు అయినప్పటికీ రాత్రి పొద్దుయేంత వరకు ఉండాల్సిందే. జీతాల పెంపునకు యాజమాన్యాలు నిర్వాహణ ఖర్చును ముడిపెడుతున్నారు. సినిమా రంగానికి అలవాటుపడిన కార్మికులు ఇతర పనులు చేయలేక, తెలియక టాకీస్‌లో ఇచ్చే రూ. 2 నుంచి రూ.4వేల జీతంతోనే కాలం వెల్లదీస్తున్నారు. పట్టణాలు, మండల కేంద్రాల్లోని సినిమా థియేటర్ల నిర్వహణ భారమై మూతబడుతున్నాయి. ఒకప్పుడు సినిమా థియేటర్ ఉంటే ఆ చుట్టుముట్టు ప్రాంతాలు అభివృద్ధి చెందేవి. కేరితలతో ఆ ప్రాంతం సందడిగా ఉండేది. అభిమాన కథనాయకుల సినిమాలు విడుదలవుతున్నాయంటే వారం, పది రోజుల నుంచే సినిమా కార్మికుల హడావుడి కనిపించేది. ప్రచార మైకులతో రిక్షావాళ్లు, తోరణాలు, బ్యానర్లు, వాల్‌పోస్టర్లు అంటిస్తూ హుషారెత్తించేవారు. పౌరాణిక, ఆధ్యాత్మిక సినిమాలొచ్చిన్నప్పుడు ఆ సినిమా పాత్రల విగ్రహాలను థియేటర్ ముందుంచేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. థియేటర్లలో గోల తగ్గింది. ఈలలు వేసేవారు తగ్గిపోతున్నారు. సౌండ్ బాక్సులు మూగబోతున్నాయి.