‘బొమ్మ’..బోల్తా | picture flap | Sakshi
Sakshi News home page

‘బొమ్మ’..బోల్తా

Published Wed, May 7 2014 3:15 AM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM

picture flap

వారిది బతుకంతా సినిమా..కాదు, కాదు సినిమానే బతుకు. బాక్సు తెచ్చిన దగ్గరనుంచి రీల్ కదిలే వరకూ..అందరికీ థియేటరే దేవాలయం. భారీ వ్యయంతో దాన్ని నిర్మించిన యజమానులు మొదటి నుంచి గేట్‌కీపర్, బుకింగ్ క్లర్, మేనేజర్, ఇలా ఎన్నో పోస్టులు. అందరికీ ‘బొమ్మే’ ఆధారం. హాలులో రీల్ గిర్రుమంటేనే వారి జీవనం సాగేది. కొన్నేళ్లు పాటు ఈ రంగాన్ని నమ్ముకున్నవారు ఇప్పుడు ఆర్థికంగా చితికి పోతున్నారు.

యజమానులదో బాధ, కార్మికులదో  ఇబ్బంది. ఇలా జిల్లాలోని వేలాది కుటుంబాలు ‘థియేటర్లు’ నడవక పూటగడవని స్థితికి చేరుకుంటున్నాయి. కొందరు ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. ఉన్నవారు...మొదటి ఆటనుంచి చివరి ఆటవరకూ ఆశలు పెంచుకుంటూనే రోజును గడిపేస్తున్నారు. బతుకు గడవక అవస్థలు పడుతున్నారు.
 
 ఒకప్పుడు కొత్త సినిమా వచ్చిందంటే థియేటర్లు ప్రేక్షకులతో క ళకళ లాడుతుండేవి. సినిమాహాళ్ల యజమానులకు, కార్మికులకు చేతినిండా ఉపాధి లభించేది. ప్రస్తుతం పెద్ద హీరోల  సినిమాలు వరుసగా వచ్చినా వారంకూడా ఆడటంలేదు. సినిమా విడుదలైన వారంలోపే పైరసీలు ఎక్కువై ప్రతి కంప్యూటర్‌లో, మొబైల్‌లో సినిమా ప్రత్యక్ష మవడంతో కలెక్షన్లు లేక వినోద కేంద్రాలు మూతపడుతున్నాయి. బుల్లితెరపై వచ్చే వినోద కార్యక్రమాలు కట్టి పడేస్తుండటం కూడా ఓ కారణంగా చెప్పవచ్చు. దీంతో సినిమా రంగంపై ఆధారపడి జీవించే కార్మికుల పొట్ట గడవడం కష్టంగా మారింది.                    
 
 నిర్వాహణ లోపమూ కారణం
 షాద్‌నగర్ : కొన్ని థియేటర ్లలో నిర్వాహణలోపంతో ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారు. 70 ఎంఎం ఏసీ థియేటర్ అని బయట పెద్దపెద్ద బోర్డులు కనిపిసున్నా లోపలమాత్రం ఫ్యాన్లుసైతం సరిగా తిరగవు. రెండున్నర గంటలు కాలక్షేపానికి వెళ్లిన ప్రేక్షకుడు ఉక్కపోతతో బయటకు వస్తున్నాడు. షాద్‌నగర్ పట్టణంలో ఐదు సినిమా థియేటర్‌లు ఉండగా వాటిలో రెండు మినహా మిగతా వాటిలో సౌకర్యాలు సరిగాలేవు. రూ. 35లున్న టికెక్టుపై రూ.50లను వసూలు చేస్తున్నారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు దుర్వాసన వెదజల్లుతున్నాయి. ఇక క్యాంటీన్‌లోని ధరలు బయటిదానికంటే రెట్టింపుగా ఉంటున్నాయి. దానికితోడు బ్లాక్ టికెట్ల బెడద. కొత్త సినిమా విడుదలయ్యిందంటే బ్లాక్‌లో టికెట్‌లు ఇట్ట అమ్ముడుబోతాయి. అభిమానులకు తగ్గట్టు ధర పెంచేస్తుంటారు. ఒక్కోసారి టికెట్ ధర రూ. 500లు కూడా మించిపోతుంది. ఈ కారణాలతో ప్రేక్షకులు వినోద కేంద్రాలకు వెళ్లడానికి వెనకాడుతున్నారు.  
 
 పన్నెండేళ్లుగా..
 పన్నెండేళ్లుగా సినిమా థియేటర్‌లో ఆపరేటర్‌గా పని చేస్తున్నా. ప్రస్తుతం నాకు రూ.5వేల జీతం ఇస్తారు. కుటుంబాన్ని పోషించేందుకు నాకు ఇదే జీవనాధారం. ధరలు పెరగడంతో ఇప్పుడిచ్చే జీతాలు సరిపోవడం లేదు. థియేటర్‌లు నడవడం కష్టమైన రోజుల్లో యాజమానులను డిమాండ్ చేయలేకపోతున్నాం.        
- బాబా, ఆపరేటర్

 నా పిల్లలు కూడా ఇక్కడే..
 నేను 30 ఏళ్ల నుంచి సినిమా థియేటర్‌లో గేట్‌కీపర్‌గా పనిచేస్తున్నా. మొదట్లో సినిమాకు మంచి డిమాండ్ ఉండటంతో అప్పట్లో వచ్చే జీతంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాళ్లం. నా ఇద్దరు కుమారులు కూడా ఇక్కడే పనిచేస్తున్నారు. నాకు ఇప్పుడు రూ. 3వేల జీతం. ప్రేక్షకులు లేకున్నా డ్యూటీ చేయాల్సిందే.         
 - పాష, గేట్ కీపర్

 సినిమా రంగాన్నే నమ్ముకున్నాం..
 నేను  రూ.350ల జీతం నుంచి పని చేస్తున్నా. కొన్నిరోజులు మేనేజర్‌గా పనిచేశా. ఆ థియేటర్ మూతబడటంతో ఖాళీ ఉండలేక రూ.5 వేలకు క్యాటీన్ నిర్వాహకునిగా పనిచేస్తున్నా. వచ్చే జీతంతో ఇంటి అద్దె, కుటుంబ పోషణకే సరిపోతుంది. ప్రభుత్వం మా కష్టాలను గుర్తించి ఆదుకోవాలి.
 -  కె. శ్రీనివాస్, క్యాటీన్ మెన్
 
 లాభాలులేక మూసేశాం
 సినిమా పరిశ్రమ ఖరాబైంది. లాభాలు ఒకప్పటిలా రావట్లేదు. డిస్టిబ్యూటర్లు అనుకుంటే లాభాలు. లేకుంటే లాసులు. నిర్వాహణ భారమై చేసేదేమి లేక థియేటర్‌ను మూసివేశాను.
 -  సతీష్, జగదీష్ థియేటర్ నిర్వాహకుడు
 
 శాటిలైట్ షాక్
 శాటిలైట్ విధానంతో వినోదకేంద్రాల నిర్వాహకులకు ఖర్చు పెరిగింది. ప్రతి ఐదు నెలలకోమారు శాటిలైట్ బల్బు మార్పుకు రూ.45వేలు, ష్లాబింగ్ సిట్టింగ్ డబ్బింగ్ సినిమాలకు వారానికి రూ. 8 నుంచి 9 వేలు, హైబడ్జెట్ సినిమాలకు రూ.5 వేల చొప్పున నెలకు కనీసం రూ.30 వేలు అవుతాయి. వారానికి ఒక రోజు ముందు తీసుకున్నా మొత్తం డబ్బులు కట్టాల్సిందే. కరెంట్ పోయినప్పుడు డీజిల్‌కు మరో రూ.5వేలు, విద్యుత్‌బిల్లు ఎంతలేదన్నా రూ.30 వేలు, సీట్లకు తగ్గ చార్జీలు, కార్మికుల వేతనాలకు రూ.1.50 లక్షలు అవుతాయి. ప్రతి ఏడాది మున్సిపాలిటీ, ఆర్‌అండ్‌బీ, ఫైర్, ఆర్డీఓ, తహశీల్దార్, హెల్త్ ఇన్‌స్పెక్టర్, విద్యుత్ శాఖల అధికారులకు మంచీచెడ్డా చూడాలి. ఈ సమస్యలన్నీ ఒకపక్కనైతే కొత్తమోజులో థియేటర్లు ఎక్కడ మూతబడతాయోనని కార్మికులు, నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. రిలయన్స్ కంపెనీ ఆధ్వర్యంలో మల్టీఫెక్సీ షాపింగ్, థియేటర్‌లు జిల్లాలో పెట్టేందుకు బడాబాబులు ఏర్పాట్లు చేస్తున్నారు. అవిగనక వస్తే ఇప్పుడున్న థియేటర్లన్నీ మూతపడటం ఖాయంగా కనిపిస్తోంది.
 
 మూతబడిన హాళ్లు
 సినిమాపై పెట్టిన పెట్టుబడులు రాకపోవడంతో సినిమాహాళ్లకు తాళం వేస్తున్నారు. పట్టణ నడిబొడ్డున ఉంటే నిర్వాహకులు ఫంక్షన్ హాళ్లుగా, షాపింగ్ కాంప్లెక్సులుగా మార్చేస్తున్నారు. వనపర్తిలోని గాంధీచౌక్‌లోని జగదీష్ థియేటర్‌ను మూసివేశారు. అలాగే బృందావన్ థియేటర్ మూడేళ్లుగా మూతపడే ఉంది. నెల రోజుల కిందట శ్రీరామా థియేటర్‌ది అదే పరిస్థితి.

నెలకు రూ. 20 వేలకు అద్దెకిస్తామన్నా ఎవరూ ముందుకురాలేని పరిస్థితి. అదేవిధంగా జిల్లా కేంద్రంలోని రాధాకృష్ణ, రామకృష్ణ, మేనక, హనుమాన్, షాద్‌నగర్‌లో వెంకటేశ్వర, రాధాకృష్ణ, మానిక్, నాగర్‌కర్నూల్ రవీంద్ర, రాఘవేంద్ర, గద్వాలల్లో విక్రమ్, కల్వకుర్తిలో లక్ష్మీనరసింహ, జడ్చర్లలో వెంకటేశ్వర, రామకృష్ణ, నారయణపేట లో సత్యనారాయణ, మక్తల్‌లో రాఘవేంద్ర, పెబ్బేర్‌లో వెంకటేశ్వర, దేవరకద్రలో వెంకటేశ్వర, కొత్తకోటలో లక్ష్మీ, తెల్కపల్లి, పెద్దకొత్తపల్లి, కోడేరు, జట ప్రోలు, అలంపూర్‌లో అన్ని థియేటర్లు మూతబడగా,  మరికల్ లో ఒకటి,ఆత్మకూర్ హైటెక్, అమరచింతలో రెండు థియేటర్లను మూసేశారు.
 
 రోడ్డున పడ్డ కార్మికులు
 సినిమాహాళ్లలో పనిచేసే వారి బతుకులు రోడ్డున పడుతున్నాయి. ప్రతి సినిమా థియేటర్‌లో ఒక మేనేజర్, ఇద్దరు ఆపరేటర్లు, ముగ్గురు బుకింగ్ క్లర్క్‌లు, ముగ్గురు గేట్ కీపర్లు, పబ్లిసిటీకి మరో ఇద్దరు, ముగ్గురు వాచ్‌మెన్‌లు, పార్కింగ్‌కు ఇద్దరు, క్యాంటీన్‌కు ముగ్గురు, స్వీపర్‌లతో కలుపుకొని ప్రతి థియేటర్‌లో సగటున 20 నుంచి 30 మంది చొప్పున కార్మికులు పనిచేస్తారు. పేరుకు నాలుగు ఆటలు అయినప్పటికీ రాత్రి పొద్దుయేంత వరకు ఉండాల్సిందే. జీతాల పెంపునకు యాజమాన్యాలు నిర్వాహణ ఖర్చును ముడిపెడుతున్నారు. సినిమా రంగానికి అలవాటుపడిన కార్మికులు ఇతర పనులు చేయలేక, తెలియక టాకీస్‌లో ఇచ్చే రూ. 2 నుంచి రూ.4వేల జీతంతోనే కాలం వెల్లదీస్తున్నారు.
 
పట్టణాలు, మండల కేంద్రాల్లోని సినిమా థియేటర్ల నిర్వహణ భారమై మూతబడుతున్నాయి. ఒకప్పుడు సినిమా థియేటర్ ఉంటే ఆ చుట్టుముట్టు ప్రాంతాలు అభివృద్ధి చెందేవి. కేరితలతో ఆ ప్రాంతం సందడిగా ఉండేది. అభిమాన కథనాయకుల సినిమాలు విడుదలవుతున్నాయంటే వారం, పది రోజుల నుంచే సినిమా కార్మికుల హడావుడి కనిపించేది. ప్రచార మైకులతో రిక్షావాళ్లు, తోరణాలు, బ్యానర్లు, వాల్‌పోస్టర్లు అంటిస్తూ హుషారెత్తించేవారు. పౌరాణిక, ఆధ్యాత్మిక సినిమాలొచ్చిన్నప్పుడు ఆ సినిమా పాత్రల విగ్రహాలను థియేటర్ ముందుంచేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. థియేటర్‌లలో గోల తగ్గింది. ఈలలు వేసేవారు తగ్గిపోతున్నారు. సౌండ్ బాక్సులు మూగబోతున్నాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement